మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ కాకుండా ఉండాలంటే……ఈ 7 సూచనలు పాటించాలి.

నేడు న‌డుస్తోంది ఆధునిక టెక్నాల‌జీ యుగం. ఏ ప‌ని కోస‌మైనా మ‌నం నిత్యం టెక్నాల‌జీ ఆధారిత ప‌రిక‌రాల‌నే వాడుతున్నాం. అలాంటి వాటిలో స్మార్ట్‌ఫోన్లు కూడా ఉన్నాయి. వాటితో ఇప్పుడు మ‌నం కేవ‌లం కాల్స్, ఎస్ఎంఎస్ మాత్ర‌మే కాదు, బ్యాంకింగ్‌, టిక్కెట్లు బుక్ చేసుకోవ‌డం, బిల్లులు చెల్లించ‌డం వంటి అనేక ఆర్థిక లావాదేవీల‌ను కూడా నిర్వ‌హిస్తున్నాం. ఈ క్ర‌మంలో మ‌నం ఏమాత్రం ఏమ‌రుపాటుగా ఉన్నా మొద‌టికే మోసం వ‌స్తుంది. మన స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న విలువైన స‌మాచారం అంతా హ్యాక‌ర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. అలా వెళ్లాక ఏం జ‌రుగుతుందో మ‌న‌కు బాగా తెలుసు. బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డులో ఉన్న డ‌బ్బంతా దుండ‌గులు కాజేస్తారు. ఆ త‌రువాత మ‌నం బాధ‌ప‌డీ ప్ర‌యోజ‌నం ఉండ‌దు. క‌నుక హ్యాకర్ల బారి నుంచి మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవాలంటే స్మార్ట్‌ఫోన్‌లో త‌ప్ప‌నిస‌రిగా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

phone-hacking
పాస్‌వ‌ర్డ్ లాక్‌…
ఫోన్‌ను ఆన్ చేసిన‌ప్పుడ‌ల్లా పాస్‌వ‌ర్డ్‌ను అడిగేలా లాక్‌ను సెట్ చేసుకోవాలి. దీంతో ఫోన్ సుర‌క్షితంగా ఉంటుంది. చీటికీ మాటికీ లాక్‌ను తీయాల్సి వ‌స్తుంద‌ని విసుగు చెంద‌వ‌ద్దు. అలా విసుగు చెందితే విలువైన మ‌న సమాచారం త‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతుంది. క‌నుక ఫోన్‌కు లాక్ క‌చ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. అది పిన్‌, పాస్‌వ‌ర్డ్‌, ప్యాట్ర‌న్ ఏదైనా కావ‌చ్చు, లాక్ త‌ప్ప‌నిస‌రి.

ఆటోమేటిక్ క‌నెక్ష‌న్‌…
కొంద‌రు త‌మ త‌మ ఫోన్ల‌లో ఎప్పుడూ వైఫై లేదంటే మొబైల్ డేటాను ఆన్‌చేసి ఉంచుతారు. అయితే అలా ఉంచాల్సిన ప‌నిలేదు. అవ‌స‌రం ఉన్న‌ప్పుడు వాటిని ఆన్‌, ఆఫ్ చేసుకుంటే స‌రిపోతుంది. ఎందుకంటే మొబైల్ డేటా సంగ‌తి మాట అటుంచితే వైఫై ఎప్పుడూ ఆన్‌లో ఉంద‌నుకోండి, ఒక్కో సారి ఓపెన్ వైఫై లేదా ప‌బ్లిక్ వైఫై ల‌కు క‌నెక్ట్ అయితే హ్యాక‌ర్ల నుంచి ఏదైనా ప్ర‌మాదం ఎదుర‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది. వారు మీ డివైస్‌ను కంట్రోల్‌లోకి తీసుకునేందుకు చాన్స్ ఉంటుంది. క‌నుక ఆటోమేటిక్ నెట్‌వ‌ర్క్ క‌నెక్ష‌న్‌ల‌ను ఆపేయడం ఉత్త‌మం.

డేటా ఎన్‌క్రిప్ష‌న్‌…
స్మార్ట్‌ఫోన్ల‌లో సెట్టింగ్స్‌, సెక్యూరిటీ అనే విభాగంలోకి వెళితే అక్క‌డ డేటా ఎన్‌క్రిప్ష‌న్ అనే ఫీచ‌ర్ డిజేబుల్ అయి ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. దీంతో మీ డివైస్‌లోని సమాచారాన్ని అంత ఈజీగా ఎవ‌రూ త‌స్క‌రించ‌లేరు. ఎందుకంటే డివైస్‌లోని వివ‌రాల‌న్నీ 256 బిట్ లేదా 128 బిట్ సెక్యూరిటీతో లాక్ అయి ఉంటాయి. వాటిని ఓపెన్ చేయ‌డం అంత సుల‌భం కాదు. కనుక హ్యాక‌ర్ల నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.

https బ్రౌజింగ్‌…
చాలా మంది ఫోన్‌ల‌లో యాప్‌ల‌లో కాకుండా బ్రౌజ‌ర్ల‌లో కొన్ని సార్లు ఆర్థిక లావాదేవీలు నిర్వ‌హిస్తారు. అలాంట‌ప్పుడు ఒక్కోసారి వెబ్‌సైట్ అడ్ర‌స్‌ల‌ను వారు స‌రిగ్గా గ‌మ‌నించరు. అయితే ఎవ‌రైనా ఏదైనా వెబ్‌సైట్‌ను టైప్ చేసి ఎంట‌ర్ చేస్తే అప్పుడు వ‌చ్చే వెబ్‌సైట్ అడ్ర‌స్‌ను ఓసారి క‌చ్చితంగా ప‌రిశీలించాలి. బ్యాంకింగ్ సంబంధ సైట్ అయితే అందులో సైట్ అడ్ర‌స్‌కు ముందు https అని క‌చ్చితంగా ఉంటుంది. అలా లేదంటే ఆ సైట్ సెక్యూర్డ్ కాద‌ని తెలుసుకోవాలి. వెంట‌నే ట్రాన్సాక్ష‌న్ ఆపేయాలి. అందులో ఎలాంటి వివ‌రాలు న‌మోదు చేయ‌కూడ‌దు. లేదంటే మీ స‌మాచారం హ్యాక‌ర్ల‌కు ఇట్టే తెలుస్తుంది.

యాప్‌లు…
ఆండ్రాయిడ్‌, ఐఫోన్ ఏది వాడినా వాటిలో ఆయా స్టోర్స్‌లో ఉండే అప్లికేష‌న్ల‌ను మాత్ర‌మే ఇన్‌స్టాల్ చేసుకోండి. ఆండ్రాయిడ్ అయితే గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లండి. అదే ఐఫోన్ అయితే యాపిల్ స్టోర్‌కు వెళ్లి మీకు కావ‌ల్సిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇత‌ర వేరే ఏ సైట్ నుంచైనా యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌ద్దు. ఎందుకంటే వాటిలో 99 శాతం వ‌ర‌కు వైర‌స్‌లే ఉంటాయి. దీని వ‌ల్ల అలాంటి థ‌ర్డ్ పార్టీ స్టోర్ యాప్‌ల‌ను మీ ఫోన్ల‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే దాంతో డివైస్‌లో ఉన్న స‌మాచారం హ్యాక‌ర్ల‌కు చేరుతుంది. వారు సుల‌భంగా ఆ డివైస్‌ను త‌మ అధీనంలోకి తీసుకుంటారు. క‌నుక యాప్ స్టోర్స్ కాకుండా థ‌ర్డ్ పార్టీ సైట్ల‌లో దొరికే యాప్‌ల‌ను అస్స‌లు ఇన్‌స్టాల్ చేయ‌కూడ‌దు.

పోర్న్ సైట్లు…
ఇంత‌కు ముందు కంప్యూట‌ర్ల‌లో పోర్న్ దృశ్యాలు ఏవిధంగా చూసే వారో ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల‌లో పోర్న్ (అశ్లీల‌) వీడియోల‌ను చూడ‌డం కూడా ఎక్కువైపోయింది. అయితే ఇలా చేయ‌డం చాలా ప్ర‌మాద‌క‌రం. ఎందుకంటే అలాంటి సైట్ల‌లో నుంచి మ‌న డివైస్‌ల‌లోకి మాల్‌వేర్‌, వైర‌స్‌లు చొర‌బ‌డుతాయి. అవి గ‌న‌క ప్ర‌వేశిస్తే ఇక డివైస్ మొత్తం హ్యాక‌ర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. క‌నుక పోర్న్ వీడియోల వైపు  వెళ్ల‌కూడ‌దు.

ఈ-మెయిల్స్‌, ఎస్ఎంఎస్‌లు…
ఇక చివ‌రిగా ఈ-మెయిల్స్, ఎస్ఎంఎస్‌లు. మీకు ఫ్రెండ్, కుటుంబ స‌భ్యులు లేదా ఏదైనా బ్యాంక్ నుంచి వ‌చ్చిన‌ట్టుగా కొన్ని సార్లు ఈ-మెయిల్స్‌, ఎస్ఎంఎస్‌లు, ఇన్‌స్టంట్ మెసేజ్‌లు వ‌స్తాయి. అయితే వాటిని ఓపెన్ చేసే ముందు ఒక‌సారి జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాలి. సాధార‌ణంగా ఎవ‌రూ బ్యాంకింగ్ డిటెయిల్స్ ఇవ్వ‌మ‌ని ఎవ‌రినీ అడ‌గ‌రు. బ్యాంకులైతే ఆ ప‌ని అస్స‌లు చేయ‌వు. ఒక వేళ మీ కుటుంబ స‌భ్యులు లేదా ఫ్రెండ్స్ ఎవ‌రైనా నిజంగా ఆయా డిటేల్స్ కావాల‌ని అడిగితే ఒక‌సారి వారికి కాల్ చేసి దృవీక‌రించుకోండి. అంతే కానీ అలా అడ‌గ‌కుండా ఎలాంటి వివ‌రాలు ఇవ్వ‌వ‌ద్దు. ఇక ఇందులో ఇంకో విష‌య‌మేమిటంటే ఒక్కోసారి అలాంటి మెయిల్స్ లేదా మెసేజ్‌ల‌లో లింక్‌లు ఉంటాయి. వాటిని క్లిక్ చేస్తే ఏదైనా ఆఫ‌ర్ వ‌స్తుంద‌నో, లేదంటే మ‌రో గిఫ్ట్ వ‌స్తుంద‌నో మెసేజ్‌లో మభ్య‌పెడ‌తారు. అలాంటి సంద‌ర్భాల్లో ఆ లింక్‌ల‌ను అస్స‌లు ఓపెన్ చేయ‌కూడ‌దు. చేస్తే అవి వేరే వెబ్‌సైట్ల‌కు రీడైరెక్ట్ అయి ఏవైనా యాప్‌ల‌ను మీ డివైస్‌ల‌లో ఇన్‌స్టాల్ చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. అప్పుడు ఇక మీ ఫోన్‌లో ఉన్న స‌మాచారం అంతా హ్యాక‌ర్లకు చేరుతుంది. క‌నుక అలా చేయ‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం.

పై సూచ‌న‌లు పాటిస్తే మీ స్మార్ట్‌ఫోన్ల‌ను హ్యాక‌ర్ల బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చు. దీంతోపాటు ఆర్థిక లావాదేవీల‌ను ఎలాంటి భ‌యం లేకుండా నిర‌భ్యంత‌రంగా ఫోన్ల‌లోనే నిర్వ‌హించుకోవ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top