IAS, IPS లను తయారుచేసిన మేథావి అతను.. ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు..!

Siva Ram

సివిల్స్‌ లో టాప్‌ ర్యాంక్‌ సాధించాలని కోరుకునే ప్రతి అభ్యర్థికి మొదటగా స్ఫురించే పేరు.. శంకర్‌ ఐఏఎస్‌ అకాడమీ.. చెన్నైలోని అన్నానగర్‌లో ఉన్న ఈ అకాడమీని దేశ వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్‌, ఐపీఎస్‌ అభ్యర్థులు తమకు లభించిన ఒక వరంగా భావిస్తారు. ఎంతో మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌లను సృష్టించిన కర్మాగారంగా శంకర్‌ ఐఏఎస్‌ అకాడమీ పేరు గాంచింది. అయితే దాని వ్యవస్థాపకుడు శంకర్‌ ది మాత్రం దీనగాథే అని చెప్పవచ్చు. పేద కుటుంబం నుంచి వచ్చి ఐఏఎస్‌ కావాలని అతను కన్న కలలు కల్లలు అయ్యాయి. అయితే తన పరాజయాలే ఇతరుల విజయాలకు మెట్లు కావాలని ఆయన కోరుకున్నాడు. అందుకే శంకర్‌ ఐఏఎస్‌ అకాడమీ పెట్టి ఎంతో మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌లను సృష్టించారు. కానీ ఇప్పుడాయన ఆకస్మిక మృతి ఎంతో మంది సివిల్స్‌ అభ్యర్థులకు కంట నీరు తెప్పిస్తోంది. ఆయన తమ మధ్య లేకపోవడం పెద్ద నష్టమని వారు భావిస్తున్నారు.

శంకర్‌(45)ది తమిళనాడులోని కృష్ణగిరి. అతనిది పేద కుటుంబం. తండ్రి వైన్‌ షాపులో పనిచేసేవాడు. అయితే చిన్నప్పటి నుంచి శంకర్‌కు ఐఏఎస్‌ కావాలని ఉండేది. అందులో భాగంగానే కష్టపడి చదివాడు. మాస్టర్స్‌ కూడా పూర్తి చేశాడు. అయితే 2001 నుంచి 2004వ సంవత్సరం వరకు ఆయన వరుసగా ప్రతి ఏడాది సివిల్స్‌ రాశారు. అయినా విఫలం అయ్యారు. అయినా నిరాశ చెందలేదు. తన పరాజయాలే ఇతర సివిల్స్‌ అభ్యర్థుల విజయాలకు మెట్లు కావాలని ఆశించి 2004లో చెన్నై అన్నానగర్‌లో 35 మంది స్టూడెంట్స్‌తో శంకర్‌ ఐఏఎస్‌ అకాడమీని ఏర్పాటు చేశారు. అయితే ఆ అకాడమీ సక్సెస్‌ అయింది. అందులో కోచింగ్‌ తీసుకున్న ఎంతో మంది అభ్యర్థులు సివిల్స్‌లో టాప్‌ ర్యాంక్ లు సాధించి ఐఏఎస్‌, ఐపీఎస్‌ అవడమే కాకుండా ప్రస్తుతం టాప్‌ పొజిషన్లలో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ అకాడమీలో ఏటా 300కి పైగా అభ్యర్థులకు శిక్షణనిస్తున్నారు.

అయితే శంకర్‌ ఎప్పటికప్పుడు పలువురు ప్రముఖ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతోపాటు మంచి లెక్చరర్లతో అకాడమీలో అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేవాడు. శంకర్‌ కూడా క్లాస్‌లు తీసుకునేవాడు. అభ్యర్థులు సివిల్స్‌లో టాప్‌ ర్యాంక్‌ సాధించే దిశగా శంకర్‌ వారికి ప్రేరణ ఇచ్చేవాడు. అలాగే ఆర్థిక సహాయం అవసరం ఉన్న విద్యార్థులకు కూడా సహాయం చేసేవాడు. అయితే తాజాగా శంకర్‌ చెన్నైలోని అన్నానగర్‌లో ఉన్న తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయారు. ఆయనకు భార్య వైష్ణవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిది ప్రేమ వివాహం. నిజానికి ఒకప్పుడు శంకర్‌ సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యేందుకు డబ్బు లేకపోతే ఢిల్లీకి అతనితో వెళ్లిన వైష్ణవి జాబ్‌ చేస్తూ అతనికి ఆర్థిక సహాయం చేసింది. తరువాత అకాడమీ పెట్టాక శంకర్‌ వైష్ణవి పీహెచ్‌డీకి సహాయం చేశాడు. తరువాత వారిద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారి, అది పెళ్లికి దారితీసింది. అయితే ఇప్పుడు శంకర్‌ ఆకస్మికంగా చనిపోవడంతో.. ఆయన అకాడమీలో ఒకప్పుడు చదువుకున్న, ఇప్పుడు చదువుకుంటున్న సివిల్స్‌ అభ్యర్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి తమకు తీరని లోటని, తమకు కలిగిన నష్టాన్ని ఇంకెవరితోనూ భర్తీ చేయలేమని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా.. శంకర్‌ జీవితం ఇలా అర్థాంతరంగా ముగియడం నిజంగా బాధగానే ఉంది కదా..!

Comments

comments