కార్పొరేట్ కాలేజీలా మజాకా..! అవును మరి, టెన్త్‌లో మెరిట్ వచ్చిన విద్యార్థులను కొనేస్తారు. అందుకు ఎంతగైనా తెగిస్తారు. ఇక వాళ్లకు ర్యాంకులు రాగానే అదేదో తమ కాలేజీ పుణ్యమే అని ప్రకటనల్లో ఊదరగొట్టేస్తారు. ఇప్పుడు ఆ కాలేజీలు అనుసరిస్తున్న నయా ట్రెండ్ ఇదే. ఇటీవలే కృష్ణాజిల్లా గుడివాడలో ఓ విద్యాసంస్థలో చదువుతున్న టెన్త్ విద్యార్థినిని ఇంకా ఫలితాలు రాక ముందే తమ కాలేజీలో చేరాలంటే తమ కాలేజీలో చేరాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థలు వేట సాగించాయి. దీంతో ఓ దశలో సదరు విద్యార్థినిని ఓ కాలేజీ రూ.2 కోట్లు ఇచ్చి తమ కాలేజీలో చేర్పించునేందుకు సిద్ధం కాగా ఆ విషయం తెలుసుకున్న మరో కాలేజీ ఏకంగా రూ.2.50 కోట్లను ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు ఇచ్చి తమ కాలేజీలో చేర్పించుకునేందుకు డీల్ కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇలాంటిదే మరో ఘటన కూడా జరిగింది.
రాయలసీమలో మరో టెన్త్ విద్యార్థిని ఓ కాలేజీ కొనుగోలు చేసింది. అందుకు గాను అతని తల్లిదండ్రులకు రెండు బంగారు బిస్కెట్లను ఓ కార్పొరేట్ కాలేజీ ఇచ్చినట్లు తెలిసింది. టెన్త్ ఫలితాలు రాకున్నా మెరిట్ విద్యార్థులు అని తెలుసుకున్న ఆ రెండు కార్పొరేట్ కాలేజీలు ఇలా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టెన్త్ విద్యార్థుల కోసం గాలిస్తున్నాయి. ఇలా ఆ కాలేజీలు వేట సాగించడం వెనుక ఉన్న అసలు విషయం ఒక్కటే. వారు ఎలాగూ మెరిట్ విద్యార్థులే కనుక కొంచెం శ్రమిస్తే మంచి ర్యాంకులు వస్తాయి. దీంతో వారి ర్యాంకులను అడ్డం పెట్టుకుని తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఫీజులను వసూలు చేయవచ్చు. ఇదీ.. ఆ రెండు కార్పొరేట్ కాలేజీల అసలు వ్యూహం.
ఇప్పటి దాకా నిజానికి ఆ రెండు కార్పొరేట్ కాలేజీలు కలసి మెలసి ఉన్నాయి. విద్యా వ్యాపారాన్ని బాగానే చేసుకున్నాయి. కలసి ఉంటే కలదు సుఖం అన్నట్లుగా నువ్వంత తీసుకో, నేనింత వసూలు చేస్తా అన్నట్లుగా ఇంటర్ ఫీజులను వసూలు చేస్తూ వచ్చాయి. కానీ ఎంతైనా వ్యాపారం వ్యాపారమే కదా. కనుక కలహాలు వచ్చాయి. ఇప్పుడా రెండు కార్పొరేట్ విద్యా సంస్థలు విడిపోయాయి. దీంతో ఎవరి దారి వారు చూసుకున్నారు. పోటా పోటీగా మెరిట్ విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. వారి కోసం ఎంత డబ్బు వెచ్చించైనా సరే కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆ రెండు విద్యాంసంస్థలు అనుసరిస్తున్న తీరు ఇప్పుడందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
పదో తరగతి పరీక్షలు ఈ మధ్యే పూర్తయ్యాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టెన్త్ రాసిన మెరిట్ విద్యార్థుల కోసం ఆ రెండు విద్యాసంస్థలు వేట ప్రారంభించాయి. ఆ విద్యా సంస్థలకు చెందిన ప్రతినిధులు ఇప్పుడు గ్రామాలు, పట్టణాలు, నగరాలు అని లేకుండా అంతటా తిరుగుతున్నారు. మెరిట్ విద్యార్థులు ఉన్నారని తెలిస్తే చాలు, వారికి ఎంతైనా ఇచ్చి తమ కాలేజీలో చేరాలని ముందే అగ్రిమెంట్ తీసుకుంటున్నారు. అందుకు గాను మొత్తం సొమ్ములో ముందే కొంత సొమ్మును అడ్వాన్స్‌గా కూడా ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో డబ్బుకు ఆశ పడే తల్లిదండ్రులు తమ పిల్లలను కార్పొరేట్ విద్యాసంస్థల ఉచ్చులో బిగిస్తున్నారు. ఇక వారికి వచ్చే ర్యాంకులను చూపించి మళ్లీ అలాంటి తల్లిదండ్రుల వద్ద నుంచే పెద్ద ఎత్తున ఇంటర్ ఫీజులను వసూలు చేయాలని ఆ కార్పొరేట్ విద్యాసంస్థలు చూస్తున్నాయి. ఇదే వారి అసలు ఎత్తుగడ.
టెన్త్ ఫలితాలు రాకముందే మెరిట్ విద్యార్థులను కొనుగోలు చేసే సదరు రెండు విద్యాసంస్థల ప్రతినిధులు రెడ్ హ్యాండెడ్‌గా దొరుకుతున్నారు. వీరి బాగోతాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ సంగతి అటుంచితే.. మరో వైపు ఈ సారి తల్లిదండ్రుల నుంచి భారీ ఎత్తున ఇంటర్ విద్యకు ఫీజులను వసూలు చేయాలని ఆ రెండు కార్పొరేట్ విద్యాసంస్థలు ఇప్పటికే నడుం బిగించాయట. ఎంసెట్, ఐఐటీ కోచింగ్, ఏసీ గదులు.. వంటి అనేక సదుపాయాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఆశలు చూపిస్తూ లక్షల్లో ఇంటర్ ఫీజులను వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది కన్నా ఈ సారి రెండు రెట్లు ఎక్కువ ఫీజులను వసూలు చేయనున్నారట.
గత ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం ఫీజు రూ.1 లక్ష ఉండగా ఈ సారి దాన్ని రూ.1.50 లక్షలకు పెంచారు. అలాగే ఇంటర్ రెండో సంవత్సరం ఫీజును రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచారు. ఇక ఏసీ, ఐఐటీ వంటివి కావాలనుకుంటే అందుకు రూ.2.50 లక్షల వరకు ఫీజును వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంత తంతు జరుగుతున్నా కార్పొరేట్ కాలేజీల్లో ఫీజుల గురించి పట్టించుకునే నేతలు, సంబంధిత అధికారులు కరువయ్యారు. ఓ వైపు కాలేజీలు గద్దల్లా మారి ఫీజుల కోసం తల్లిదండ్రులను పీక్కు తింటుంటే మరో వైపు విద్యాశాఖ మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. సరే.. ఆ స్థాయిలో ఫీజులను వసూలు చేసినప్పుడు కనీసం అదే స్థాయిలో సదుపాయాలను కల్పిస్తున్నారా.. అంటే.. ఉహు.. అదీ లేదు. ఒక్కో రూంలో 10 నుంచి 15 మందిని కుక్కుతున్నారు. టాయిలెట్లు, తాగునీరు సరిపడా ఉండదు. దీంతో విద్యార్థులకు నానా రకాల అనారోగ్యాలు వస్తున్నాయి. ఇక ఇలాంటి వాతావరణంలో చదివే విద్యార్థులు కుంగుబాటుకు లోనై వారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏది ఏమైనా ఈ విషయంపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిందే. చదువుకోవాల్సిన పరిస్థితి నుంచి చదువుకొనాల్సిన పరిస్థితి వచ్చినందుకు నేతలు, అధికారులు సిగ్గుపడాల్సిందే. వారు మారనంత కాలం కార్పొరేట్ కాలేజీల ఆగడాలు ఇలా కొనసాగుతూనే ఉంటాయి. ఏం చేస్తాం.. అంతా మన ఖర్మ కాకపోతే..!