ఆయనో సామాన్య జర్నలిస్ట్..అక్షరం విలువ తెలిసినవాడు, పుస్తకాల విజ్ఞానాన్ని ఆస్వాదించినవాడు. కానీ ఆయన దిగులంతా గ్రామాల మీదే..!? వీడియో గేమ్స్, బట్టీ చదువులు, మార్కుల వెంట పరిగెడుతూ అసలైన బాల్యానికి, సరైన విజ్ఞానానికి దూరమవుతున్న బాల్యం. సీరియల్స్ కు బానిసవుతూ బంధాలకు అనుబంధాలకు దూరమవుతున్న కుటుంబాలు.. చైతన్యం లేక చెప్పుడు మాటలు వింటూ బతుకులను పాడు చేసుకుంటున్న గ్రామస్థుల అజ్ఞానం. ఆయన ఆలోచనలన్నీ వీటిమీదే… ఇక లాభంలేదని సమరశంఖం పూరించాడు ఆ సామాన్య వ్యక్తి. వీటిని అడ్డుకోడానికి గ్రంథాలయాలే సరైన సమాధానాలని తలచి…తోపుడు బండితో బయలు దేరాడు.తోపుడు బండి నిండా పుస్తకాలను అందంగా పేర్చి 100 రోజుల పాటు 100 గ్రామాలను కాలినడకన సందర్శించాడు…వెళ్లిన ప్రతిగ్రామంలో పుస్తకాల యొక్క అవసరాన్ని, గ్రంథాలయాల ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేస్తూ తన ప్రయాణాన్ని సాగించాడు. ఆయన లక్ష్యం మాత్రం తాను సందర్శించిన ప్రతి గ్రామంలో ఓ చిన్నపాటి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి…ఆ గ్రామస్థులను చైతన్య వంతులను చేయాలని.
అనుకున్నట్టుగానే 100 రోజులు తోపుడు బండి పాదయాత్ర ముగిసింది.ఇప్పుడే అసలైన గ్రంథాలయోద్యమం స్టార్ట్ అయ్యింది. తాను చెప్పిన ప్రకారమే గ్రామగ్రామానికి గ్రంథాలయ ఏర్పాటుకార్యక్రమం ఆదర్శగ్రామమైన గంగదేవి పల్లి నుండి ప్రారంభం అయింది. ఒక్కో గ్రంధాలయానికి 5,6 కుర్చీలు, టేబుళ్ళు, రాక్ లు, ఊరిని బట్టి 200 నుండి 500 వరకి పుస్తకాలు ఇవ్వబోతున్నారు.. విద్యారంగంలోకి కార్పొరేట్ కాకులు ప్రవేశించాక పిల్లలకు బేసిక్ నాలెడ్జ్ కరువవుతుంది.. అది కూడా దృష్టిలో ఉంచుకొని పిల్లలకోసమే ఎక్కువ పుస్తకాలు గ్రంధాలయంలో నెలకొల్పబోతున్నారు.. దానిలో భగవద్గీత కూడా ఉండటం చాలా సంతోషం.. కొన్ని ఊర్లు స్వచ్చందంగా ముందుకొచ్చి గ్రంధాలయాలకు సహకరిస్తుండగా కొందరు దాతలు కూడా ముందుకు రావడం శుభపరిణామం.
ఒక పుస్తకంతో ఒక పిల్లాడు బాగుపడుతాడు, ఒక కుటుంబం బాగుపడుతుంది, ఒక తరం బాగుపడుతుంది, ఒక ఊరు బాగుపడుతుంది….ఇది చాలు మన జీవిత సార్థకానికి అని మండుటెండలో ఊరూర తిరిగి అక్షర విత్తనాలను నాటి, విజ్ఞాన కుసుమాలను పూయించడానికి పూనుకున్న ఈ వట్టికోట వారసుడికి, అతడికి అన్నివిధాలుగా అండగా ఉన్న శివ, భానూజీ, నకుల్ లకు అభినందనలు.. !!
NOTE: 100 గ్రామాల్లో 100 గ్రంథాలయాలు అంటే మాటలు కాదు..అందుకే మీ దగ్గరున్న పుస్తకాలను, లేదా కుర్చీలు, టేబుల్స్, రాక్స్ ను లేదా డబ్బును అందించి….విజ్ఞానాన్ని అందించే కార్యక్రమంలో మీరూ భాగస్వామ్యులు అవ్వొచ్చు.
మ్యాన్ ఫర్ లైబ్రరీ FB Profile Click: HERE
Call Him On: 9346108090, 7386868267.