పారిశుధ్య కార్మికులను చిన్న చూపు చూడవద్దంటున్న ఓ యువ కార్మికుడు… చిన్నప్పటి నుంచే కష్టాలతో సహవాసం… అయినా అతనిలో కోల్పోని ఆత్మవిశ్వాసం…

పారిశుధ్య కార్మికులంటే సమాజంలో అందరికీ చిన్న చూపే. కానీ మీకు తెలుసా? వారు మనం విడుదల చేసే వ్యర్థాలను తొలగించి మన బాగు కోసం ఉపయోగపడతారని. మన ఆరోగ్యం కోసం వారు అనారోగ్యాలకు గురవుతారని. సరిగ్గా ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఆ యువకుడు. పారిశుధ్య కార్మికులు కూడా మనుషులేనని, తమ పట్ల కూడా కొంత మానవత్వాన్ని ప్రదర్శించాలని, తమను కూడా ఇతర అన్ని రకాల పనులు చేసే వారిలా ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. అతనే బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ రబ్బీ.

మహమ్మద్ రబ్బీ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. తండ్రి ఇంకో మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీంతో వచ్చిన ఆ సవతి తల్లి రబ్బీని సరిగ్గా చూసేది కాదు. అతన్ని ఆమె ఇష్టం వచ్చినట్టు కొట్టేది కూడా. అయితే వీటన్నింటినీ రబ్బీ మౌనంగానే భరించాడు. కాగా ఒకానొక సందర్భంలో సవతి తల్లి రబ్బీని ఇంటి నుంచి గెంటి వేసింది. అయినా రబ్బీ ఇంటి బయటే ఒక రోజంతా నిలుచున్నాడు. అయినా ఆ తల్లి జాలి చూపలేదు. తండ్రి కూడా ఆదుకునేందుకు ముందుకు రాలేదు. ఈ క్రమంలో రబ్బీ ఇంటిని విడిచిపెట్టి బంగ్లాదేశ్ రాజధాని అయిన ఢాకా నగరానికి చేరుకున్నాడు. నీరు, ఆహారం, నిద్ర లేకపోవడంతో రోజుల తరబడి రబ్బీ ఆకలికి, దాహానికి గురయ్యాడు. ఆ వీధి ఈ వీధి తిరిగాడు. అయినా ఎక్కడా తిండి దొరకలేదు. దీంతో స్థానికులు డస్ట్‌బిన్లలో పారవేసే ఆహారాన్ని సేకరించి నిత్యం కడుపు నింపుకునేవాడు.

mohammad-rabbi

అలా రోజులు గడుపుతున్న రబ్బీకి ఒక రోజు వీధులు ఊడ్చే పని లభించింది. దీంతో అతను సంతోషపడ్డాడు. ఢాకా నగరంలో వీధులను ఊడుస్తూ పొట్ట పోసుకునే వాడు. దీంతోపాటు మ్యాన్ హోల్స్‌ను కూడా శుభ్రం చేసే వాడు. అయితే తాను ఆ పనులను చేస్తున్నందుకు ఎన్నడూ అతను దిగులు చెందలేదు. సంపాదించిన దాంట్లో నుంచి సంతృప్తిగా తిని జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే రబ్బీని ఓ విలేకరి ఇంటర్వ్యూ చేయగా, తన జీవితం గురించిన విషయాలను అతను మీడియాతో పంచుకున్నాడు. పారిశుధ్య కార్మికులుగా జీవిస్తున్న తమను తక్కువ చేసి చూడవద్దని, తాము కూడా మనుషులమేనని, తమ పట్ల కూడా జాలి, దయ, కరుణ చూపాలని వేడుకుంటున్నాడు.

జీవితంలో అన్నీ కష్టాలు ఎదురైనా ఏదో ఒక పని చేసి పూట గడిస్తే చాలు అనుకుని జీవనం సాగిస్తున్న రబ్బీని చూసి మనం కూడా ఎంతో నేర్చుకోవచ్చు. సమస్యలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొని జీవించినప్పుడే మనసులో ఆనందం నిండుతుందనే సత్యాన్ని రబ్బీ చెప్పకనే చెబుతున్నాడు.

Comments

comments

Share this post

scroll to top