పాత వాహ‌నాల‌ను అమ్మేశామ‌ని సంబ‌ర‌ప‌డే వారు ఈ విష‌యాన్ని క‌చ్చితంగా తెలుసుకోవాలి. లేకుంటే.?

మీ పాత కారు లేదా టూవీల‌ర్‌ను అమ్మేశారా ? ఇత‌రుల‌కు అమ్మిన‌ట్టు సేల్ అగ్రిమెంట్‌, ఇత‌ర ప‌త్రాలు అన్నీ ప‌క్కాగా తీసుకున్నారా ? అయితే అంత‌టితో మీ ప‌ని అయిపోదు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. వాహ‌నాల‌ను అమ్మ‌గానే సరికాదు, మీరు మీ వాహనాన్ని ఎవ‌రికైనా అమ్మ‌తారో వారు ఆ వాహ‌నాన్ని త‌మ పేరు మీదకు మార్చుకోవాలి. అప్ప‌టి వ‌ర‌కు ఆ వాహ‌నం మీ పేరు మీద‌నే ఉంటుంది. అవును, ఉంటుంది. ఉంటే ఉండ‌నివ్వండి. ఎలాగూ అమ్మిన‌ట్టు ప‌త్రం తీసుకున్నాం క‌దా, ఇక ఆ వాహ‌నం ఏమైతే మాకెందుకు, దాన్ని ఎవ‌రు ఏం చేస్తే మాకెందుకు అని అన‌బోతున్నారా ? అయితే ఆగండి. ఆ వాహ‌నాన్ని కొన్న వ్య‌క్తి చ‌క్క‌గా దాన్ని న‌డిపించుకుంటూ ఉంటే ఫ‌ర్వాలేదు. కానీ దాంతో ఎవ‌రినైనా యాక్సిడెంట్ చేసి చంపితే ? లేదా గాయాల పాలు చేస్తే ? అప్పుడు ఎవ‌రు బాధ్యులు అవుతారు. ఇంకెవ‌రు, వాహ‌నం కొన్న‌ది ఎవ‌రో వారే బాధ్యులు అవుతారు. అనే క‌దా.. మీరు అన‌బోయేది. అయితే అది కాదు. ఆ యాక్సిడెంట్‌కు మీరే బాధ్యులు అవుతారు. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే.

మీరు వాహ‌నం అమ్మాక దాన్ని కొనుగోలు చేసిన వ్య‌క్తి పేరు మీద‌కు ఆ వాహ‌నాన్ని రిజిస్ట్రేష‌న్ చేయించాలి. అలా చేయించ‌నంత కాలం అది మీ పేరు మీద‌నే ఉంటుంది. దీంతో ఆ వాహ‌నాన్ని న‌డిపే వ్య‌క్తి ఏదైనా యాక్సిడెంట్ చేస్తే అందుకు మీరే బాధ్యులు అవుతారు. ఎందుకంటే ఆ వాహ‌నం మీ పేరు మీద‌నే ఉంటుంది క‌దా. క‌నుక ఆ యాక్సిడెంట్‌కు కూడా మీరే బాధ్యులు అవుతారు. న‌ష్ట‌ప‌రిహారం కూడా మీరే చెల్లించాల్సి ఉంటుంది. లేదూ.. అలా కాదు.. అలా ఎలా వీల‌వుతుంది అంటారా… అవుతుంది. మోటారు వాహ‌నాల చ‌ట్టం 1988, సెక్ష‌న్ 2 (30) ప్ర‌కారం ఎవ‌రైనా త‌మ వాహ‌నాన్ని అమ్మాక దాన్ని కొనుగోలు చేసిన వ్య‌క్తి పేరు మీద‌కు ఆ వాహనాన్ని రిజిస్ట్రేష‌న్ చేయించాలి. అలా చేయించ‌నంత కాలం ఆ వాహ‌నం పాత ఓన‌ర్ పేరిటే ఉంటుంది. ఈ క్ర‌మంలో కొత్త ఓన‌ర్ ఏదైనా యాక్సిడెంట్ చేస్తే అది కొత్త ఓన‌ర్ మీద‌కు రాదు, పాత ఓన‌ర్ మీద‌కే వ‌స్తుంది. ఎందుకంటే ఇంకా రిజిస్ట్రేష‌న్ పాత ఓన‌ర్ పేరు మీద‌నే ఉంటుంది క‌దా. మోటారు వాహ‌నాల చ‌ట్టం కూడా ఇదే చెబుతోంది. సుప్రీం కోర్టు కూడా ఇదే విష‌యాన్ని ఓ కేసులో తీర్పుగా చెప్పింది.

విజ‌య్ కుమార్ అనే వ్య‌క్తి 2007, జూలై 12న త‌న కారును వేరే వ్య‌క్తికి అమ్మాడు. అమ్మిన‌ట్టు ప‌త్రాలు అన్నీ తీసుకున్నాడు. కానీ ఆ వాహ‌నాన్ని కొన్న వ్య‌క్తి పేరు మీద రిజిస్ట్రేష‌న్ మార్పు చేయించ‌లేదు. దీంతో ఆ వాహ‌నం విజ‌య్ కుమార్ పేరిటే ఉంది. అనంత‌రం అది రెండు సార్లు మ‌ళ్లీ చేతులు మారింది. దీంతో చివ‌ర‌కు దాన్ని మీర్ సింగ్ అనే వ్య‌క్తి కొన్నాడు. అప్ప‌టికీ ఇంకా ఆ వాహ‌నం విజ‌య్ పేరిటే ఉంది. అయితే మీర్ సింగ్ కొన్న ఆ కారును త‌న డ్రైవ‌ర్ న‌డుపుతూ యాక్సిడెంట్ చేశాడు. దీంతో ఆ యాక్సిడెంట్‌లో ఓ వ్య‌క్తి చ‌నిపోగా, మ‌రొక‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో కోర్టు వాహ‌నం ఓన‌ర్ అయిన విజ‌య్ కుమార్‌కు రూ.3.85 ల‌క్ష‌ల జ‌రిమానా వేసింది. అయితే దీన్ని విజ‌య్ మరో కోర్టులో స‌వాల్ చేయ‌గా, అప్పుడు అత‌నికి అనుకూలంగానే తీర్పు వ‌చ్చింది. కానీ ప్ర‌త్య‌ర్థులు సుప్రీం కోర్టుకు ఎక్క‌డంతో అప్పుడు సుప్రీం కోర్టు మోటారు వాహ‌నాల చ‌ట్టాన్ని గుర్తుకు తెస్తూ వాహ‌నం విజ‌య్ పేరిటే ఉంది క‌నుక అత‌నే న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని తీర్పునిచ్చింది. క‌నుక.. మీరు మీ వాహ‌నాన్ని ఎవ‌రికైనా అమ్మితే కేవ‌లం అమ్మిన‌ట్టు ప‌త్రాలు మాత్ర‌మే తీసుకోకండి. దాన్ని కొనుగోలు చేసిన వారి పేరు మీద‌కు రిజిస్ట్రేష‌న్‌ను మార్పు చేయించండి. దీంతో ఓన‌ర్ పేరు మారుతుంది. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. అదే అలా కాకుండా చేస్తే ఇబ్బందులు త‌ప్ప‌వు. క‌నుక జాగ్ర‌త్త‌..!

Comments

comments

Share this post

scroll to top