గ‌ర్భిణీ మ‌హిళ‌ను, ఆమె కడుపులోని శిశువును తెలివిగా కాపాడిన బ‌స్సు డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్‌ల‌కు హ్యాట్సాఫ్‌..!

కొన్ని కొన్ని సంఘ‌ట‌న‌లు మ‌న‌కు చెప్పి జ‌ర‌గ‌వు. అక‌స్మాత్తుగానే జ‌రుగుతాయి. వాటి వ‌ల్ల ఒక్కోసారి మ‌న‌కు ప్ర‌మాదం వాటిల్లే అవ‌కాశం కూడా ఉంటుంది. ఈ క్ర‌మంలో అలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు ఎంత త్వ‌ర‌గా స్పందించి చాక‌చ‌క్యంగా ప్ర‌వ‌ర్తిస్తే అంత త్వ‌ర‌గా వాటి నుంచి క‌లిగే ప్ర‌మాదాన్ని కూడా త‌ప్పించుకోవ‌చ్చు. త‌మిళ‌నాడులో అక్క‌డి ఆర్‌టీసీకి చెందిన ఓ యువ బ‌స్ డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్‌లు కూడా సరిగ్గా ఇలాగే చేశారు. అనుకోకుండా త‌మ‌కు ఎదురైన విపత్క‌ర ప‌రిస్థితిలో తెలివిగా ఆలోచించ‌డ‌మే కాదు, రెండు నిండు ప్రాణాల‌ను కూడా కాపాడారు. ఇటీవ‌లే ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

చెన్నై శివారు ప్రాంతం నుంచి స్థానిక ఆర్‌టీసీ బ‌స్సు ఒక‌టి బ‌య‌ల్దేరింది. అది తంబ‌రం నుంచి కాంచీపురం వెళ్లాల్సి ఉంది. కాగా మార్గ‌మ‌ధ్య‌లో పాడ‌ప్పై అనే గ్రామం దాట‌గానే బ‌స్సులో ఉన్న ఓ గ‌ర్భిణీ మ‌హిళ‌కు అనుకోకుండా పురిటి నొప్పులు ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో బ‌స్సులో ఉన్న తోటి ప్ర‌యాణికుల‌కు ఏం చేయాలో పాలు పోలేదు. అక్క‌డ బ‌స్సు ఆపు చేద్దాం అంటే కాంచీపురం వెళ్లే వ‌ర‌కు ఎలాంటి ఆసుప‌త్రి కూడా లేదు. అయితే అప్పుడే ఆ బ‌స్సు కండ‌క్ట‌ర్‌, డ్రైవ‌ర్‌లు తెలివిగా ఓ నిర్ణయం తీసుకున్నారు.

rtc-bus-chennai

సాధార‌ణంగా అయితే ఆ బ‌స్సు గ‌మ్య‌స్థానం చేరాలంటే ఎంత లేద‌న్నా మ‌రో 80 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది. కానీ బ‌స్సు డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్ మాత్రం ఆ బ‌స్సును ఎక్క‌డా ఆప‌కుండా వీలైనంత త‌క్కువ స‌మ‌యంలో కాంచీపురం వెళ్లి అక్క‌డ ఆ గ‌ర్భిణీ మ‌హిళ‌కు హాస్పిట‌ల్‌లో చికిత్స అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో వారు బ‌స్సును స్టాపుల్లో కాకుండా వాటికి 200 మీట‌ర్ల దూరంగా బ‌స్సును ఆప‌డం ప్రారంభించారు. దీని వ‌ల్ల బ‌స్సులో ఉన్న ప్ర‌యాణికుల దిగుతారే కానీ కొత్త‌గా ఎవ‌రూ ఎక్క‌రు. వారు అనుకున్న‌ట్టుగానే అంతా జ‌రిగింది. అయితే బ‌స్సు కాంచీపురం చేరుకునేలోపే అక్క‌డి స్టాపు వ‌ద్ద 108 ఆంబులెన్స్‌ను రెడీగా ఉంచాల‌ని కండ‌క్ట‌ర్ ఫోన్ చేసి స‌మాచారం అందించాడు. దీంతో బ‌స్సు కేవ‌లం 40 నిమిషాల వ్య‌వ‌ధిలోనే కాంచీపురం చేరింది. అక్క‌డ రెడీగా ఉన్న ఆంబులెన్స్‌లో స‌ద‌రు గ‌ర్భిణీ మ‌హిళ‌ను త‌ర‌లించారు. ఇలా ఆ బ‌స్సు డ్రైవర్, కండ‌క్ట‌ర్‌లు రెండు నిండు ప్రాణాలను కాపాడారు. ప్ర‌ధానంగా డ్రైవ‌ర్ ఆ బస్సును ఓ ఆంబులెన్స్‌లా భావించి అత్యంత వేగంగా (దాదాపు గంట‌కు 90 కిలోమీట‌ర్ల వేగంతో) న‌డ‌ప‌డం విశేషం. ఈ క్ర‌మంలో అత‌ను ప్ర‌యాణికులు దిగే సంద‌ర్భంలోనూ కేవ‌లం 10 సెకండ్ల పాటే బ‌స్సును ఆప‌డం గ‌మ‌నార్హం కాగా, స్టాపు రాక ముందే దిగాల్సిన ప్ర‌యాణికుల‌ను బ‌స్సు త‌లుపు వ‌ద్ద నిల‌బ‌డాల‌ని కండ‌క్ట‌ర్ ముందుగానే అప్ర‌మ‌త్తం చేయ‌డం మ‌రో విశేషంగా చెప్పుకోవ‌చ్చు. అలా ఆ బ‌స్సు డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్‌లు ఎంతో తెలివిగా వ్య‌వ‌హరించి ఓ గ‌ర్భిణీ మ‌హిళ‌ను, ఆమె క‌డుపులో పెరిగిన శిశువును కాపాడ‌డం పట్ల ప్ర‌యాణికులే కాదు, హాస్పిట‌ల్ వైద్యులు కూడా వారిని అభినందించారు.

Comments

comments

Share this post

scroll to top