ఆమె ప‌నిమ‌నిషిగా, అంధురాలిగా, గ‌ర్భిణీగా మారు వేషాలు వేస్తుంటారు..ఎందుకో తెలుస్తే తప్పక గౌరవిస్తారు!

మ‌నం నిత్య జీవితంలో ఎప్ప‌టిక‌ప్పుడు డిటెక్టివ్ స్టోరీల‌ను వింటూనే ఉంటాం. ఇక ఇదే అంశంపై అనేక సినిమాలను కూడా చూస్తుంటాం. అయితే నిజానికి డిటెక్టివ్‌ల ప్ర‌భావం మ‌న దేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువ‌. అయితే ఇప్పుడా ట్రెండ్ మారింది. మ‌న దేశంలోనూ డిటెక్టివ్‌ల‌కు గిరాకీ పెరుగుతోంది. ఇప్పుడు మేం చెప్ప‌బోతున్న‌ది కూడా ఓ పేరు మోసిన డిటెక్టివ్ గురించే. అయితే ఆ డిటెక్టివ్‌.. ఒక లేడీ.. ఇంకా విశేషం ఏమిటంటే.. ఆమె మ‌న దేశంలోనే మొద‌టి మ‌హిళా డిటెక్టివ్‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఆమె పేరు.. ర‌జ‌నీ పండిట్‌..!

ర‌జ‌నీ పండిట్ 1983 నుంచి డిటెక్టివ్‌గా ప‌నిచేస్తోంది. గ‌త 25 సంవ‌త్స‌రాల నుంచి సొంత డిటెక్టివ్ ఏజెన్సీ ద్వారా సేవ‌ల‌ను అందిస్తోంది. ర‌జ‌నీ పండిట్ డిటెక్టివ్ స‌ర్వీసెస్ పేరిట ఈమె డిటెక్టివ్ ఏజెన్సీని న‌డ‌పుతోంది. అయితే ఈ డిటెక్టివ్ ఏజెన్సీని ర‌జ‌నీ ఇన్వెస్టిగేష‌న్ బ్యూరో అని కూడా అంటారు. ఎందుకంటే ఆమె చాలా క్లిష్ట‌త‌ర‌మైన కేసుల‌ను కూడా సునాయాసంగా ప‌రిష్క‌రించింది మ‌రి. ఇప్పుడు ఈమె ఏజెన్సీలో మొత్తం 20 మంది ప‌నిచేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈమె త‌న ఏజెన్సీ ద్వారా 75వేల కేసులను సాల్వ్ చేసింది. దీంతో ఇప్పుడీమె పేరు ముంబైలో మారుమోగిపోతోంది. చాలా మంది బిజినెస్ పీపుల్‌, పొలిటిషియ‌న్స్‌, ఫిలిం స్టార్స్ కూడా ఈమె డిటెక్టివ్ సేవ‌ల‌ను ఆశ్ర‌యిస్తున్నారు.

ఇక ర‌జ‌నీ పండిట్ ముఖ్యంగా దంప‌తుల మ‌ధ్య నెల‌కొనే గొడ‌వ‌ల‌ను ప‌రిష్క‌రించి వారికి సొల్యూష‌న్‌ను చూపిస్తుంది. ఎక్కువ‌గా దంప‌తుల‌కు సంబంధించిన కేసులే ఈమె వ‌ద్ద‌కు వ‌స్తుంటాయి. వాట‌న్నింటినీ త‌న‌దైన శైలిలో ఈమె సాల్వ్ చేస్తుంది. అలా చేసే క్ర‌మంలో ఈమె ప‌నిమ‌నిషిగా, అంధురాలిగా, గ‌ర్భిణీగా, ర‌హ‌దారిపై చిరు వ్యాపారిగా మారి ఆయా వేషాల్లో తన డిటెక్ష‌న్‌ను మొదలు పెడుతుంది. అయితే ఈమెను మారువేషంలో చూసి అస‌లు రూపంలో చూస్తే ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌లేరు. అవును మ‌రి, అలా ఉంటేనే క‌దా, ఏ వ్యక్తికైనా మ‌నం డిటెక్టివ్‌లం అని అనుమానం రాకుండా ఉంటుంది.

అలా ర‌జ‌నీ పండిట్ డిటెక్టివ్ రంగంలో ప్ర‌గ‌తి ప‌థంలో ప‌య‌నిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఎన్నో అవార్డులు ఆమెను వ‌రించాయి. ఈమె ఫేసెస్ బిహైండ్‌, మాయాజాల్ అనే రెండు పుస్త‌కాల‌ను రాయ‌గా, అవి సూప‌ర్ హిట్ అయ్యాయి. అయితే మొద‌టి పుస్త‌కానికి ఈమెకు 2 అవార్డులు రాగా, రెండో పుస్త‌కానికి ఏకంగా 6 అవార్డులు వ‌చ్చాయి. దీంతోపాటు మ‌రో 57 అవార్డుల‌ను కూడా ఆమె అందుకుంది. కాగా ఈమె జీవిత క‌థ‌ను ఆధారంగా తీసుకుని జీ టీవీ వారు ఓ సీరియ‌ల్ తీస్తున్నారు. దాని పేరు డిటెక్టివ్ దీదీ. త్వ‌ర‌లో ఆ టీవీలో ఈ సీరియ‌ల్ ప్ర‌సారం కానుంది. దానికి సంబంధించిన ట్రైల‌ర్‌ను కింద చూడ‌వ‌చ్చు..! ఏది ఏమైనా ర‌జ‌నీ పండిట్ ఇలా దేశంలోనే మొద‌టి మ‌హిళా డిటెక్టివ్‌గా పేరు తెచ్చుకోవ‌డం అభినంద‌నీయం క‌దా..!

Comments

comments

Share this post

scroll to top