అనాథ పిల్లల కోసం రైల్వే ఫ్లాట్ ఫాం లపైనే పాఠాలు చెబుతున్న టీచర్.! వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఖురానా మేడమ్.

అది ఒరిస్సాలోని భువ‌నేశ్వ‌ర్ రైల్వే స్టేష‌న్‌. అనుకోకుండా ఒక రోజు ఆ స్టేష‌న్‌కు వ‌చ్చిన స్థానిక స్కూల్ టీచ‌ర్ ఇంద‌ర్‌జిత్ ఖురానా అక్క‌డ తిరుగుతున్న ప‌లువురు పేద‌, అనాథ బాల‌ల‌ను గ‌మ‌నించారు. స‌రైన పౌష్టికాహారం లేకుండా, వ్యాధుల బారిన ప‌డి, తీవ్ర‌మైన దీనావ‌స్థ‌లో ఉన్న వారిని చూసి ఇంద‌ర్‌జిత్ మ‌న‌సు చ‌లించింది. వారి కోసం ఆమె ఏదైనా చేయాల‌ని ఆలోచించారు. అనుకున్న‌దే త‌డవుగా అక్క‌డే ఉన్నరైల్వే ప్లాట్‌ఫాంపై స‌ద‌రు బాల‌ల‌కు చ‌దువు చెప్ప‌డం ప్రారంభించారు. అలా కొంత కాలం పాటు ఆమె రైల్వే ప్లాట్ ఫాం స్కూల్స్ ద్వారా అనాథ బాల‌లకు విద్య‌నందించారు. అనంత‌రం 1985వ సంవ‌త్స‌రంలో తానే సొంతంగా రుచిక సోష‌ల్ స‌ర్వీస్ ఆర్గ‌నైజేష‌న్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్వ‌చ్ఛంద సంస్థ పేరిట రైల్వే ప్లాట్‌ఫాంల‌పై ఉండే అనాథ బాల‌ల‌కు మాత్ర‌మే కాకుండా, మురికి వాడ‌ల్లో ఉండే పేద విద్యార్థుల‌కు కూడా చ‌దువు చెప్ప‌డం ఆరంభించారు.
55
మొద‌ట్లో స‌ద‌రు పిల్ల‌లు చ‌దువుపై అంత‌గా శ్ర‌ద్ధ చూపేవారు కాదు. ఇందు కార‌ణాలు అనేకం ఉండేవి. వారికి స‌రైన పౌష్టికాహారం, వైద్యం అందేది కాదు. దీనికి తోడు కొంత మంది ఆ పిల్ల‌ల్ని యాచ‌క వృత్తిలోకి, డ్ర‌గ్స్ బిజినెస్‌లోకి దింపేవారు. ఇక మురికి వాడ‌ల్లో ఉండే పిల్ల‌ల‌నైతే వారి త‌ల్లిదండ్రులు ఏదో ఒక ప‌నికి పంపేవారు. ఇలా ఆ పిల్ల‌ల‌కు అనేక స‌మ‌స్య‌లు ఎదురయ్యేవి. దీంతో ఆ పిల్ల‌లు ఇంద‌ర్‌జిత్ ఖురానా త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌య్యేవారు కాదు. ఈ నేప‌థ్యంలో వారికి చ‌దువు చెప్ప‌డం ఆమెకు క‌ష్ట‌త‌ర‌మైంది. అయితే దీనికి ఆమె వెన‌క‌డుగు వేయ‌లేదు. స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చే వాలంటీర్లు, దాత‌ల స‌హాయం తీసుకున్నారు. ఆ పిల్ల‌ల‌కు స‌రైన ఆహారం, వైద్య స‌హాయం చేసేవారు. దీంతో క్ర‌మంగా ఆమె వ‌ద్ద చ‌దువు నేర్చుకునే వారి సంఖ్య పెరుగుతూ వ‌చ్చింది. మొద‌ట్లో కేవలం ఒక‌రిద్దరు మాత్ర‌మే ఆమె వ‌ద్ద చ‌దువు నేర్చుకోగా ఇప్పుడు ఆ విద్యార్థుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. ఈ నేప‌థ్యంలోనే అలా చ‌దువు చెప్పే సెంట‌ర్ల సంఖ్య ఇప్పుడు 35కి పైగా చేరింది. వాటిలో 30 మంది ఉపాధ్యాయులు, 35 మంది సిబ్బంది స్వ‌చ్ఛందంగా ప‌నిచేస్తున్నారు.
అయితే కేవ‌లం చ‌దువు చెప్ప‌డం పైనే కాకుండా ఇంద‌ర్‌జిత్ ఖురానా వారికి ల‌లిత క‌ళ‌లు, వృత్తి విద్యా కోర్సుల్లో శిక్ష‌ణ‌ను కూడా ఇచ్చేవారు. దీంతో ఆయా విష‌యాల్లో ప్ర‌తిభ చూపిన పిల్ల‌ల‌కు మ‌రింత ఆర్థిక స‌హాయం దాత‌ల ద్వారా అంద‌జేసి వారిని జీవితంలో ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకునేలా తీర్చిదిద్దేవారు. మిగ‌తా వారికి కూడా ఏదో ఒక విధ‌మైన ఉపాధి క‌లిగే విధంగా, వారి ఆర్థిక స్వావ‌లంబ‌న కోసం చేయూత‌నందించేవారు. ఆమె చేర‌దీసి చ‌దువు చెప్పిన‌వారిలో ఎక్కువ‌గా 6 నుంచి 14 సంవ‌త్స‌రాల లోపు బాల బాలిక‌లు ఉండ‌డం గ‌మ‌నార్హం.
Train-platform-school
పేద‌, అనాథ బాల‌ల కోసం ఇంద‌ర్‌జిత్ ఖురానా చేసిన సేవ‌ల‌కు గాను 2003,2004 సంవ‌త్స‌రాల‌కు ఆమెకు శిశు సంక్షేమంలో వ‌రుస‌గా జాతీయ అవార్డులు ల‌భించాయి. 2003లో అశోకా ఫెలోషిప్‌కు ఎంపిక‌య్యారు. 2007లో వ‌ర‌ల్డ్ చిల్డ్ర‌న్స్ హాన‌రీ అవార్డును ఆమె సాధించారు. ఇన్ని పుర‌స్కారాలు పొందిన‌ప్ప‌టికీ అనాథ బాల‌ల ముఖాల్లో క‌నిపించే ఆనంద‌మే త‌నకు నిజ‌మైన అవార్డు అంటారామె. కాగా ఇప్పుడామె మ‌న మ‌ధ్య లేరు. 2010 అక్టోబ‌ర్ 26న తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయారు. అయిన‌ప్ప‌టికీ ఒక‌ప్పుడు ఆమె ప్రారంభించిన రైల్వే ప్లాట్‌ఫాం స్కూల్స్ నేడు మ‌హావృక్షాలుగా ఎదిగి ఎంతో మంది అనాథ బాల‌ల‌కు నీడ‌నిస్తున్నాయి. నిజంగా మాన‌వ‌తా హృద‌యం క‌లిగిన ప్ర‌తి ఒక్క‌రికీ ఇంద‌ర్‌జిత్ ఖురానా ఇచ్చిన స్ఫూర్తి ఆద‌ర్శంగా నిలుస్తుంద‌న‌డంలో ఆశ్చ‌ర్యం లేదు.

Comments

comments

Share this post

scroll to top