జీవితం అంటే అంతే. ఎప్పుడు కిందపడతామో, ఎప్పుడు నిలబడతామో మనకే తెలియదు. అది తీసుకువెళ్లినట్టు వెళ్లాల్సిందే. కాకపోతే మనం చేసే పనులు కూడా మన జీవిత సుఖ దుఃఖాలకు, మనకు పేరు రావడానికి, ధనం కలగడానికి కారణమవుతుంటాయి. ఈ క్రమంలోనే మనం నిన్న ఉన్న స్థితిలో నేడు ఉండం. నేటి స్థితి రేపు ఉంటుందా, లేదా అనేది కూడా చెప్పలేం. ఓడలు, బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ధనికులు పేదలు అవుతారు, పేదలు ధనికులు అవుతారు. ఇలా అవడాన్ని లైఫ్ ఎప్పుడు డిసైడ్ చేస్తుందో ఎవరికీ తెలియదు. సరిగ్గా ఇదే సూత్రాన్ని చెబుతున్నాడు అతను.
”మాది చాలా పేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడదు. గత 40 ఏళ్ల నుంచి జామకాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నా. అయినప్పటికీ పిల్లలకు ఏ లోటూ చేయలేదు. వారిని కష్టపడి చదివించా. దీంతో వారు ఎంబీఏ చదివారు. బ్యాంక్ ఉద్యోగాల్లో వారు సెటిల్ అయ్యారు. ఇప్పుడు వారితో బ్యాంక్ లోపలికి వెళ్తుంటే చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు అదే బ్యాంక్ వారు నన్ను చూసి నవ్వారు. కానీ ఇప్పుడు వారే నాకు శాల్యూట్ చేస్తున్నారు. అవును, జీవితంలో ఏదైనా ఎప్పుడైనా జరగవచ్చు. దాన్ని సరిగ్గా అంచనా వేయలేం. కానీ మనం చేయాల్సిందల్లా ఒక్కటే. మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే మనం కలలు గన్న అందమైన జీవితం మన సొంతమవుతుంది.”
పైన చెప్పింది ఓ వ్యక్తి రియల్ స్టోరీ. యదార్థ గాథ. అతను 40 ఏళ్లుగా జామకాయలు అమ్ముకుంటున్నప్పటికీ అందులో వచ్చేదాంతోనే ఓ వైపు కుటుంబాన్ని పోషించాడు. మరో వైపు పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాడు. అందమైన జీవితం అంటే ఏమిటో అతనికి బాగా తెలుసు. అందుకే అలాంటి జీవితం వచ్చే వరకు ఎదురు చూశాడు. ఇప్పుడు దాన్ని ఆస్వాదిస్తున్నాడు. చాలా మందికి ఇదొక స్ఫూర్తినిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.