ఒలంపిక్ గేమ్స్ ముగియడానికి వచ్చినా…ఇండియా బోణీ ఎప్పుడు కొడుతుందా? ఒక్కటైనా దక్కునా? అంటూ ఆశగా ఎదురుచూస్తున్న 125 కోట్ల భారత ప్రజల ఆశలను నిజం చేస్తూ సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించి రాఖీ పండుగ నాడు ఒలంపిక్ పతకాన్ని దేశ ప్రజలకు కానుకగా అందించింది. దేశానికి పతకం సాధించి పెట్టిన మొదటి మహిళా రెజ్లర్ గా…ఒలంపిక్స్ లో భారత్ కు పతకాన్ని తీసుకొచ్చిన 4 వ మహిళా క్రీడాకారిణి రికార్డ్ ను నెలకొల్పింది. హర్యానాలోని ఓ మారుమూల పల్లెటూరు లో పుట్టిన సాక్షి..12 యేళ్ల వయస్సు నుండే రెజ్లింగ్ ను స్టార్ట్ చేసింది. అబ్బాయిలతో కుస్తీ పట్టి వారిని మట్టికరిపించేది.
సాక్షి తో పట్టు పట్టడానికి ఆ ప్రాంతంలోని చాలా మంది అబ్బాయిలు సైతం భయంతో వణికిపోయేవారంటేనే తెలుస్తుంది సాక్షి పోరాటతత్వం. రెజ్లింగ్ అంటేనే సాహసక్రీడ..ప్రాణాలను సైతం లెక్కచేయని గేమ్..అందులో ఆడపిల్ల…వద్దంటే వద్దు అని వారించిన బంధువులు..అయినా ఆమె తల్లిదండ్రులు సాక్షి నిర్ణయానికే ఓకే చెప్పారు. అనేక అడ్డంకుల నడుమ 23 యేళ్ల సాక్షి అంచెలంచెలుగా తన ప్రతిభను చాటుతూ నేడు అత్యుత్తమ పతకమైన ఒలంపిక్స్ పతకాన్ని సాధించి యావత్ దేశ ప్రజలకు సగర్వంగా అంకితమిచ్చింది.
ఆమె సాధించిన పతకాలు:
- 2014 లో గాస్లో కామెన్ వెల్త్ లో రజతం
- 2015 లో దోహాలో జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో కాంస్యం.
- 2016 లో ఒలంపిక్స్ లో కాంస్యం.
ఒలంపిక్స్ లో కాంస్యం సాధించిన విధానం:
ఒలంపిక్స్ 58 Kg ల రెజ్లింగ్ పోటీలో పాల్గొన్న సాక్షి తన మొదటి మ్యాచ్ లో గెలిచింది. తర్వాతి మ్యాచ్ వలేరియా కొబ్లోవా చేతిలో పరాజయం పొందింది…అయితే రెజ్లింగ్ లో రేప్ ఛేంజ్ అని ఓ నియమం ఉంటుంది దీని ప్రకారం…ఫైనల్ కు చేరిన ఇద్దరు క్రీడాకారుల చేతిలో ఓడిన పోటీదారుల మద్య మరోసారి మ్యాచ్ నిర్వహిస్తారు..అందులో గెలిచిన వారికి కాంస్య పతకాన్ని అందిస్తారు. అందుకే రెజ్లింగ్ లో రెండు కాంస్య పతకాలుంటాయి. ఈ నియమం ప్రకారం ఫైనలిస్ట్ చేతిలో ఓడిన సాక్షి మళ్లీ మ్యాచ్ లోకి ఎంటర్ అయ్యి మంగోళియా, కిర్జిస్థాన్ క్రీడాకారిణిలతో సహా వరుసగా నలుగురి పై విజయం సాధించి కాంస్యాన్ని కైవసం చేసుకుంది.
ఒక్క అవార్డ్-2.5 కోట్లు.:
రెజ్లింగ్ లో కాస్యం సాధించిన సాక్షి మాలిక్ కు 2.5 కోట్ల రూపాయలు దక్కనున్నాయి.
ఒలంపిక్స్ లో బంగారు పతకం సాధిస్తే 6 కోట్లు, రజతానికి 4 కోట్లు, కాంస్యానికి 2 కోట్లు ఇస్తామని హర్యానా ప్రభుత్వం చెప్పింది. సాక్షి హర్యానా రాష్ట్రానికి చెందింది కావున ఆమెకు 2 కోట్లు దక్కినట్టు.
ఇక భారత రైల్వే కూడా తమ సంస్థకు చెందిన క్రీడాకారులు బంగారు పతకం గెలిస్తే 1 కోటి, రజతానికి 75 లక్షలు, కాంస్యానికి 50 లక్షలు ఇస్తామని వాగ్దానం చేసింది. సాక్షి రైల్వే క్రీడాకారిణి కాబట్టి వాళ్లు ఇచ్చే 50 లక్షలు కూడా దక్కినట్టే…దీనికి తోడు పతకం గెలిస్తే సల్మాన్ ఖాన్ ఇస్తానన్న 1 లక్ష కూడా అమెకు దక్కనున్నాయి. అన్నింటిని మించి….125 కోట్ల భారతీయుల అభిమానాన్ని ఆమె దక్కించుకుంది.