నల్లగా ఉన్న వారంటే ఈ సమాజానికి ఎప్పుడూ చిన్నచూపే. వారిని అంటరానివారిగా అందరూ దూరంగా పెడతారు. నల్లగా ఉన్నవారితో మాట్లాడాలంటేనే కొందరు అదో రకంగా చూస్తారు. వికృతంగా ముఖం పెడతారు, చిట్లిస్తారు. ఒక మోస్తరు నలుపుంటేనే అలాంటి వారిని కొందరు అసహ్యించుకుంటారు. ఇక నలుపుకే నలుపు రంగులా ఉంటే..? కచ్చితంగా అవమానిస్తారు. గేలి చేస్తారు. బయట కనిపిస్తే చాలు, ఎగతాళితోనే రోజు మొదలవుతుంది. అదిగో.. ఆ యువతికి కూడా సరిగ్గా ఇలాంటి పరాభవాలే ఎదురయ్యాయి. అయినప్పటికీ ఆమె దిగులు చెందలేదు. తన ఫొటోలు తీసి ఎంత ఎగతాళి చేస్తారో చేసుకోండి అంటూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఒక్కసారిగా ఆ ఫొటోలు ఆమె జీవితాన్ని మార్చేశాయి. పలు అడ్వర్టయిజింగ్ కంపెనీలు ఆమెను మోడల్‌గా చూపించాలని తహ తహ లాడుతున్నాయి.
ఆమె పేరు న్యాకిమ్ గాట్వెక్. వయస్సు 24 సంవత్సరాలు. సూడాన్ దేశానికి చెందిన ఈ యువతి ప్రస్తుతం అమెరికాలోని మిన్నియా పోలిస్ నగరంలో నివాసం ఉంటోంది. అయితే న్యాకిమ్ చర్మం రంగు సహజంగానే నలుపు కలర్లో ఉంటుంది. అది ఎంతలా అంటే నలుపు రంగుకు, ఆమె చర్మానికి తేడా తెలియనంతగా ఉంటుంది. దీంతో ఆమెను చిన్నప్పటి నుంచి చాలా మంది అవమానించేవారు. నలుపు రంగులో ఉన్నావంటూ గేలి చేసేవారు. అయినా న్యాకిమ్ వాటిని లైట్‌గానే తీసుకుంది. ఈ క్రమంలోనే ఆమె యుక్త వయస్సుకు వచ్చింది. అయినప్పటికీ ఆమె చర్మం రంగు పట్ల ఎగతాళి చేసే వారు పెరిగారే తప్ప తగ్గలేదు.
కాగా ఒక రోజు న్యాకిమ్ కారులో వెళ్తుండగా ఆమెను చూసిన మరో కారు నడుపుతున్న వ్యక్తి ఆమెను ఎగతాళి చేశాడు. రూ.1కోటి ఇస్తాను, తెలుపు రంగుతో బ్లీచింగ్ చేయించుకో.. అంటూ ఆట పట్టించాడు. దీంతో న్యాకిమ్కు చిర్రెత్తుకొచ్చింది. అసలు మనుషులు అవతలి వారి మనస్సు, గుణాలు చూడాలి గానీ, వారికి చర్మం రంగుతో పనేంటి..? అంటూ తన ఫొటోలను కొన్నింటిని తీసి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. దీంతో అవి ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. అంతే.. రాత్రికి రాత్రే న్యాకిమ్ ఓవర్‌నైట్ స్టార్ అయింది. ఆమెను మోడల్‌గా పెట్టుకుని యాడ్స్ తీసేందుకు అడ్వర్టయిజింగ్ కంపెనీలు ఆమెను ఇప్పుడు ఎక్కువగా సంప్రదిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె ఇక ఓ నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే.. ఇకపై నలుపు రంగులో ఉన్నవారిని ఎవరైనా ఎగతాళి చేస్తే చూస్తూ ఊరుకోనని, గట్టిగా బుద్ధి చెబుతానని అంటోంది. అవును మరి, నిజంగా అవతలి వారి మనస్సు, మంచి గుణాలు చూడాలి గానీ, చర్మం రంగు చూస్తారా..? ఎవరైనా..? ఏంటో ఈ సమాజం, ఎప్పుడు మారుతుందో..!