సచిన్ టెండుల్కర్.. ఈ పేరు చెబితే చాలు.. ఓ సగటు భారతీయ క్రికెట్ అభిమాని హ్యాపీగా ఫీలవుతాడు. అవును నిజమే. భారత క్రికెట్‌కు సచిన్ అందించిన సేవలకు మనం పేరు పెట్టలేం. క్రికెట్ దేవుడిగా పేరు గాంచిన సచిన్‌పై క్రికెట్ గురించి మాట్లాడడం అంటే అతన్ని తక్కువ చేసినట్టే అవుతుంది. కానీ.. ఇప్పుడు చర్చ అది కాదు. ఆయన రాజ్యసభ ఎంపీగా ఏం చేశారు ? 6 ఏళ్ల పాటు పదవిలో ఉండి కూడా ఏనాడైనా సభకు వచ్చారా ? ప్రజా సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడారా ? అంటే.. లేదు.. కానీ.. అంతకు మించి హుందాగా వ్యవహరించారు. అవును.. కరెక్టే.. ఏ ఎంపీ చేయని విధంగా ఆయన తన నిధులను ఉపయోగించారు. చివరకు ఎంపీగా 6 ఏళ్లలో తనకు వచ్చిన జీతం, ఇతర అలవెన్స్‌లను కూడా పేదల కోసం ఇచ్చేసి దాతృత్వం చాటుకున్నాడు.
సచిన్ టెండుల్కర్ మనకు ప్రముఖ క్రీడాకారుడిగా తెలుసు. ఆయన తన చివరి మ్యాచ్‌లో వీడ్కోలు పలకడం అందరినీ కంట తడి పెట్టించింది. సరే.. ఏ క్రీడాకారుడికైనా రిటైర్మెంట్ అనేది అనివార్యం. అందులో భాగంగానే సచిన్ కూడా రిటైర్మెంట్ తీసుకున్నాడు. అందుకు ఓ రకంగా మనం కూడా సచిన్‌కు బెస్ట్ విషెస్ చెప్పాలి. చెప్పాం… తరువాత ఆయన యూపీఏ హయాంలో రాజ్యసభ ఎంపీ అయ్యారు. అయితే ఎంపీ అయ్యాక ఏం చేశారు ? ఏనాడైనా సభకు వచ్చారా ? వచ్చారు.. ఎప్పుడు.. 6 సంవత్సరాల పదవీ కాలంలో ఏదో.. మొక్కుబడిగా ఒకటి రెండు సార్లు పార్లమెంట్‌కు వచ్చారు.. సరే.. వచ్చినా కూడా ప్రజా సమస్యలపై పార్లమెంట్ లో మాట్లాడారా ? అంటే.. అదీ లేదు. చివరకు అలా కాలం ముగిసింది. త్వరలో ఆయన సదరు ఎంపీ పదవి నుంచి కూడా తప్పుకోనున్నారు. మరి ఇన్నేళ్లలో ఎంపీగా ఆయన ఒరగ బెట్టిందేమిటి ? అంటే.. చాలా తప్పు.. మనం అలా అనుకోకూడదు.. ఎందుకంటే..
గడిచిన 6 సంవత్సరాల కాలంలో ఎంపీగా సచిన్ రాజ్యసభకు రాకపోవచ్చు. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడకపోవచ్చు. కానీ ఆయన మాత్రం తన బాధ్యతను ఎన్నడూ మరువలేదు. తనకు వచ్చిన ఎంపీ ల్యాడ్స్ నిధులను సక్రమంగా వినియోగించారు. రూ.30 కోట్ల నిధులను దేశ వ్యాప్తంగా పలు పనులకు ఉపయోగించారు. అందులో కేవలం విద్య కోసమే రూ.7.4 కోట్ల వరకు వెచ్చించారు. ఇక మహారాష్ట్రలోని దోంజా, ఏపీలోని పుట్టం రాజు కండ్రిగ అనే రెండు గ్రామాలను సచిన్ దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేశాడు. అలాగే ఈ 6 సంవత్సరాల కాలంలో ఎంపీగా తనకు వచ్చిన జీతం, అలెవెన్స్‌లు మొత్తాన్ని రూ.90 లక్షలను ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చేశాడు. నిజంగా ఇలా ఏ రాజ్యసభ ఎంపీ అయినా చేశాడా..? అందుకు మనం సచిన్‌ను అభినందించాల్సిందే. పార్లమెంట్లో ప్రజా సమస్యలపై మాట్లాడకపోయినా, వారి సమస్యలు పరిష్కారమయ్యేందుకు తన చేతనైనంత సహాయం మాత్రం టెండుల్కర్ చేశాడనడంలో అతిశయోక్తి లేదు కదా..!