అధిక ఫీజు వ‌సూలు చేసినందుకు ఆ స్కూల్‌పై కేసు న‌మోదైంది తెలుసా..?

నేడు మ‌న దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ చ‌దువు పేరిట విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల‌ను ఎలా దోపిడీకి గురి చేస్తున్నాయో అంద‌రికీ తెలిసిందే. విద్యార్థిని స్కూల్‌లో చేర్పించేందుకు అవ‌స‌రం అయ్యే అప్లికేష‌న్ ఫాం మొద‌లుకొని రిజిస్ట్రేష‌న్ ఫీజు, అడ్మిష‌న్ ఫీజు, పుస్త‌కాలు, బ్యాగులు, యూనిఫాం… ఆ ఫీజు, ఈ ఫీజు… అని చెప్పి వేల‌కు వేలు దోచుకుంటున్నాయి. ఇక బాగా బ‌లిసిన కార్పొరేట్ స్కూళ్ల యాజ‌మాన్యాలు అయితే ల‌క్ష‌ల్లోనే ఈ ఫీజుల‌ను వ‌సూలు చేస్తాయి. ఈ క్ర‌మంలోనే అలా వేల‌కు వేలు వ‌సూలు చేస్తున్న హైద‌రాబాద్‌కు చెందిన ఓ కార్పొరేట్ స్కూల్‌పై ఓ ఆర్‌టీఐ యాక్టివిస్టు కేసు పెట్టాడు. అప్లికేష‌న్ ఫాం, రిజిస్ట్రేష‌న్ ఫీజు, అడ్మిష‌న్ ఫీజును ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ఫీజు క‌న్నా ఎక్కువ వ‌సూలు చేస్తుంద‌ని ఆరోపిస్తూ అత‌ను ఆ స్కూల్‌పై కేసు పెట్టాడు. ఇంత‌కీ అత‌ను ఎవ‌రు..? ఆ స్కూల్ ఏదంటే..?

నారాయ‌ణ గ్రూప్ విద్యాసంస్థ‌ల‌కు చెందిన నారాయ‌ణ కాన్సెప్ట్ స్కూల్ హైద‌రాబాద్‌లోని నారాయ‌ణ‌గూడలో ఉంది. ఆ స్కూల్‌లో అప్లికేష‌న్ కోసం రూ.300, అడ్మిష‌న్ కోసం రూ.40వేల ఫీజును వారు వ‌సూలు చేస్తున్నారు. అయితే ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ప్ర‌కార‌మైతే స్కూల్ అప్లికేష‌న్ ఫీజు రూ.100, రిజిస్ట్రేష‌న్ ఫీజు రూ.500, అదే అడ్మిష‌న్ ఫీజు అయితే రూ.5వేల‌కు మించ‌కూడ‌దు. కానీ వారు ముందు చెప్పిన రేటు ప్ర‌కారం వ‌సూలు చేస్తున్న‌ట్టు తెలిసింది. దీంతో ఆర్‌టీఐ యాక్టివిస్టు విజ‌య్ గోపాల్ గ‌త ఫిబ్ర‌వ‌రి నెల‌లోనే స్థానిక నారాయ‌ణ‌గూడ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు ఈ విష‌యం ప‌ట్టించుకోలేదు. ఈ క్ర‌మంలో తాజాగా గోపాల్ మ‌రోసారి ఫిర్యాదు చేయ‌గా, పోలీసులు స‌ద‌రు స్కూల్ యాజ‌మాన్యంపై కేసు న‌మోదు చేశారు.

ఐపీసీ సెక్ష‌న్లు 420, 418 ప్ర‌కారం నారాయ‌ణ కాన్సెప్ట్ స్కూల్‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీని విజ‌య్ గోపాల్‌కు అందించారు. ఈ మేర‌కు విజ‌య్ గోపాల్ ఈ వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డించారు. అయితే ఈ స్కూల్ మాత్ర‌మే కాదు, ఏ స్కూల్ అయినా ఇలా నిర్ణ‌యించిన దాని క‌న్నా అధికంగా ఫీజులు వ‌సూలు చేస్తే అలాంటి స్కూళ్ల‌పై ఫిర్యాదు చేయ‌వ‌చ్చ‌ని అత‌ను చెబుతున్నాడు. అవును మ‌రి. అది నిజ‌మే క‌దా. కానీ ఎంత మంది అలా చేస్తున్నారు..? అలాంటి వారి సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఏది ఏమైనా ప్ర‌భుత్వం ఇందుకోసం ప్ర‌త్యేక‌మైన చ‌ర్య‌లు తీసుకోక‌పోతే అప్పుడు ఇంకా ఇలాంటి దోపిడీ కొన‌సాగుతూనే ఉంటుంది. అయితే ఇక్క‌డ విజ‌య్ గోపాల్ గురించి మ‌నం కొంత చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయ‌న ఆర్‌టీఐ యాక్టివిస్టుగా గ‌తంలో ప‌లు కేసుల‌ను వినియోగ‌దారుల ఫోరంలో గెలిచారు. ఓ రెస్టారెంట్ మిన‌రల్ వాట‌ర్ బాటిల్‌కు రూ.4 ఎక్కువ వ‌సూలు చేసింద‌ని కేసు వేసి ఆ రెస్టారెంట్ రూ.10వేల ఫైన్ క‌ట్టేలా చేశారు. అంతే కాదు, హైద‌రాబాద్‌లోని ఐనాక్స్ మాల్‌లోకి బ‌య‌ట కొన్న ఆహారాన్ని అనుమ‌తించ‌లేద‌ని అత‌ను కేసు వేసి స‌ద‌రు మాల్ యాజ‌మాన్యం చేత ఫైన్ క‌ట్టించాడు కూడా. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న ఇలా స్కూల్‌పై కేసు వేశారు. అయితే తాను ఇంత‌టితో ఆగ‌న‌ని, ఇక ముందు కూడా ఇలా ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాడుతాన‌ని చెబుతున్నారు..!

Comments

comments

Share this post

scroll to top