వేస‌వి సెల‌వుల్లో హోం వ‌ర్క్‌కు బ‌దులుగా ఆ స్కూల్ ఏం చేయ‌మ‌ని విద్యార్థుల‌కు చెప్పిందో తెలుసా..?

నేటి త‌రుణంలో విద్య వ్యాపారంగా మారిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఎప్పుడు చూసినా త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను ర్యాంకులు, మార్కులు అంటూ చంపుకు తింటున్నారు. దీనికి తోడు అటు మ‌రోవైపు స్కూల్స్‌, కాలేజీల యాజ‌మాన్యాలు కూడా ఇదే ప‌ద్ధ‌తిలో విద్యార్థుల‌ను రాచి రంపాన పెడుతున్నాయి. ఇక సెల‌వులు అంటూ వ‌స్తే విద్యార్థుల‌ను చ‌క్క‌గా హాలిడేస్ ఎంజాయ్ చేయ‌నీయ‌కుండా హోం వ‌ర్క్‌లు, అసైన్‌మెంట్లు అంటూ మ‌ళ్లీ చావ‌గొడుతున్నాయి. అయితే చెన్నైలోని ఆ స్కూల్ యాజ‌మాన్యం మాత్రం ఇందుకు భిన్నంగా ప్ర‌వ‌ర్తించింది. వేస‌వి సెల‌వులు ఇచ్చేశాం, పిల్ల‌ల‌ను చ‌క్క‌గా ఎంజాయ్ చేయ‌నీయండి.. అంటూ ప‌లు సూచ‌న‌ల‌తో కూడిన లెట‌ర్‌ను ఆ స్కూల్ యాజ‌మాన్యం విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు పంపింది. దీంతో ఆ లెట‌ర్ కాస్తా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

చెన్నైలోని అన్నై వయోలెట్‌ మెట్రిక్‌ స్కూల్‌ వేసవి సెలవుల్లో భాగంగా హాలిడే అసైన్‌మెంట్‌ పేరిట తల్లిదండ్రులకు ఓ లేఖ పంపింది. సెలవుల్లో మనకు ఇష్టమైన వారితో గడుపుతూ సెలవులను ఆస్వాదించాలంటూ ఆ లేఖ‌లో పేర్కొన్నారు. అంతే కాకుండా తల్లిదండ్రులు రోజుకు రెండుసార్లు తమ పిల్లలతో కలిసి భోజనం చేయాల‌ని, వారికి రైతుల కష్టం విలువ కూడా తెలియ‌జేస్తూ ఆహారం వృథా చేయకూడదనే విషయాన్ని అర్థమయ్యేట్లు చెప్పాల‌ని లేఖ‌లో రాశారు. బామ్మాతాతయ్యలతో, ఇరుగుపొరుగు వారితో బంధం పెంచుకొనేలా వారిని ప్రోత్సహించాలని, మొక్కలు నాటడం, జంతువులతో ఆడుకోవడం వంటి అలవాట్లను నేర్పించాల‍ని, భోజ‌నం చేశాక త‌మ ప్లేట్ల‌ను తామే క‌డుక్కునేలా మంచి అల‌వాట్ల‌ను సెల‌వుల్లో పిల్ల‌ల‌కు నేర్పాలంటూ ఆ లేఖ‌లో చెప్పారు. దీంతోపాటు అలాంటి మ‌రెన్నో మంచి విషయాలను లేఖ‌లో రాశారు.

అలా ఆ స్కూల్ లెట‌ర్‌ను త‌ల్లిదండ్రుల‌కు పంప‌డంతో అది కాస్తా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. విద‍్య వ్యాపారంగా మారిన నేటికాలంలో ఎప్పుడూ మార్కులు.. ర్యాంకులు..అంటూ విద్యార్థుల వెంటపడే పాఠశాల, కళాశాలల‌కు భిన్నంగా ఆ స్కూల్ వ్య‌వ‌హ‌రించిన తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. సాధార‌ణంగా చాలా పాఠశాలల్లో సెలవుల్లోనూ విద్యార్థులకు హోం వర్క్‌ ఇస్తారు. అయితే అందుకు భిన్నంగా ఆ పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు అన్ని మంచి విష‌యాల‌తో లేఖ పంప‌డంతో ఇప్పుడ‌ది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చదువే లోకంగా విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నార‌ని, తల్లిదండ్రులు కూడా సంపాదనలో మునిగిపోయి పిల్లలతో సమయం గడపలేకపోతున్నారని, అందుకే ఈసారి తాము ఇలా ప్లాన్‌ చేశామ‌ని పాఠ‌శాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ చెబుతున్నారు. ఏది ఏమైనా ఆ స్కూల్ చేసిన పనిని మ‌న‌మంద‌రం అభినందించాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top