ఆమెకు రెండు చేతులు, కాళ్లు లేవు… అయినా 10కె ర‌న్‌లో పాల్గొనేందుకు రెడీ అయింది…

కష్టాలు, సుఖాలు, క‌న్నీళ్లు, ఆనందాలు… అంతా కలిస్తేనే జీవితం. మ‌నిషిగా జన్మించాక ప్ర‌పంచంలోని ప్రతి ఒక్క‌రూ ఏదో ఒక సంద‌ర్భంలో కష్టాన్ని ఎదుర్కోవాల్సిందే. క‌న్నీళ్లు పెట్టాల్సిందే. మ‌రో స‌మ‌యంలో సుఖాలు, ఆనందాలు వ‌స్తాయి. ప్రతి వ్య‌క్తి జీవితంలో ఇవ‌న్నీ స‌హ‌జం. అయితే కేవ‌లం కొద్ది మంది మాత్ర‌మే నిరంత‌రంగా సుఖ ప‌డుతుంటారు. ఇలాంటి వారు ప్ర‌పంచంలో చాలా త‌క్కువ మందే ఉంటారు. అలాగే మ‌రికొంద‌రు ఎల్ల‌ప్పుడూ క‌ష్టాల‌తో స‌హ‌వాసం చేస్తూ ఉంటారు. క‌ష్టాలంటే అలాంటి ఇలాంటివి కాదు. వాటిని వ‌ర్ణించ త‌ర‌మూ కాదు. ఈ క్ర‌మంలో వాటిని ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో ముందుకు వెళ్లేవారు అత్యంత స్వ‌ల్పంగా ఉంటారు. అలాంటి వారిలో షాలినీ స‌ర‌స్వ‌తి కూడా ఒక‌రు. ఆమె అనుభ‌వించింది, అనుభ‌విస్తుంది మామూలు క‌ష్టాలు కావు. అయినా మొక్క‌వోని సంక‌ల్పం, అంతులేని ధైర్యం ఆమె సొంతం. ఆమెలాంటి క‌ష్టాలు ప‌డుతున్న ఎంతో మందికి ఆమె జీవితం ఆద‌ర్శం.

Shalini-Saraswathi

కాంబోడియాలో ఉండే షాలినీ స‌రస్వ‌తి త‌న‌కు పెళ్ల‌యి 4 ఏళ్లయిన త‌రువాత ఇండియాకు తిరిగి వ‌చ్చింది. బెంగుళూరులో ఆమె నివాసం. ఆమె ఇండియాకు వ‌చ్చిన‌ప్పుడు గ‌ర్భ‌వ‌తి కూడా. కాగా ఒకానొక స‌మ‌యంలో ఆమెకు తీవ్ర‌మైన జ్వ‌రం వ‌చ్చింది. హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్ల‌గా దాన్ని డెంగ్యూ జ్వ‌ర‌మ‌ని వైద్యులు భావించి చికిత్స చేశారు. కానీ అనంత‌రం వారు ఆ వ్యాధిని రికెట్సియల్ విత్ మార్ట్స్ అని గుర్తించారు. ఈ వ్యాధి కొన్ని ల‌క్ష‌ల మందిలో ఒకరికి వ‌స్తుంద‌ట‌. ఇది వ‌చ్చిన వారికి తీవ్ర‌మైన బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్ క‌లుగుతుంద‌ట‌. దీని వ‌ల్ల శ‌రీరంలోని అవ‌య‌వాల‌న్నీ ప‌నిచేయ‌కుండా పోయి చివ‌రికి మ‌ర‌ణం కూడా సంభ‌విస్తుంద‌ట‌. ఈ క్ర‌మంలో గర్భ‌వ‌తిగా ఉన్న షాలిని వ్యాధి కార‌ణంగా బిడ్డ‌ను కోల్పోవాల్సి వ‌చ్చింది. అయితే అది అక్క‌డితో ఆగ‌లేదు. ఇన్‌ఫెక్ష‌న్ ఎక్కువ‌గా జ‌ర‌గ‌డంతో క్ర‌మంగా ఆమె త‌న రెండు చేతుల‌ను, కాళ్ల‌ను కూడా కోల్పోవాల్సి వ‌చ్చింది.

అయినా షాలినీ స‌ర‌స్వ‌తి దిగులు చెంద‌లేదు. ఓ కంపెనీలో డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తూనే మ‌రోవైపు కృత్రిమ కాళ్ల‌ను అమ‌ర్చుకుని కోచ్ స‌హాయంతో రన్నింగ్‌లో శిక్ష‌ణ పొందింది. త‌న‌లాంటి వైక‌ల్యం ఉన్న వారికి ప్రేర‌ణ‌నివ్వాల‌నే ఉద్దేశంతో ఈ నెల 15న బెంగుళూరులో జ‌ర‌గ‌నున్న టీసీఎస్ వ‌ర‌ల్డ్ 10కె ర‌న్‌లో ఓపెన్ కేట‌గిరిలో పాల్గొన‌నుంది. ఇందుకోసం ఆమె జ‌ర్మ‌నీ నుంచి ప్ర‌త్యేకంగా తెప్పించిన కార్బ‌న్ ఫైబ‌ర్ బ్లేడ్లను ర‌న్నింగ్‌లో ఉప‌యోగించ‌నుంది. షాలినీ తీసుకున్న సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యానికి నిజంగా మ‌నం ఆమెను అభినందించాల్సిందే! ఆమె ప్ర‌య‌త్నం స‌క్సెస్ కావాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం!

Comments

comments

Share this post

scroll to top