రిలయన్స్ జియో రాక ముందు కూడా టెలికాం కంపెనీలు యూజర్లపై కాల్ చార్జీలకు గాను అంతగా భారం మోపలేదు. అప్పుడు కూడా ఆ రేట్లు చీప్‌గానే ఉన్నాయి. ఇక జియో రాకతో వాయిస్ కాల్స్ కాస్తా అన్లిమిటెడ్, ఫ్రీ అయ్యాయి. దీంతో యూజర్లకు ఇప్పుడు వాయిస్ కాల్స్ కోసం ప్రత్యేక ప్యాక్‌లు వేసుకోవాల్సిన అవసరం రావడం లేదు. డేటా ప్యాక్‌లోనే అవి ఫ్రీగా వస్తున్నాయి. దీంతో వాటిని యూజర్లు వాడుకుంటున్నారు. అయితే ఇకపై ఇలా వాయిస్ కాల్స్‌ను ఎవరూ ఫ్రీగా వాడుకోలేరు. ఎందుకో తెలుసా..? కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న జీఎస్టీ బిల్లు వల్ల..! అవును, మీరు విన్నది నిజమే. జీఎస్టీ బిల్లు వల్ల కాల్ చార్జీలు మరింత ప్రియం కానున్నాయి.
కేంద్రం ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్న జీఎస్టీ బిల్లు పరిధిలోకి టెలికాం సేవలను కూడా తెచ్చింది. అయితే అక్కడితో కేంద్రం ఆగలేదు. ఇప్పటి వరకు ఈ సేవలకు గాను టెలికాం కంపెనీలు 15 శాతం పన్ను కడుతూ వచ్చాయి. కానీ ఈ సేవలను జీఎస్టీ కిందకు తెచ్చి పన్నును 18 శాతానికి పెంచారు. దీంతో టెలికాం కంపెనీలు ఆ మేర పన్నును కచ్చితంగా చెల్లించాల్సిందే. దీని వల్ల కంపెనీలకు ఏమీ నష్టం లేదు. ఆ భారమంతా ఎటొచ్చీ జనాలపైనే పడుతుంది. ఈ క్రమంలోనే పెరిగిన పన్ను శాతం మేర కాల్స్, డేటా చార్జీలను పెంచే యోచనలో టెలికాం కంపెనీలు ఉన్నాయి. అలా పెంచకపోతే వాటికే నష్టం వస్తుంది కదా.
కనుక త్వరలో అమలు కానున్న జీఎస్టీ బిల్లు వల్ల కాల్ చార్జీలు, డేటా చార్జీలు పెరగడం ఖాయమని తెలుస్తోంది. అయితే జీఎస్టీ బిల్లు అమలు కాకముందే టెలికాం కంపెనీలు చార్జీలను పెంచితే చూస్తూ ఊరుకోమని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా హెచ్చరించారు. ప్రస్తుతం టెలికాం సేవలు అందుతున్న సర్కిళ్లు మన దేశంలో 22 వరకు ఉండగా, వాటిలో రెండు రాష్ట్రాల పరిధిలో ఉన్నవి 12 వరకు ఉన్నాయి. వీటిన్నింటిపై ఈ ప్రభావం పడనుంది. దీంతో త్వరలో మనం పెరిగిన చార్జీలను భరించాలన్నమాట..! అవును మరి, ఏం చేస్తాం, తప్పదు కదా..!