మొబైల్, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? అయితే ఈ జాగ్ర‌త్తలు పాటించండి.

ఇంటికో, బ్యాంకుకో, ఏటీఎంకో క‌న్నం వేయడం… లేదంటే చంపుతామ‌ని బెదిరించి దోచుకోవ‌డం… దొంగ‌ల‌కు ప‌రిపాటే. అయితే అదంతా ఇప్పుడు ఓల్డ్ ఫ్యాష‌న్‌. ఎందుకంటే అర‌చేతిలో వైకుంఠం చూపే లేటెస్ట్ టెక్నాల‌జీ, అందుకు త‌గిన విధంగా స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చేశాయి. దీంతో దొంగ‌తనాలు చేసే వారు త‌మ రూట్ మార్చి టెక్నాల‌జీ బాట ప‌ట్టారు. సందు దొరికితే చాలు వినియోగ‌దారుల స‌మాచారం సేక‌రించ‌డం, బ్యాంక్ ఆన్‌లైన్ ఖాతా నుంచి పెద్ద ఎత్తున డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌డం వంటి సైబ‌ర్ నేరాలకు పాల్ప‌డుతున్నారు. దీంతో వారిని పట్టుకోవ‌డం కూడా పోలీసుల‌కు స‌వాల్‌గా మారింది. అయితే అది అంత‌టితో ఆగ‌లేదు. ఇప్పుడు ఏకంగా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా వినియోగ‌దారుల డ‌బ్బులను దుండ‌గులు దోచుకుంటున్నారు. అదెలాగంటే…

sim-swap-fraud

ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు బ్యాంక్‌లు వినియోగ‌దారుల‌కు తమ మొబైల్స్ ద్వారానే లావాదేవీలు నిర్వ‌హించుకునేలా వీలు క‌ల్పిస్తున్నాయి. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌తోపాటు, మొబైల్ బ్యాంకింగ్ ఇప్పుడు ఫోన్ల‌లో యాప్స్ ద్వారా ల‌భ్య‌మ‌వుతోంది. అన్ని బ్యాంకులు త‌మ యాప్‌ల ద్వారా బ్యాంక్‌ల సేవల‌ను వినియోగ‌దారుల‌కు అందిస్తున్నాయి. అయితే ఇదే హ్యాక‌ర్ల‌కు వ‌రంగా మారింది. వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ముందుగా మోస‌పూరిత ఈ-మెయిల్స్‌, ఎస్ఎంఎస్, కాల్స్ ద్వారా వినియోగ‌దారుల‌కు చెందిన పూర్తి బ్యాంకు స‌మాచారాన్ని ముందుగా రాబ‌డుతున్నారు. అయితే కేవ‌లం ఆ స‌మాచారంతోనే వినియోగ‌దారుల డ‌బ్బుల‌ను ఆన్‌లైన్ అకౌంట్ ద్వారా దొంగిలించ‌డం వారికి సాధ్యం కావ‌డం లేదు. ఎందుకంటే బ్యాంకులు వినియోగ‌దారుల‌ మొబైల్స్‌కు వ‌న్ టైం పాస్‌వ‌ర్డ్ (ఓటీపీ)ని సెక్యూరిటీ కోసం పంపుతున్నాయి. ఈ ఓటీపీని ఎంట‌ర్ చేస్తేనే ట్రాన్సాక్ష‌న్ పూర్త‌యి డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ అవ‌డ‌మో, పేమెంట్ అవ‌డ‌మో జ‌రుగుతోంది. దీంతో దుండ‌గుల‌కు ఈ ఓటీపీ స‌మ‌స్యను అధిగ‌మించాల్సి వ‌స్తోంది. అయితే కొంద‌రు దీన్ని కూడా అవ‌లీల‌గా దాటేసి డ‌బ్బుల‌ను కాజేస్తున్నారు. అదెలాగంటే వినియోగ‌దారుల‌కు చెందిన పూర్తి బ్యాంక్ స‌మాచారాన్ని పైన చెప్పిన విధంగా ముందుగా దొంగిలించిన త‌రువాత‌, వారి మొబైల్ నంబ‌ర్‌తో ఓ కొత్త సిమ్‌ను తీసుకుంటున్నారు. అనంత‌రం స‌ద‌రు సిమ్ నెట్‌వ‌ర్క్ కంపెనీ వారు చేసిన‌ట్టుగా వినియోగ‌దారుల‌కు కాల్ చేసి కొంత సేపు ఫోన్‌ను స్విచాఫ్‌లో పెట్ట‌మ‌ని చెబుతారు. వినియోగ‌దారులు అలా చేయ‌గానే దుండగుల సిమ్ యాక్టివేట్ అవుతుంది. దీంతో వినియోగ‌దారుల ఫోన్ నంబ‌ర్ వారి సిమ్‌కు స్వాప్ (బ‌దిలీ) అవుతుంది. అప్పుడు ఆ నంబ‌ర్ అచ్చం వినియోగ‌దారుల నంబ‌ర్‌లాగే ప‌నిచేస్తుంది. ఈ క్ర‌మంలో దుండ‌గులు త‌మ వ‌ద్ద ఉన్న స‌మాచారంతో బ్యాంక్ లావాదేవీ నిర్వ‌హించి, ఆ స్వాప్ అయిన సిమ్‌కు ఓటీపీ రాగానే దాన్ని ఎంట‌ర్ చేసి, లావా దేవీ పూర్తి చేసి డ‌బ్బుల‌ను కాజేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి మోసాలే ఎక్కువగా జ‌రుగుతున్నాయి. అయితే వినియోగ‌దారుల ఫోన్ నంబ‌ర్ వేరే సిమ్‌కు యాక్టివేట్ అవ‌డంతో వారికి ఎలాంటి కాల్స్‌, ఎస్ఎంఎస్‌లు రావు. దీంతో వారికి త‌మ డ‌బ్బులు ఉన్నాయో, మాయ‌మ‌య్యాయో కూడా తెలియ‌దు. ఈ త‌ర‌హా మోసాల‌ను సిమ్ స్వాప్ ఫ్రాడ్‌లుగా పిలుస్తున్నారు. వీటి బారిన ప‌డ‌కుండా ఉండాలంటే కింది జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

1. మీ బ్యాంక్ వివ‌రాల‌ను తెలియ‌జేయ‌మ‌ని వ‌చ్చే కాల్స్‌, ఈ-మెయిల్స్‌, ఎస్ఎంఎస్‌ల‌కు స్పందించ‌వ‌ద్దు. ఎందుకంటే బ్యాంకు వారు ఎప్పుడూ అలా అడ‌గ‌రు.

2. ఆన్‌లైన్‌, మొబైల్ బ్యాంకింగ్‌ల‌కు వాడే ఈ-మెయిల్స్‌, ఫోన్ నంబ‌ర్ల‌ను ఎవ‌రికీ చెప్ప‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం.

3. ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వ‌హించాలంటే స‌ద‌రు బ్యాంక్ వెబ్‌సైట్‌ను ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్‌లో టైప్ చేసి మాత్ర‌మే ఓపెన్ చేయాలి. వేరే ద‌గ్గ‌ర్నుంచి ఓపెన్ చేస్తే మీ బ్యాంక్ స‌మాచారం ఇత‌రుల చేతుల్లోకి వెళ్లేందుకు అవ‌కాశం ఉంటుంది.

4. మొబైల్‌, ఆన్‌లైన్ బ్యాంకింగ్ పాస్‌వ‌ర్డ్‌ల‌ను క‌నీసం 3 నెల‌ల‌కు ఒక‌సారి అయినా మారుస్తుండాలి.

5. ఎవ‌రైనా మీ ఫోన్ నెట్‌వ‌ర్క్ బాగాలేదు, ఫోన్‌ను ఒక‌సారి స్విచ్ ఆఫ్ చేయండి అని చెబితే వెంట‌నే జాగ్ర‌త్త ప‌డండి. ఎందుకంటే నెట్‌వ‌ర్క్ ఆప‌రేట‌ర్లు అలా ఫోన్ చేసి చెప్ప‌రు. ఒక వేళ అలాంటి ఫోన్ కాల్స్ క‌న‌క వ‌స్తే అప్పుడు మీ మొబైల్‌, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ల‌ను లాక్ చేయండి. లేదంటే పాస్‌వ‌ర్డ్‌లు, ఈ-మెయిల్స్‌, మొబైల్ నంబ‌ర్స్‌ను మార్చండి.

6. మీ బ్యాంక్ లావాదేవీల‌పై ఎల్ల‌ప్పుడూ ఓ క‌న్నేసి ఉంచండి. ఎప్ప‌టిక‌ప్పుడు స్టేట్‌మెంట్స్ చూసుకోండి.

7. బ్యాంక్ లేదా మొబైల్ సేవ‌ల‌కు సంబంధించి ఎలాంటి అంత‌రాయాన్న‌యినా మీరు గ‌మ‌నించిన‌ట్ట‌యితే వెంట‌నే స‌ద‌రు కంపెనీని సంప్ర‌దించి వివ‌రాలు తెలుసుకోండి.

Comments

comments

Share this post

scroll to top