మెట్రో రైల్.. హైదరాబాద్ వాసుల కల.. అది వస్తే ట్రాఫిక్ కష్టాలను అధిగమించవచ్చని, త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని నగర వాసులు భావించారు.. కానీ కట్ చేస్తే సీన్ రివర్స్ అవుతోంది. ఆరంభం నుంచి మెట్రో రైళ్లు పెద్దగా వేగంగా నడవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు వెళ్లే కనీస స్పీడ్‌లో కూడా మెట్రో రైళ్లు వెళ్లడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. అయితే ఇది చాలదన్నట్టు తాజాగా మెట్రో రైల్లో ప్రయాణికులకు షాక్ తగిలింది. త్వరగా గమ్యస్థానం చేరుకోవచ్చని ట్రెయిన్ ఎక్కితే అది మధ్యలో ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
డిసెంబర్ 31వ తేదీన మెట్రో రైల్ ప్రయాణికులకు షాక్ తగిలింది. అమీర్‌పేట నుంచి నాగోల్‌కు వెళ్లే మెట్రో రైల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రకాష్ నగర్ పాకెట్ పార్కింగ్ లో అధికారులు మెట్రో రైల్‌ను నిలిపివేశారు. ఈ క్రమంలో నాగోల్ నుంచి బయలుదేరిన మరో మైట్రో రైల్‌ను మెట్టుగూడ స్టేషన్లో నిలిపారు. దీంతో ట్రైన్లలో చాలా మంది ప్రయాణికులు అసహనానికి లోనయ్యారు. ట్రెయిన్లు ఆగిపోవడంతో మళ్లీ అవి ఎప్పుడు కదులుతాయోనని ఆత్రంగా ఎదురు చూశారు.
ఓ దశలో ఆగిపోయిన మెట్రో రైళ్లలో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు లోనై అసంతృప్తిని వ్యక్తం చేశారు కూడా. అయితే రైలు ఎప్పుడు కదులుతుందో తెలియకపోవడంతో చాలా మంది ప్రయాణికులు రైళ్లను దిగేశారు. కొందరు ప్రయాణికులు స్టేషన్ కిందకు దిగి ఆర్టీసీ బస్సుల్లో, ఆటోల్లో వెళ్లిపోయారు. మరికొందరు మాత్రం ట్రెయిన్ కదులుతుందని అలాగే వేచి చూశారు. అయితే 2 గంటల పాటు అధికారులు ట్రెయిన్‌ను తనిఖీ చేసి సమస్యను కనుగొనడంతో చివరకు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సమస్యను సరిదిద్దడంతో ట్రెయిన్ కదిలింది. ఇలా మెట్రో రైల్ సేవలకు మొదటి సారిగా 2 గంటల పాటు అంతరాయం ఏర్పడింది. అయితే మళ్లీ ఇలాంటి సమస్య వస్తుందా ? అంటే చెప్పలేం. ఎంతైనా అవి కూడా మెషిన్లే కదా. ఏమైనా జరిగేందుకు అవకాశం ఉంటుంది..!