ఆ జిల్లా క‌లెక్ట‌ర్ ఒకే రోజు 2168 ఇంకుడు గుంత‌ల‌ను నిర్మింప‌జేసి రికార్డు సృష్టించారు…

ఇండ్లు, ఆఫీసులు, పాఠ‌శాల‌లు, హోట‌ల్స్‌, మాల్స్‌… ఇలా ఏ నిర్మాణ‌మైనా వాటిలో ఉండే కిచెన్, టాయిలెట్స్ త‌దిత‌ర ప్ర‌దేశాల నుంచి వచ్చే వ్య‌ర్థ నీరు ఎక్క‌డికి పోతుంది? ఎక్క‌డికి పోతుంది, అంతా క‌లిసి ఒక డ్రైనేజీ కాలువ‌కు, అక్క‌డి నుంచి మ‌రో దగ్గ‌రికి వెళ్లి చివ‌ర‌కు అది ఎక్క‌డో అంత‌మైపోతుంది. కొన్ని చోట్ల స‌ముద్రాలు, చెరువుల్లో క‌లుస్తుంది. మ‌రికొన్ని చోట్ల అలాగే నిల్వ ఉండి దాని వెంట వ‌చ్చీ పోయే వారికి దుర్గంధ‌భ‌రిత‌మైన వాస‌న‌ను ఇస్తుంది. మ‌ర‌దే మురుగునీరు భూమి లోప‌లికి ఇంకితే.? అప్పుడేమ‌వుతుంది..? భూగ‌ర్భ జ‌లం పెరుగుతుంది. స‌రిగ్గా ఇదే ఆలోచించాడు ఆ జిల్లా క‌లెక్ట‌ర్‌. చేతి పంపులు, న‌ల్లాల వద్ద నుంచి పారే మురుగు నీటిని వృథాగా పోనివ్వ‌కుండా భూమిలోకి ఇంకేలా ఏర్పాటు చేశాడు. అయితే అత‌ను ఇలాంటి ఇంకుడు గుంత నిర్మాణాన్ని ఒకే ప్ర‌దేశంలో చేశాడ‌నుకుంటే మీరు పొర‌పాటు ప‌డిన‌ట్టే. ఎందుకంటే ఒకే రోజు కొన్ని వేల ప్ర‌దేశాల్లో ఆయ‌న ఈ గుంతల నిర్మాణం జ‌రిగేలా చూశాడు.

soak-pits-collector

బీహార్‌లోని సీతామ‌ర్హి జిల్లా క‌లెక్ట‌ర్ ఆ జిల్లాలో ఉన్న ప‌లు ప్రాంతాల్లో ఒకే రోజు ఏకంగా 2168 ఇంకుడు గుంత‌ల‌ను నిర్మింప‌జేశారు. డిస్ట్రిక్ట్ వాట‌ర్ అండ్ హైజీన్ క‌మిటీ, యునిసెఫ్‌ల స‌హ‌కారంతో సీతామ‌ర్హిలో ఉన్న పాఠ‌శాల‌లు, మ‌ద‌ర్సాలు, అంగ‌న్‌వాడీలు, ఆరోగ్య కేంద్రాలు, పోలీస్ స్టేష‌న్లు, డివిజ‌న్ ఆఫీస్‌లు త‌దిత‌ర ప్రాంతాల్లో ఆయా పాఠ‌శాల‌ల అధ్యాప‌కులు, కేంద్రాల అధికారుల‌ను స‌మ‌న్వ‌యం చేసి అన్ని ప్ర‌దేశాల్లోనూ ఒకేసారి ఇంకుడు గుంతల‌ను ఏర్పాటు చేయ‌గ‌లిగారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న చేతి పంపులు, న‌ల్లాల వ‌ద్ద ఆయ‌న ఈ ఏర్పాటు జ‌రిగేలా చూశాడు. దీంతో వాటి వ‌ద్ద ఉత్ప‌న్న‌మ‌య్యే మురుగు నీరు నేరుగా ఇంకుడు గుంత‌ల్లోకే వెళ్తుంది. అంతేకాదు వ‌ర్షాకాలంలో ప‌డిన వ‌ర్షం కూడా ఆ గుంత‌ల్లోకే ఇంకుతుంది.

soak-pits-collector

ఆ జిల్లాలో ఏర్పాటు చేసిన 2168 ఇంకుడు గుంత‌ల వ‌ల్ల ఏటా కొన్ని కోట్ల లీట‌ర్ల భూగ‌ర్భ జ‌లం త‌యార‌వుతుంద‌ట‌. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర‌లోని లాతూర్‌కు రైళ్ల ద్వారా నీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్నారు క‌దా, ఆ… అలాంటివే 500 రైళ్లు తెచ్చే నీరు ఎంత ప‌రిమాణంలో ఉంటుందో అంతే ప‌రిమాణంలో భూగ‌ర్భ జ‌లం త‌యార‌వుతుంద‌ట‌. ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దూ. అయితే ఇది నిజ‌మేన‌ట‌. కాగా ఇంత‌టి భారీ స్థాయిలో ఇంకుడు గుంత‌ల‌ను ఏర్పాటు చేసిన జిల్లాగా సీతామ‌ర్హి రికార్డు కూడా సృష్టించింద‌ట‌.

అయితే కేవ‌లం ఈ ఘ‌న‌త‌నే కాదు, సీతామ‌ర్హి జిల్లా మ‌రో ఘ‌న‌త‌ను కూడా సాధించింది. 45 రోజుల్లోనే 4 పంచాయ‌తీల‌ను బ‌హిరంగ మ‌ల విస‌ర్జ‌న లేని గ్రామాలుగా మార్చింది. ఇదంతా ఆ క‌లెక్ట‌ర్ చ‌లువే అంటున్నారు అక్క‌డి జనం. ఇలాంటి ప్ర‌భుత్వ అధికారులు ప్ర‌తి జిల్లాలోనూ ఉంటే అప్పుడు దేశం ఎంతో ప్ర‌గ‌తి ప‌థంలో ప‌య‌నిస్తుంది క‌దూ!

Comments

comments

Share this post

scroll to top