షాకింగ్‌..! ఈ ఏడాది ఆరంభంలోనే మ‌న దేశంలో 15 ల‌క్ష‌ల మంది ఉద్యోగాల‌ను కోల్పోయార‌ట తెలుసా..?

మ‌న దేశంలో నిరుద్యోగ స‌మ‌స్య అనేది ఇప్ప‌టిది కాదు. ఎప్ప‌టి నుంచో ఉన్నదే. ఇందులో రెండు ర‌కాలు ఉన్నాయి. అన్ని అర్హ‌త‌లు ఉన్న‌ప్ప‌టికీ నైపుణ్యానికి త‌గ్గ రీతిలో జాబ్ దొరక్క ఏదో ఒక జాబ్ చేయ‌డం, అస‌లు జాబే దొర‌క్క‌పోవ‌డం. ఏదో ఒక జాబ్ చేసే వారి సంగతి ప‌క్క‌న పెడితే అస‌లు ఎంత వెతికినా జాబ్ దొర‌క‌ని వారే మ‌న దేశంలో ఎక్కువ‌గా ఉన్నారు. అయితే నిరుద్యోగ స‌మ‌స్య అనేది ఒక‌ప్ప‌టి క‌న్నా ఇప్పుడు బాగా పెరిగిపోయింద‌ట‌. ఎంత‌లా అంటే 2011-12వ సంవ‌త్స‌రంలో 3.8 గా ఉన్న నిరుద్యోగుల శాతం కేవ‌లం 5 ఏళ్ల‌లోనే 5 శాతానికి చేరుకుంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. దీనికి తోడు ఈ ఏడాదిలో మొద‌టి నాలుగు నెల‌ల్లోనే 15 ల‌క్ష మంది ఉద్యోగాలు కోల్పోయార‌ట‌. ఇవ‌న్నీ మేం చెబుతోంది కాదు, స‌ర్వేలు చెబుతున్న నిజాలు.

లేబ‌ర్ బ్యూరో అనే సంస్థ దేశంలో ఉన్న సుమారు 8 ల‌క్ష‌ల కుటుంబాల‌ను స‌ర్వే చేసింది. నిర్మాణ రంగం, వైద్యం, రియ‌ల్ ఎస్టేట్‌, ఐటీ త‌దిత‌ర 8 కీల‌క రంగాల‌కు చెందిన ఉద్యోగుల‌ను స‌ర్వే చేసింది. ఏటా ఈ సంస్థ స‌ర్వే చేస్తున్న క్ర‌మంలో ఈ ఏడాది కూడా స‌ర్వే చేసింది. దీంతో ఆ స‌ర్వే రిపోర్టులో పైన చెప్పిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిశాయి. 2011-12వ సంవ‌త్స‌రంలో 3.8 గా ఉన్న నిరుద్యోగుల శాతం 2015-16 లో 5 శాతానికి చేరుకుంది. అంతేకాకుండా 2017 జ‌న‌వ‌రి నుంచి ఏప్రిల్ వ‌ర‌కు నాలుగు నెల‌ల కాలంలో దేశంలో ప‌నిచేస్తున్న కోట్ల మంది ఉద్యోగుల్లో 15 ల‌క్ష‌ల మంది ఉద్యోగాల‌ను కోల్పోయార‌ని తెలిసింది. కాగా దేశంలో ఉన్న 68 శాతం మంది ఉద్యోగులు నెల‌కు రూ.10వేల లోపే సంపాదిస్తున్న‌ట్టు ఈ సర్వే చెబుతోంది.

ఈ క్ర‌మంలోనే లేబ‌ర్ బ్యూరో ఏటా కొత్త‌గా సృష్టించ‌బ‌డుతున్న ఉద్యోగాల సంఖ్య‌ను కూడా చెప్పుకొచ్చింది. గతంలో.. అంటే మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో టెక్స్‌టైల్స్‌, లెద‌ర్‌, మెటీరియ‌ల్స్, ఆటోమొబైల్స్‌, జెమ్స్ అండ్ జ్యువెల్ల‌రీ, ట్రాన్స్‌పోర్ట్‌, ఐటీ, హ్యాండ్లూమ్స్ రంగాల్లో ఏటా సుమారుగా 4.21 ల‌క్ష‌ల కొత్త ఉద్యోగాలు సృష్టించ‌బ‌డ్డాయి. కానీ ప్ర‌ధానిగా మోడీ అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఏటా సుమారుగా 1.35 లక్ష‌ల ఉద్యోగాలు మాత్ర‌మే కొత్త‌గా సృష్టించ‌బ‌డుతున్నాయ‌ని లేబ‌ర్ బ్యూరో తెలిపింది. కాగా 2014లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల స‌మ‌యంలో మోడీ తాము అధికారంలోకి వ‌స్తే ఏటా 1 కోటి ఉద్యోగాల‌ను క‌ల్పిస్తామ‌ని చెప్పార‌ని ఈ సంస్థ తెలిపింది. కానీ అలా జ‌ర‌గ‌క‌పోగా ఏటా ఉద్యోగాలు కోల్పోతున్న వారే ఎక్కువ‌గా ఉన్నార‌ని లేబ‌ర్ బ్యూరో త‌న రిపోర్టులో తెలిపింది. ఈ క్ర‌మంలోనే 2050వ సంవ‌త్స‌రం వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం క‌చ్చితంగా 28 కోట్ల కొత్త ఉద్యోగాల‌ను సృష్టించాల‌ని లేక‌పోతే ప‌రిస్థితి దారుణంగా త‌యార‌వుతుంద‌ని స‌ర్వేలో తెలిసింది. ఇక ప్ర‌పంచ బ్యాంక్ అధ్య‌క్షుడు జిమ్ కిమ్ కూడా భార‌త్ లో నెల‌కొన్న నిరుద్యోగ స‌మ‌స్య‌పై స్పందించారు. భ‌విష్య‌త్తులో దేశంలో ఉన్న ఉద్యోగుల్లో 69 శాతం మంది త‌మ ఉద్యోగాలు కోల్పోయేందుకు అవ‌కాశం ఉంద‌ని, ఆటోమేష‌న్‌, డిజిట‌ల్ టెక్నాల‌జీ వ‌ల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఊడుతాయ‌ని ఆయ‌న చెప్పారు. ఇప్ప‌టికైనా కేంద్రం ఆలోచించి ప్ర‌ణాళిక‌లు వేయ‌క‌పోతే భ‌విష్య‌త్తులో నిరుద్యోగ స‌మ‌స్య తీవ్ర‌త‌ర‌మ‌వుతుంద‌ని అంటున్నారు..!

Comments

comments

Share this post

scroll to top