చూపు తిప్పుకోనీయని అందం. చక్కని శరీర ఆకృతి. మంచి దేహదారుఢ్యం… నిజమైన అందానికి ఇవేనా కొలమానాలు..? అసలు నిజమైన అందం అంటే ఎలా ఉంటుంది..? అది మనస్సులో ఉంటుంది. బాహ్య శరీరంపై ఉండే అందం కాదు, శరీరం లోపల అది ఉంటుంది. మనస్సు ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత నిజమైన అందం ఉన్నట్టు లెక్క. అంతే కానీ… బాహ్య శరీరం తళుకుబెళుకులతో ఒక వ్యక్తి అందం నిర్ణయించరాదు. అవును, సరిగ్గా ఇలా అనుకున్నారు కాబట్టే వారిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ప్రపంచం మొత్తం ఆ జంట పట్ల కామెంట్లు చేస్తున్నా వారు పట్టించుకోవడం లేదు.
చిత్రాల్లో చూశారుగా. వారు కాంబోడియాకు చెందిన ప్రేమికులు. యువతి చాలా అందంగా ఉండగా, యువకుడు మాత్రం అంద విహీనంగా ఉన్నాడు. అయినప్పటికీ వారి మనస్సులు కలిశాయి. దీంతో ఇద్దరూ దగ్గరయ్యారు. ఆ తరువాత ప్రేమలో పడ్డారు. ఇంకేముంది, అక్కడా ఇక్కడా అని లేకుండా పర్యాటకుల్లా విహరిస్తున్నారు. ఈ క్రమంలో వారు తీసుకున్న ఫొటోలను కూడా తమ తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తున్నారు. అయితే లోకం తీరు తెలుసు కదా..! వీరిద్దరి విషయంలోనూ అది తన వక్రబుద్ధిని చాటుకుంది.
యువతి అందంగా ఉన్నప్పటికీ యువకుడు అందంగా లేని కారణంగా వారిని చూసిన నెటిజన్లు, బయటి వ్యక్తులు నవ్వుతున్నారు. మీరిద్దరూ ఒకరికి ఒకరు సరిపోరని కొందరు కామెంట్లు పెడుతుంటే, మరికొందరు… అసలిది జంటేనా..? జంట అంటే ఎలా ఉండాలి..? అని కామెంట్లు చేస్తున్నారు. అయినప్పటికీ వీరు ఆ కామెంట్లను, ఎగతాళిలను, హేళనలను పట్టించుకోవడం లేదు. ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఫొటోలను షేర్ చేస్తూనే ఉన్నారు. మరి ఈ జంటకు మనమూ బెస్టాఫ్ లక్ చెబుదామా..!