మినిమం బాలన్స్ లేని అకౌంట్ ల నుండి 2017 మొత్తంలో “ఎస్‌బీఐ” ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలుసా.?

ఒకప్పుడు అంటే ఏమోగానీ ఇప్పుడు ఎస్‌బీఐలో ఖాతా కలిగి ఉన్నవారు కచ్చితంగా మినిమం బ్యాలెన్స్‌ మెయింటెయిన్‌ చేయాల్సిందే. లేదంటే ఫైన్‌ పడుతుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చింది. ఈ క్రమంలోనే నగరాల్లో ఎస్‌బీఐ ఖాతాదారులు తమ ఖాతాల్లో రూ.3వేలను మినిమం బ్యాలెన్స్‌గా మెయింటెయిన్‌ చేయాల్సి వస్తోంది. అదే పట్టణాలు అయితే రూ.1వేయి ఉండాలి. లేదంటే రూ.100 (జీఎస్‌టీ కాకుండా) వరకు చార్జిలను వసూలు చేస్తున్నారు. అయితే ఈ చార్జిల ద్వారా ఎస్‌బీఐ బ్యాంకు ఎంత ఆదాయం ఆర్జించిందో తెలుసా..? అక్షరాలా రూ.1771 కోట్లు. అవును, మీరు విన్నది నిజమే.

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ మధ్య కాలంలో ఎస్‌బీఐ మినిమం బ్యాలెన్స్‌ మెయింటెయిన్‌ చేయని వారి ఖాతాల నుంచి రూ.1771 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేసింది. ఇది ఆ బ్యాంకు సాధించిన రూ.1581.55 కోట్ల లాభం కన్నా ఎక్కువ కావడం విశేషం. అయితే ఎస్‌బీఐ బ్యాంకు తరువాత అత్యధిక మినిమం బ్యాలెన్స్‌ను వసూలు చేసిన బ్యాంకుల్లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నిలిచింది. ఆ బ్యాంక్‌ పైన చెప్పిన కాలంలో రూ.97.34 కోట్లను, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.68.67 కోట్లను, కెనరా బ్యాంక్‌ రూ.62.16 కోట్లను మినిమం బ్యాలెన్స్‌ ఫైన్‌ కింద వసూలు చేశాయి.

ఇక దేశంలో ఉన్న 21 పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులలో అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన వారి మొండి బకాయిలు రూ.7.33 లక్షల కోట్లు ఉండగా, వాటిలో రూ.2.28 లక్షల కోట్లను ఆర్‌బీఐ, ఆయా బ్యాంకులు రద్దు చేశాయి. ఈ మొండి బకాయిలు గత 9 సంవత్సరాల కాలం నుంచి అలాగే ఉండడం విశేషం. అయితే ఈ మొండి బకాయిల్లో గడిచిన ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబర్‌ల మధ్య రూ.55,356 కోట్లను రద్దు చేశారు. కానీ మరో వైపు మాత్రం జనాలపై మినిమం బ్యాలెన్స్ అకౌంట్‌ చార్జిలను వేస్తూ బ్యాంకులు లాభాలను గడిస్తున్నాయి. దీంతో జనాల వద్ద సొమ్మను దోచేసి బ్యాంకులు తమకు రావల్సిన మొండి బకాయిలను కవర్‌ చేసుకుంటున్నాయని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఇది మరి కొంత కాలం కొనసాగే అవకాశం ఉంది. అయితే త్వరలో ఎస్‌బీఐ మినిమం బ్యాలెన్స్‌ విషయంలో మరో నిర్ణయం తీసుకోనుంది, దాని పరిమితిని మరింత తగ్గించే అవకాశం ఉందని తెలుస్తున్నది..!

Comments

comments

Share this post

scroll to top