సామాన్యుడి ఆయుధం స‌మాచారం హ‌క్కు చ‌ట్టం – ప్ర‌శ్నించ‌క పోతే మ‌ర‌ణించిన‌ట్టే లెక్క.!!

ఈ దేశంలో 110 కోట్ల మందికి పైగా ఉన్నా కేవ‌లం 15 శాతం వ్య‌క్తులు..కార్పొరేట్ కంపెనీలు..బ‌డాబాబుల క‌నుస‌న్న‌ల‌లో ప్ర‌భుత్వాలు న‌డుస్తున్నాయి. దేశానికి స్వతంత్రం వ‌చ్చి 70 ఏళ్ల‌యినా ఇంకా ప్రాథ‌మిక హ‌క్కుల కోసం కొట్లాడాల్సిన ప‌రిస్థితి దాపురించింది. చ‌ట్టాలు అమోఘంగా ఉన్నాయి..కానీ అమ‌లు ద‌శ‌లో విఫ‌ల‌మ‌య్యాయి. సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల పేరుతో పాల‌కులు కోట్లు నొక్కేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ..సామాన్యుల‌కు అంద‌కుండా చేస్తున్నారు. ప‌న్నులు చెల్లించే ప్ర‌తి ఒక్క‌రికి అడిగే హ‌క్కు ఉన్న‌ది. ప్ర‌తి పైసా ఈ దేశంలో జీవిస్తున్న ప్ర‌తి పౌరుడిది . ఇది గుర్తించ‌కుండా అధికారులు, పాల‌కులు, రాజ‌కీయ నేత‌లు, మ‌ధ్య దళారీలు..బిజినెస్ టైకూన్స్ గండి కొడుతున్నారు. లెక్క‌లేన‌న్ని ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయి. కానీ ఇంకా పేద‌రికం వెంటాడుతూనే ఉంది. కేంద్ర , రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిసి ఎన్నో కార్య‌క్ర‌మాలు, ప్రోగ్రామ్స్ కు రూప‌క‌ల్ప‌న చేస్తున్నాయి. క‌నీసం 20 శాతం కూడా ల‌బ్దిదారుల‌కు చేర‌డం లేదు.

right to information rti

ప్ర‌జ‌ల‌కు సంబంధించిన ఏదైనా స‌రే..తెలుసు కోవాల్సిన బాద్య‌త స‌గ‌టు భార‌తీయుడికి ఉంద‌ని రాజ్యాంగం పేర్కొంది. అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో 2005 అక్టోబ‌ర్ 12న స‌మాచార హ‌క్కు చ‌ట్టం దేశ మంత‌టా అమ‌లులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా స‌ర్కారు ప‌నుల‌పై స‌మాచారాన్ని పొంద‌వ‌చ్చు. గ‌తంలో పార్ల‌మెంట్‌, విధాన స‌బ‌, విధాన ప‌రిష‌త్ స‌భ్యుల‌కు మాత్ర‌మే ఈ సౌక‌ర్యం ఉండేది. దీనిని ప్ర‌తి ఒక్క‌రు తెలుసుకునే సౌక‌ర్యాన్ని క‌ల్పించింది. సామాన్యుల‌కు స‌మాచార హ‌క్కు చ‌ట్టం ఓ ఆయుధ‌మ‌నే చెప్పాలి. ఏ కార్యాల‌యానికి వెళ్లినా స‌మాచారం పొంద‌టం క‌ష్టంగా మారింది. లంచం ఇవ్వ‌నిదే ఫైలు క‌ద‌ల‌లేని ప‌రిస్థితి. ఈ చ‌ట్టం ద్వారా త‌న ఫైలు ఎక్క‌డుందో తెలుసుకునే వీలు క‌లుగుతుంది. అధికారులు అడ‌గ‌క పోయినా..వారంత‌ట వారే విధి విధానాలు..ఉద్యోగుల బాధ్య‌త‌లు మొద‌లైన 17 అంశాల గురించి స‌మాచారం ఇవ్వాలి. దీని ప్ర‌కారం ప్ర‌తి స‌ర్కారు ఆఫీసులో స‌హాయ పౌర స‌మాచార అధికారి, అప్పిలేట్ అధికారి..పేరు, ఫోన్ నెంబ‌ర్ల‌ను ప్ర‌జ‌ల‌కు క‌నిపించేలా బోర్డుపై రాసి ఉంచాలి. ఈ చ‌ట్టంలో 6 అధ్యాయాలు, 31 సెక్ష‌న్లు ఉన్నాయి.

రికార్డులు, ప‌త్రాలు, మెమోలు, ఈమెయిల్స్‌, అభిప్రాయాలు, స‌ల‌హాలు, ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు, స‌ర్క్యుల‌ర్లు, ఉత్త‌ర ప్ర‌త్యుత్త‌రాలు, లాగ్ పుస్త‌కాలు, ఒప్పందాలు, నివేదిక‌లు, న‌మూనాలు, త‌నిఖీ రికార్డులు ఇందులో ఉండాల్సిందే. ఈ స‌మాచారం ఎల‌క్ట్రానిక్ రూపంలో కూడా ఉండొచ్చు. గ్రామాపంచాయతీలు, రేష‌న్ డీల‌ర్లు, అంగ‌న్ వాడీలు, విద్యా శాఖ‌, పీహెచ్‌సీలు, సీఎం స‌హాయ నిధి, ల‌బ్దిదారులు, అందిన సాయం, ప్ర‌జాప్ర‌తినిధులు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ..వారికి వ‌చ్చిన నిధులు, ఎన్నిక‌ల క‌మిష‌న్ నుండి వివ‌రాలు, ప్ర‌భుత్వ ఉద్యోగుల ఆస్తుల వివ‌రాలతో పాటు ప్ర‌తి కార్యాల‌యం గురించి తెలుసుకునే ..అడిగే వీలు ఈ చ‌ట్టం ద్వారా క‌లుగుతుంది. ప‌నుల వివ‌రాలు, ప‌త్రాలు, రికార్డులు త‌నిఖీ చేసేందుకు..వాటి నోట్స్ తీసుకునేందుకు..ధృవీక‌ర‌ణ ప‌త్రాలు పొందేదుకు..టేపులు, వీడియో కేసెట్లు, ప్రింట్లు తీసుకునే అవ‌కాశం ఏర్ప‌డుతుంది. జిల్లాపరిషత్ లు, పురపాలక సంఘాలు, గ్రామపంచాయితీలు, కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ఇతర రెవిన్యూ అధికార కార్యాలయాలు, విద్యాశాఖ, పౌరసరఫరాల శాఖ, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ బ్యాంకులు, సంస్థలు మొదలైనవన్నింటికి ఈ చట్టం అన్వయిస్తుంది.

సమాచారం కావాల్సిన వారు ..సంబంధిత శాఖ కార్యాల‌యం స‌హాయ స‌మాచార అధికారికి ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించాలి. తెల్ల కార్డున్న పేదలకు గ్రామ స్థాయి సంస్థల్లో అడిగే సమాచారానికీ దరఖాస్తు రుసుము లేదు. మండల స్థాయిలో 5 రూపాయ‌లు, జిల్లా స్థాయిలో 10 రూపాయ‌లు చెల్లించాలి. నెల రోజులు దాటితే..స‌మాచారం ఉచితంగా ద‌ర‌ఖాస్తు దారుడికి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల ఆస్తి పాస్తుల వివరాలు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుదారులకు తప్పనిసరిగా ఇవ్వాలి. ఆలిండియా సర్వీసుల (విధుల నిర్వహణ) చట్టం -1968 లోని 16వ నిబంధన ప్రకారం ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్., ఐ.ఎఫ్.ఎస్ అధికారులు తమ స్థిరాస్తుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలి. ఆస్తి వివరాల గురించి సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వాల్సిందేనని కేంద్ర సమాచార కమిషన్ తీర్పు చెప్పింది. ఆర్టీఐ చ‌ట్టం వ‌ల్ల అవినీతి, అక్ర‌మార్కులకు చెంప‌పెట్టు లాంటిది. ఈ చ‌ట్టం ఇండియాలో చారిత్రాత్మ‌కంగా భావించాలి. ఇది సామాన్యుడికి ద‌క్కిన ఆయుధం..గౌర‌వం కూడా. స‌క్ర‌మ‌మైన రీతిలో ఉప‌యోగించుకుంటే ఎంద‌రికో మేలు క‌లుగుతుంది.

Comments

comments

Share this post

scroll to top