మొదటి వ్యక్తి: గదేందదీ… స్నాప్ చాట్ యాప్ అట..? ఏందది..? ఏం జేస్తరు దాంతో..? మనకు వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్… గవే తెల్సు కదా… ఇంతకీ స్నాప్ చాట్ సంగతేందిరా బై..!
రెండో వ్యక్తి: అరే… ఏం లేదన్నా… స్మార్ట్ఫోన్లల్ల ఫొటోలు తీస్కుంటరు కదా… వాటికి మీసాలు పెట్టి, తోకలు అతికించి, ఇష్టం వచ్చినట్టు కలరింగ్ ఇచ్చి దోస్తులతో షేర్ చేస్తరు. వాళ్లు వాటిని చూసిన వెంటనే ఆ ఫొటోలు డిలీట్ అయితయి. గంతే…
మొదటి వ్యక్తి: గంతేనా… ఇంకేం లేదా… గా దానికే… యాప్ ఎందుకుర బై. వాట్సప్ ఉన్నది కదా… ఇంక గదెందుకు..?
రెండో వ్యక్తి: ఏమో అన్న… నేను సుత గా యాప్ వాడ. మనకు వాట్సప్ మాత్రమే తెల్సు. నిన్న మొన్న వార్తల్లో చదివిన. గందుకే గా స్నాప్‌చాట్ గురించి తెల్సింది. గంతే..!
మొదటి వ్యక్తి: ఏం చదివినవ్ రా… వార్తలల్ల ఏమొచ్చింది..?
రెండో వ్యక్తి: ఏం లేదన్నా… గా వాట్సప్ సీఈఓ ఉన్నడు కదా… గాని పేరు ఇవాన్ స్పీగల్ అట. గాడు మన దేశం గురించి కారు కూతలు కూసిండు. మనది పేద దేశం అట. గాని యాప్ స్నాప్‌చాట్ ఇక్కడ వాడరట. అది డబ్బున్నోళ్లు వాడే యాప్ అట. వాళ్ల బిజినెస్‌కు ఇండియా సూట్ కాదట.
మొదటి వ్యక్తి: గదేందిరా… గంత మాటన్నడ..! ఆనికి ఏం పోయే కాలం వొచ్చిందిర, మన దేశం గురించి మాట్లాడనీకి. గాన్ని ఏం చేయాల్రా..?
రెండో వ్యక్తి: ఏం లేదన్నా.. ఆని యాప్ స్నాప్‌చాట్‌కు తక్కువ రేటింగ్ ఇయ్యాలె. గూగుల్ ప్లే స్టోర్, ఐఫోన్ యాప్ స్టోర్లలో ఆని యాప్ ఉంది. వాటికి 1 స్టార్ రేటింగ్ ఇయ్యి. నీ అభిప్రాయం జెప్పు. గంతే… గానికి తెలుస్తది, ఇండియా పవర్. గట్ల దేశం మొత్తం మీద చేస్తే, ఇంక ఉంటడా వాడు. దెబ్బకు మన తాన దుక్నం మూస్కుంటడు.
మొదటి వ్యక్తి: కరెక్టేరా… గట్లనే జెయ్యాలె. ఇగో… నా ఫోన్. గిండ్ల ముందుగాల్ల నువ్వు జెప్పిన పన్జెయ్. దెబ్బకు దిగి రావాలె కొడుకు..!
రెండో వ్యక్తి: గట్లనే అన్న..!
మన దేశంలో స్నాప్ చాట్ గురించిన వార్త తెలిసిన వారందరిలోనూ ఇప్పుడు పైన చెప్పిన లాంటి పరిస్థితే నెలకొంది. ఆ యూజర్, ఈ యూజర్ అని తేడా లేదు, స్నాప్ చాట్ సీఈఓ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారత స్మార్ట్ ఫోన్ యూజర్లను విపరీతంగా స్పందించేలా చేస్తున్నాయి. దీంతో చాలా మంది ఇప్పుడు స్నాప్‌చాట్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ లను అన్ ఇన్స్టాల్ చేయడమే కాదు, ఆయా ప్లాట్‌ఫాంలలో ఈ యాప్‌కు1 స్టార్ రేటింగ్ ఇస్తూ తమ కామెంట్లను వినిపిస్తున్నారు. స్నాప్‌చాట్ సీఈవో ఇవాన్ స్పీగల్ దిమ్మ తిరిగేలా కామెంట్లు పెడుతున్నారు.
కేవలం యాప్ స్టోర్లలో మాత్రమే కాదు, ట్విట్టర్, ఫేస్బుక్… ఇలా దాదాపుగా అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ నెటిజన్లు తమ నిరసన గళం వినిపిస్తున్నారు. అసలింతకీ ఇవాన్ ఈ వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు కాదు. గతంలో అంటే 2015లో తమ సంస్థలో జరిగిన అంతర్గత మీటింగ్‌లో అతను ఈ వ్యాఖ్యలు చేశాడట. అవి ఇప్పుడే బయటికి వచ్చాయి. అది ఎలా అంటే… స్నాప్‌చాట్‌లో పనిచేసిన ఓ ఉద్యోగి ఆ మీటింగ్ తాలూకు వివరాలను తాజాగా వెల్లడించాడు. అప్పుడు ఇవాన్ ఏమన్నాడో ఇప్పుడా ఉద్యోగి చెప్పాడు. దీంతో ఇవాన్ వ్యాఖ్యల పట్ల దేశంలో దుమారం రేగుతోంది. భారత్‌లోనే కాదు, ఇతర దేశాల్లో ఉన్న ఇండియన్స్ కూడా ఇవాన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే స్నాప్‌చాట్ యాప్ కు దుర్గతి పడుతుంది, ఖబడ్దార్ అని హెచ్చరిస్తున్నారు. మరి ఇవాన్ క్షమాపణలు చెబుతాడా..? లేదా..? అన్నది వేచి చూడాలి..!
అయినా ఏమయ్యా ఇవాన్..! నీకు మా దేశమే దొరికిందా, అలా వ్యాఖ్యలు చేయడానికి..! మమ్మల్ని పేద దేశం అంటావా..? మరప్పుడు మా దేశంలో మీ యాప్‌ను ఎందుకు విడుదల చేశావ్..? నీకు అనుకూలమైన దేశాల్లోనే చేయాల్సింది. అప్పుడు అక్కడి నుంచే నీకు ఆదాయం వచ్చేది కదా. ఓ వైపు మా యూజర్ల వల్ల నువ్వు లాభం పొందుతూనే అలా వ్యాఖ్యలు చేయడం ఏం బాగాలేదు. తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పుకో. లేదంటే మా దేశ పౌరుల సోషల్ మీడియా పవర్ ఏంటో రుచి చూపిస్తాం..!