షూటింగ్‌ స్పాట్‌ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన అమలాపాల్‌.. ఎందుకో తెలుసా?!! కానీ చివరికి!

తమిళంలో చాలా కాలం క్రితం సంచలన విజయం సాధించిన ‘తిరుట్టుపయలే’ చిత్రానికి రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుశీగణేశన్‌. బాబీసింహా, ప్రసన్న, అమలాపాల్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్టుప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. దీంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. ఆ సందర్భంగా షూటింగ్‌ సమయంలో జరిగిన ఒక తమాషా ఘటనను దర్శకుడు మీడియాతో పంచుకున్నారు. అదేంటంటే.. షూటింగ్‌ స్పాట్‌ నుంచి హీరోయిన్‌ అమలాపాల్‌ పారిపోయేందుకు ప్రయత్నించిందట.

దాని గురించి సుశీ గణేశన్‌ వివరిస్తూ.. ‘ఈ సినిమా ఒక షెడ్యూల్‌ను థాయ్‌లాండ్‌లో జరిపాం. సముద్రం, పర్వతాలు దగ్గరగా ఉండే ఒక ప్రాంతంలో షూటింగ్‌ ప్లాన్‌ చేశాం. అక్కడ సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ దొరకడం కష్టం. షూటింగ్‌ జరుగుతున్నప్పుడు అమలాకు ఒక మెసేజ్‌ వచ్చింది . ఏమని అంటే.. ఆమె తండ్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఈ విషయం యూనిట్‌కి చెబితే వెళ్లడానికి ఒప్పుకోరేమోనని, ఎవరికీ చెప్పకుండా పారిపోదామని అమలా అనుకుంది. కొద్దిసేపటి తరువాత ఫోన్‌ చేసి టవర్‌ ఉన్న ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పి తన సహాయకులతో పడవలో వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. నాకేదో అనుమానం వచ్చి, ఒంటరిగా వెళ్లొద్దు, నేనూ వస్తాను అని మరో పడవలో ఎక్కాను. నాతోపాటు బాబీసింహా, ప్రసన్న కూడా వచ్చారు. అయితే ఆమెకు వచ్చిన మెసేజ్‌ వాస్తవం కాదు. చాలా రోజులుగా అమలాతో మాట్లాడలేదన్న కారణంతో ఆ విధంగా మెసేజ్‌ పంపించినట్టు అమలా తల్లి చెప్పారు. ఆ మాట విన్నాకే అమలా మామూలు స్థితికి వచ్చింది’ అని వివరించారు. కాగా, ఈ చిత్రాన్ని తెలుగులోనూ అనువదిస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top