ఈ సమాజమే ఒక పాడు సమాజం. దయనీయ స్థితిలో ఉన్నవారిని చూసి సహాయం చేయాల్సింది పోయి నవ్వుతుంది. వ్యక్తుల్లో ఉన్న మంచి గుణాలను చూసి కాక వారికి ఉన్న వైకల్యాలను చూసి హేళన చేస్తుంది. పోనీ మన మానాన మనం పోదామా అంటే… ఉహు… అలా కాదు. వెంట పడి మరీ వేధిస్తుంది. అయినా తప్పదు. మనిషై పుట్టాక, ఎన్ని సమస్యలు వచ్చినా, అవమానాలు, హేళనలను ఎదురైనా, కష్టాలు వచ్చినా ముందుకు సాగిపోవాల్సిందే. పాడు లోకం చూసి నవ్విందని, ఎగతాళి చేసిందని మనం కుంగి పోకూడదు. జీవితంలో మనం చేయాలనుకున్న పని, సాధించాలనుకున్న లక్ష్యం, ఆశయాలు స్థిరంగా, బలంగా ఉన్నప్పుడు కుళ్లు సమాజం ఎంత ఎగతాళి చేసినా మనం ముందుకే పోతాం తప్ప వెనుకకు తిరిగే ప్రసక్తే లేదు. అదిగో… సరిగ్గా ఆ యువతి కూడా అలాగే చేసింది. ఆమే సంధ్యా నాయర్..!
సంధ్యా నాయర్ తల్లిది కేరళ. ఆమె ముంబైలోని కామటిపురకు బతుకు దెరువు నిమిత్తం వలస వచ్చింది. చేసేందుకు ఏ పని దొరక్కపోవడంతో సహజంగానే అక్కడి రెడ్‌లైట్ ఏరియాలో వేశ్యావృత్తిలోకి దిగింది. ఈ క్రమంలో ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అనంతరం అది పెళ్లికి దారి తీసింది. అప్పుడే సంధ్యా నాయర్ కూడా జన్మించింది. అయితే ఆమె తల్లి వేశ్యావృత్తిని వదిలేసి సాధారణ జీవితం గడుపుతున్నా ఆమె ఇంకా కామటిపురలోనే ఉండేది. దీంతో సంధ్యా నాయర్‌ను కూడా చిన్నప్పటి నుంచి అదే ఉద్దేశంతో చూసేవారు. పైగా ఆమె నల్లగా ఉండడంతో ఆమెను అందరూ హేళన చేసే వారు. స్కూల్లో అయితే ఆమె వీపు భాగంలో తోటి విద్యార్థులు నల్లకాకి, నల్ల ఆవు అని రాసి ఏడిపించేవారు. వాటన్నింటినీ సంధ్యా నాయర్ తట్టుకుంది. ఈ క్రమంలో ఆమె స్కూల్లో ఉండే ఓ ఉపాధ్యాయుడు ఆమెను లోబరుచుకుని అత్యాచారం చేశాడు. కానీ అప్పుడామెది చాలా చిన్న వయస్సు కావడంతో అది అత్యాచారమని ఆమెకు తెలియలేదు. ఆ విషయం ఆమెకు 16 ఏళ్లు వచ్చాకే తెలిసింది.
సమాజం నుంచి ఎన్ని హేళనలు, అవమానాలు, వేధింపులు ఎదురైనా సంధ్యా నాయర్ ఎలాగో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు తిరిగి కేరళకు వెళ్లిపోయారు. కానీ ఆమె మాత్రం కామటిపురలోనే ఉండిపోయింది. అందుకు బలమైన కారణం కూడా ఉంది. అదేమిటంటే… ఒకటి వేశ్యావృత్తికి చెందిన కుటుంబం నుంచి వచ్చినంత మాత్రాన అందరూ అలాంటి వారు కాదని. రెండోది శరీర రంగు. నలుపు అనేది శరీరానికి ఉండే సహజమైన రంగు మాత్రమే అని, మనిషి అసలైన గుణ గణాలు అతని లోపలే ఉంటాయి, అవే ఆ మనిషి మంచితనానికి కొలమానాలుగా నిలుస్తాయని. ఈ రెండు విషయాలను కామటిపురలోని ప్రజలకే కాదు, సమాజం మొత్తానికి చాటి చెప్పాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే వీధి నాటకాల ద్వారా కామటిపురలో ఉండే వారిలో చైతన్యం కలిగించింది. దీంతో చాలా మంది మహిళలు సంధ్యా నాయర్‌ను మెచ్చుకున్నారు కూడా. ఆమెను తమ సొంత కూతురిలా చూసుకోవడం మొదలు పెట్టారు.
అయితే సంధ్యానాయర్ వీధి నాటకాలు ఆడే సమయంలో పోలీసుల నుంచి ఆమెకు ఇబ్బందులు ఎక్కువయ్యేవి. ఆమె నాటకాల్లో ఎక్కువ భాగం వచ్చే పదాలు సెక్స్, వేశ్య తరహాలో ఉండేవి. దీంతో వారు ఆ మాటలు వినిపిస్తే చాలు సంధ్యా నాయర్‌ను తీసుకెళ్లి జైల్లో పెట్టేవారు. అయినా ఎలాగో బయటికి వచ్చి ఆమె తన పని తిరిగి ప్రారంభించేది. ఈ క్రమంలో ఆమెకు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో ఉన్న ఓ ఎన్జీవో నుంచి పిలుపు వచ్చింది. తాను చేపడుతున్న సమాజహిత కార్యక్రమాల గురించి అక్కడ తెలియజేయాలని, అక్కడ కూడా అలాంటి స్ట్రీట్ ప్లేస్ వేయాలని సదరు ఎన్జీవో వారు అడగడంతో ఇప్పుడామె అమెరికాలో ఉంటోంది. ఏది ఏమైనా, సంధ్యా నాయర్ లాంటి ధైర్యం ఉన్న యువతులు సమాజంలో ఉండాల్సిందే. ఎన్ని కష్టాలు, సమస్యలు వచ్చినా ఓర్పుతో, ధైర్యంగా వాటిని ఎదుర్కొని జీవితంలో ముందుకు వెళ్తూ తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతోంది. హ్యాట్సాఫ్ టు సంధ్యా నాయర్..!