స్కూళ్ల‌లో పిల్ల‌లు నేర్చుకుంటోంది ఏమిటి? అందంగా ఉన్న‌వారే మ‌నుషులు, అలా లేని వారు మ‌నుషులు కార‌నా..?

ఎవ‌రైనా త‌మ పిల్ల‌ల‌ను పాఠ‌శాల‌కు ఎందుకు పంపుతారు? విద్యాబుద్ధులు నేర్చుకుని, జ్ఞానం సంపాదించి జీవితంలో ఉన్న‌త స్థానాలకు ఎద‌గాల‌ని, ఉత్త‌మ దేశ పౌరులుగా గుర్తింపు పొందాల‌నే ల‌క్ష్యంతో పిల్ల‌ల‌ను స్కూల్స్‌కు పంపుతారు. మంచి అల‌వాట్లు, స‌మాజం, ఇత‌రుల ప‌ట్ల గౌర‌వం, స్నేహ‌భావం, మాన‌వ‌త్వం క‌లిగి ఉండ‌డం లాంటివ‌న్నీ చిన్నారుల‌కు స్కూల్స్‌లోనే తెలుస్తాయి. తోటి పిల్ల‌ల‌ను చూసి కూడా వారు ఎంతో కొంత నేర్చుకుంటారు. అయితే అలా కాకుండా వారిలో ద్వేషం, అసూయ, హేళ‌న భావాలు క‌లిగేలా చేసే పాఠాలు ఉంటే దాన్ని చ‌దువే అంటారా? నిజంగా అలాంటి చ‌దువేనా మ‌న పిల్ల‌ల‌కు కావ‌ల్సింది? కాదు క‌దా! ఎలాంటి భేద భావాలు లేకుండా తోటి మ‌నుషుల‌ను స‌మానంగా చూడ‌మ‌ని చెప్తేనే అది చదువ‌వుతుంది. లేదంటే ఆ పాఠ్య పుస్త‌కంలో ఉన్న‌ట్టే ఉంటుంది.

beautiful-ugly

పై చిత్రాన్ని చూశారుగా! అందులో ఏం కనిపిస్తోంది. అందంగా ఉన్న ఓ మ‌హిళ‌, ఆమె ప‌క్క‌నే అంద విహీనంగా ఉన్న మ‌రో మ‌హిళ‌కు చెందిన బొమ్మ‌లు ఉన్నాయి క‌దా! అవును. ఆ పాఠాన్నే ఓ త‌ర‌గ‌తికి చెందిన పిల్ల‌లు ఇప్పుడు చ‌దువుకుంటున్నారు. అందంగా ఉన్న మ‌హిళ చిత్రం కింద బ్యూటిఫుల్ (Beautiful) అని, అందంగా లేని మ‌హిళ చిత్రం కింద అగ్లీ (Ugly) అని రాసి ఉంది. దాన్నే చిన్నారులు చ‌దువుతున్నారు. కానీ ఒక్క విష‌యం ఆలోచిస్తేనే అర్థ‌మ‌వుతుంది. పాఠం నేర్చుకునే క్ర‌మంలో చిన్నారులు బ్యూటిఫుల్‌, అగ్లీ అనే ప‌దాల‌ను కూడా నేర్చుకుంటున్నారు క‌దా, దీంతో ఈ రెండు ప‌దాలు వారి మ‌న‌స్సులో అలా నాటుకుపోతాయి. ఈ క్ర‌మంలో వారు పెరిగి పెద్ద‌గా అయితే బ‌య‌టెక్క‌డైనా అందంగా ఉన్న‌వారు క‌నిపిస్తే వారికి ఆక‌ర్షితుల‌వుతారు. అంద విహీనంగా ఉన్న వారిని చూస్తే మొఖం తిప్పుకుంటారు. లేదంటే హేళ‌న చేస్తారు. అక్క‌డికేదో అందంగా ఉన్న‌వారే మ‌నుషులు, అందంగా లేని వారు మ‌నుషులు కాదు అన్న‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తారు. అదే త‌ర‌హా వ్య‌క్తిత్వాన్ని క‌లిగి ఉంటారు. అదీ అస‌లు క‌థ‌. అంటే చిన్న‌ప్పుడు వారు నేర్చుకున్న పాఠం ద్వారా వారికి అబ్బిన జ్ఞానం అటువంటిద‌న్న‌మాట‌.

ప‌దాల‌ను నేర్పాల‌నే ఉద్దేశంతో ఉపాధ్యాయులు మ‌నుషుల‌నే ఉదాహ‌ర‌ణ‌లుగా తీసుకుని, అంద‌రు మనుషులు స‌మానం కాద‌నే అర్థాన్ని స్ఫురించేలా బ్యూటిఫుల్‌, అగ్లీ అనే ప‌దాల‌ను చిన్నారుల‌కు నేర్పుతున్నారు. నిజంగా ఆ ప‌దాలు ఏమిటో, వాటికి అర్థాలు ఏమిటో తెలియ‌జేయాలంటే మ‌నుషుల అందం గురించే చెప్పాలా? సృష్టిలో బ్యూటిఫుల్, అగ్లీ గురించి చెప్పాలంటే ఇక వేరే ప‌దాలు ఏం లేవా? ఉదాహ‌ర‌ణ‌లు ఏం దొర‌క‌డం లేదా? బ‌్యూటిఫుల్‌, అగ్లీ అని చెబుతున్నారు స‌రే, దాంతో పిల్ల‌ల మెద‌డులోకి వెళ్లే అర్థం వేరుగా ఉంటుంద‌న్న‌ది తెలియ‌డం లేదా? అస‌లు ఇలాంటి పాఠాల‌ను త‌యారు చేసిన వారిని, వాటిని ఆమోదించిన ఎడ్యుకేష‌న్ బోర్డును ఏమ‌నాలి? ఇదేనా మ‌నం పిల్ల‌ల‌కు నేర్పించేది? నేర్పించాల‌నుకునేది? అయ్యా! నాయ‌కులారా! అధికారులారా! ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వండి. మ‌న పిల్ల‌లు ఏం నేర్చుకుంటున్నారో, వారికి ఎలాంటి జ్ఞానం అల‌వ‌డుతుందో ఒక‌సారి చూడండి. అదే త‌ర‌హా పాత ధోర‌ణిలో వెళ్తాం అంటే మాత్రం పైన చెప్పిన బ్యూటిఫుల్, అగ్లీ పాఠం మీకు కూడా ఎదుర‌వుతుంది, జాగ్ర‌త్త‌!

Comments

comments

Share this post

scroll to top