పాము అంటే భయం ఉండనిది ఎవరికి చెప్పండి..! దాన్ని చూస్తేనే ఎవరైనా ఆమడ దూరం పారిపోతారు. ఇంకొందరైతే పాము పేరు చెబితేనే ఒళ్లు జలదరించినట్టు చేస్తారు. అయితే ఆ గ్రామంలోని ప్రజలకు మాత్రం పామంటే అస్సలు భయం లేదు. ఇంకా చెప్పాలంటే వారిని పాము కుట్టినా వారికి ఏమీ కాదు. అవునా, అని ఆశ్చర్యపోకండి..! ఇది నిజమే. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందంటే…
బీహార్లోని సమిస్టిపూర్లో ఉండే ప్రజలు పాములతో ఆడుకుంటారు. అక్కడి వారిని పాములు ఏమీ చేయవు. చేయవంటే చేయవని కాదు, కుడతాయి, కానీ వారికి ఏమీ కాదు. పెద్ద పెద్ద నాగు పాము, తాచు పాములతో వారు ఆటలాడతారు. సమిస్టిపూర్లో ఉండే సింధియా ఘాట్ అనే ప్రాంతంలో వారు ఆ పాములను వదిలి పెడతారు. ఇక ప్రతీ ఏటా నాగ పంచమి వచ్చిందంటే చాలు ఇక అప్పుడు అలా పాములాటలు ఎక్కువగానే ఉంటాయి. అయితే అసలు వారు అలా అవడానికి కారణమేంటో తెలుసా..? భాగవతి అనే ఓ దేవత వల్ల..!
భాగవతి అనే ఓ దేవత తమను ఆశీర్వదించిందని, అందుకే పాములు తమను కుట్టినా తమకు ఏమీ కాదని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. ఆ గ్రామంలోని కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పాములను పట్టడమంటే అది వెన్నతో పెట్టిన విద్యే. కాగా ప్రతి ఏటా ఆ గ్రామంలో నిర్వహించే నాగపంచమిని కూడా గత 300 ఏళ్ల సంవత్సరాల నుంచి జరుపుతూ వస్తున్నారట. ఆ రోజున గ్రామస్తులంతా ఒక్కచోట చేరి నాగదేవతకు పెరుగు, వేప ఆకు నైవేద్యంగా పెట్టి దాన్నే వారు కూడా తింటారు. ఆ సమయంలో నాగదేవతను ఏది కోరుకుంటే అది జరుగుతుందట. అలా అని ఆ గ్రామస్తులు నమ్ముతారు. తెలుసుకున్నారుగా, సమిస్టిపూర్ గ్రామస్తుల విచిత్రమైన ఆచారం, అలవాటు గురించి. అబ్బో, మనకైతే అలా సాధ్యం కాదు లెండి. పామును చూస్తేనే పై ప్రాణాలు పైనే పోతాయి. అంతే కదా..!