ముగ్గురు కేంద్ర మంత్రుల కాఫీ బిల్లు నెలకు రూ.3 లక్షలట… బెంగుళూరు ఎయిర్‌పోర్టులో స్టేట్ ప్రోటోకాల్ అధికారుల స్కాం బాగోతం…

ఎవరైనా 5 కాఫీలు, 6 గ్లాసుల జ్యూస్, కొన్ని శాండ్‌విచ్‌లు, ఆరు వాటర్ బాటిల్స్‌ను ఒకేసారి స్వాహా చేయగలరా? ఎవరూ చేయలేరు. ఒకవేళ వారు మహా తిండిపోతులు అయితే తప్ప. కానీ మన కేంద్ర మంత్రులు చేశారట. ఇదీ బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌కు చెందిన స్టేట్ ప్రోటోకాల్ అధికారులు చెబుతున్న లెక్క. ఇలా ఆ రాష్ర్టానికి చెందిన ముగ్గురు కేంద్ర మంత్రులు తింటూ నెలకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు కేవలం ఫుడ్, కాఫీలపైనే ఎయిర్‌పోర్టులో ఖర్చు చేస్తున్నారట. అయితే ఇదంతా నిజం కాదు. సదరు ప్రోటోకాల్ అధికారుల స్కాం బాగోతం తాజాగా బయటికి వచ్చాక తెలిసిన పచ్చి అబద్దాలు.
central-ministers-coffee-bi
కర్ణాటక రాష్ర్టానికి చెందిన డీవీ సదానంద గౌడ, అనంత్ కుమార్, జీఎం సిద్దేశ్వరలు ప్రస్తుతం పలు శాఖలకు గాను కేంద్రమంత్రులుగా ఉన్నారు. వీరంతా స్థానిక బెంగుళూరు నగరం నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో వారు బెంగుళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (కేఐఏ) నుంచి ఎక్కువగా విమానాల్లో ప్రయాణం చేస్తున్నారు. అయితే ఎయిర్‌పోర్ట్ వద్ద వారు తిన్న ఆహారం, ఇతర అవసరాలకు గాను నెలకు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చవుతుంది. కాగా ఈ మధ్య కాలంలో అది ఏకంగా నెలకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలకు చేరింది. దీంతో సదరు మంత్రి వర్యులపై ఖర్చులపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో మంత్రి సదానంద గౌడ ఖర్చుల విషయంలో జరిగిన అవకతవకలపై జోక్యం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో రంగంలోకి దిగిన ఆడిట్ అధికారులు విచారణ చేయగా ఎయిర్‌పోర్ట్‌లో వీఐపీల కోసం విధులు నిర్వహించే రాష్ట్ర ప్రోటోకాల్ అధికారులే ఈ స్కాంకు పాల్పడ్డారని, అందులో ఓ మాజీ అధికారి హస్తం కూడా ఉందని నిజం నిగ్గు తేల్చారు.
కాగా మంత్రుల ఖర్చులకు సంబంధించిన బిల్స్‌ను ఆడిట్ అధికారులు తనిఖీ చేయగా ఓ మినిస్టర్ ఏకంగా ఒకేసారి 5 కాఫీలు, 6 గ్లాసుల జ్యూస్, శాండ్‌విచ్‌లు, 6 వాటర్ బాటిల్స్ తాగాడని బిల్లుల్లో కనిపించడం గమనార్హం. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఎంతో విలువైన ప్రజాధనం వృథాగా పోతుందని చెప్పడానికి. అసలు కేంద్ర మంత్రుల లాంటి వ్యక్తులకు ఎయిర్‌పోర్టుల్లో అంతసేపు రిలాక్స్‌డ్‌గా ఆగి అన్ని పదార్థాలు తినేందుకు సమయమే ఉండదని, తాగితే ఒకటి, అరా కాఫీ, టీ లేదా జ్యూస్, ఏదైనా ఫుడ్ తినేందుకు అవకాశం ఉంటుంది కానీ అంత మొత్తంలో ఎలా తింటారని ఆడిట్ అధికారులు చెప్పడం కొసమెరుపు.
ఇలాంటి సంఘటనలతోనైనా మన నాయకులు కళ్లు తెరిచి అన్యాయాలకు, అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఎంతో విలువైన ప్రజాధనాన్ని కాపాడాలని ఆశిద్దాం.

Comments

comments

Share this post

scroll to top