ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని విన్న‌వించినా అది ప‌ట్టించుకోని పోలీసుల నుంచి రూ.10 ల‌క్ష‌ల జ‌రిమానా వ‌సూలు చేసిన ఆర్‌టీఐ యాక్టివిస్ట్ అరుణ్ సావంత్‌…

బ‌డాబాబులు, రాజ‌కీయ నాయకులు, ప‌లుకుబ‌డి ఉన్న వారు, ఇత‌ర నేత‌లు వ‌గైరా… వ‌గైరా… అలాంటి వారిని సామాన్యులు ఎదిరిస్తే ఏం జ‌రుగుతుంది? చావులు దెబ్బ‌లు తిన‌డ‌మో, ప్రాణాలు కోల్పోవ‌డ‌మో జ‌రుగుతుంది. కొన్ని సంద‌ర్భాల్లో ఎదురెళ్లిన వ్య‌క్తుల‌తోపాటు వారి కుటుంబ స‌భ్యులు, బంధువులు, స్నేహితులు కూడా ఇబ్బందులు ప‌డ‌డం జ‌రుగుతుంది. ఇది మ‌న ద‌గ్గ‌రే కాదు, ప్ర‌పంచంలో ఎక్క‌డికెళ్లినా అంతటా ఇలాగే ఉంటుంది. డ‌బ్బు, ప‌లుకుబ‌డి, అధికారం ఉన్న వారిదే రాజ్యం. వారిదే పెత్త‌నం. ఈ క్ర‌మంలో అలాంటి కొంద‌రు నాయ‌కులకు ఎదురు వెళ్దామ‌ని ప్ర‌య‌త్నించిన ఓ వ్య‌క్తికి పైన చెప్పిన‌ట్టుగా ప్ర‌మాదం రానే వ‌చ్చింది. స‌ద‌రు నాయ‌కుల అనుయాయులు తుపాకుల‌తో దాడి చేసి ఆ వ్య‌క్తిని కాల్చారు. అయినా అదృష్ట‌వ‌శాత్తూ ఆ వ్య‌క్తి ఎలాగో అపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. కాగా ఆ ప్ర‌మాదానికి కార‌ణ‌మైన పోలీస్ శాఖ వారిని మాత్రం ఆ వ్య‌క్తి విడిచి పెట్ట‌లేదు. వారిని కోర్టుకు లాగి రూ.10 ల‌క్షల జ‌రిమానా రాబ‌ట్టాడు. వింటానికి ఆశ్చ‌ర్యంగా ఉందా? పోలీస్ వారిని కోర్టుకు ఈడ్చ‌డ‌మేమిటి? జ‌రిమానా రాబ‌ట్ట‌డ‌మేమిటి? అనుకుంటున్నారా? కానీ, ఇది నిజ‌మేనండీ. ఈ సంఘ‌ట‌న నిజంగానే జ‌రిగింది.

Arun-Sawant

మ‌హారాష్ట్ర‌లో నివ‌సించే 64 ఏళ్ల వృద్ధుడు అరుణ్ సావంత్ ఆర్‌టీఐ (స‌మాచార హ‌క్కు) యాక్టివిస్ట్‌గా గుర్తింపు పొందారు. స‌మాజంలో ప్ర‌భుత్వ శాఖ‌ల ప‌రంగా, అధికారుల ప‌రంగా, రాజ‌కీయ ప్ర‌తినిధులు, నాయ‌కుల ప‌రంగా ఏదైనా అవినీతి, అన్యాయం జ‌రిగిందంటే చాలు స‌మాచార హక్కు చ‌ట్టం ద్వారా స‌మాచారం సేక‌రించి నిజాలు నిగ్గు తేలుస్తూ ముందుకు వెళ్లేవాడు. ఈ క్ర‌మంలో 2010లో అత‌ని ప్రాంతంలో ఉన్న ప‌లువురు నాయ‌కులు, ప్ర‌జా ప్ర‌తినిధుల గురించి ఓ ప‌ని నిమిత్త‌మై కొంత స‌మాచారం కావాల‌ని స్థానిక ఆర్‌టీఐ అధికారుల‌కు ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నాడు. కాగా ఈ ద‌ర‌ఖాస్తు విష‌యం తెలిస్తే స‌ద‌రు నాయ‌కులు త‌న‌పై దాడి చేయించ‌వ‌చ్చ‌నే ఉద్దేశంతో అత‌ను ముందుగానే అప్ర‌మ‌త్త‌మై త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ స్థానిక పోలీసుల‌కు 2010 ఫిబ్ర‌వ‌రిలో విన్న‌వించుకున్నాడు. కానీ ఆ పోలీసులు అరుణ్ సావంత్ మాట‌ల‌ను ల‌క్ష్య పెట్ట‌లేదు. అత‌నికి ఎలాంటి ర‌క్ష‌ణా క‌ల్పించ‌లేదు. దీంతో అరుణ్ అనుకున్న విధంగానే కొంత మంది దుండ‌గులు అత‌నిపై తుపాకీల‌తో కాల్పులు జ‌రిపారు. ఓ ర‌హ‌దారిపై ఒంటరిగా వెళ్తున్న అత‌న్ని అట‌కాయించి కాల్పులు జ‌రిపారు. దీంతో అరుణ్ వెన్నెముక‌కు బుల్లెట్స్ తగిలి తీవ్ర గాయాలై అతని వెన్నెముక దెబ్బ‌తింది. ఈ కార‌ణంగా అత‌నికి ప‌క్ష‌వాతం కూడా వ‌చ్చింది.

అయితే అరుణ్ సావంత్ మాత్రం ఊరుకోలేదు. ఎలాగైనా అక్క‌డి పోలీసుల‌కు బుద్ధి చెప్పాల‌నుకున్నాడు. ఈ క్ర‌మంలో వారిపై కోర్టులో కేసు వేశాడు. ఆర్‌టీఐ ద‌ర‌ఖాస్తు కార‌ణంగా త‌న ప్రాణాల‌కు ప్ర‌మాదం ఉంద‌ని ముందే చెప్పినా పోలీసులు త‌న‌కు ఎలాంటి ర‌క్ష‌ణా క‌ల్పించ‌లేద‌ని, దీంతో దుండ‌గులు దాడి చేసిన‌ప్పుడు త‌న‌కు తీవ్ర‌గాయాలై బాగా న‌ష్ట‌పోయాన‌ని అందుకు గాను త‌గిన ప‌రిహారం ఇప్పించాల‌ని అత‌ను కోర్టుకు విన్న‌వించాడు. దీంతో ఆ రాష్ట్ర హ్యూమ‌న్ రైట్స్ క‌మిష‌న్ కేసును స్వీక‌రించి విచార‌ణ చేప‌ట్టింది. అలా ఆ కేసు దాదాపు 5 ఏళ్ల పాటు కొన‌సాగింది. ఎన్నో వాయిదాల అనంత‌రం ఎట్ట‌కేల‌కు న్యాయ‌మూర్తి ఎస్ఆర్ బ‌న్నూర్‌మ‌త్ అరుణ్ సావంత్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారు. పోలీసుల నిర్ల‌క్ష్యం కారణంగానే ఆ ప్ర‌మాదం జ‌రిగిందని, అందుకు గాను బాధితుడికి జ‌రిగిన న‌ష్టానికి గాను పోలీసు శాఖ వారు అత‌నికి రూ.10 ల‌క్ష‌ల న‌గ‌దును చెల్లించాల‌ని తీర్పు వ‌చ్చింది. మ‌హారాష్ట్ర థానే పోలీస్ సీనియ‌ర్ అధికారి ఒక‌రు అరుణ్ సావంత్‌కు ఇటీవ‌లే రూ.10 ల‌క్ష‌ల చెక్కును అంద‌జేశారు. ప్ర‌జ‌లకు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన పోలీసులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించినందుకు గాను వారికి త‌గిన శాస్తే జ‌రిగింద‌ని స్థానికంగా ఉన్న ప‌లువురు ఈ సంద‌ర్భంగా త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు. నిజ‌మేగా మ‌రి! బ‌డాబాబులు, నేత‌ల‌కు వ‌త్తాసు ప‌లికే పోలీసులు ఉన్నంత కాలం సామాన్య ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ ఎక్క‌డి నుంచి వ‌స్తుంది. నిజంగా అరుణ్ సావంత్ చేసింది మాత్రం నూటికి నూరుపాళ్లు క‌రెక్ట్‌! అంతే క‌దా!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top