హెచ్ఐవీ… ఎయిడ్స్… ఒకరి నుంచి మరొకరికి లైంగిక సంబంధాలు, సిరంజిల వాడకం ద్వారా వ్యాపించే వ్యాధి. ఒకసారి ఎయిడ్స్ వచ్చిందంటే ఇక దాన్ని తగ్గించడం సాధ్యం కాదు. అలాంటి వారు జీవితాంతం మందులు వాడాల్సిందే. ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. అందుకు అనుగుణంగా పలు జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. అయితే మీకు తెలుసా..? మన దేశంలో మొదటి సారిగా ఎయిడ్స్ వ్యాధిని ఎవరు గుర్తించారో..? ఆమె ఓ మహిళ… ఆమె పేరు డాక్టర్ సునితి సోలోమాన్. గత 30 సంవత్సరాల క్రిందట మొదటి సారిగా మన దేశంలో ఈమె ఎయిడ్స్ పరీక్షలు చేసి పాజిటివ్ కేసులను గుర్తించారు.
డాక్టర్ సునితి సోలోమాన్ది మహారాష్ట్ర. చికాగోలోని కుక్ కౌంటీ హాస్పిటల్లో అప్పట్లో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించారు. అనంతరం మద్రాస్ మెడికల్ కాలేజీలో పీజీ చేశారు. అప్పుడు ఆమె తీసుకున్న సబ్జెక్టు మైక్రో బయాలజీ. ఆ తరువాత అదే కాలేజీలో మైక్రో బయాలజీ ప్రొఫెసర్‌గా చేరారు. ఈ క్రమంలోనే ఆమె తమిళనాడులోని ఓ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన డాక్టర్ సోలోమాన్ విక్టర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఆమె ఇలాంటి సాహసం చేశారంటే ఆమెకు ధైర్యం ఎంత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే 1986లో అంటే గత 30 ఏళ్ల కిందట మన దేశంలో హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ బాగా వ్యాపిస్తుందనే వార్త ఒకటి సంచలనం సృష్టించింది. దీంతో డాక్టర్ సునితి ఆ దిశగా తన రీసెర్చ్ చేపట్టింది. 100 మంది సెక్స్ వర్కర్లకు చెందిన బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించి సొంతంగా పరీక్షలు చేసింది. ఈ క్రమంలో ఆ 100 మందిలో మొత్తం ఆరుగురికి హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. ఆ 6 మందిలో 13 ఏళ్ల బాలిక ఉండడం కూడా గమనార్హం. ఆమెను బలవంతంగా వేశ్యావృత్తిలో దింపడంతో అలా ఎయిడ్స్ సోకింది. అలా డాక్టర్ సునితి మన దేశంలో ఎయిడ్స్‌ను గుర్తించిన తొలి డాక్టర్‌గా పేరు గాంచింది.
అయితే డాక్టర్ సునితి అంతటితో ఆగలేదు. ఎయిడ్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అదే కాలేజీలో తన తండ్రి జ్ఞాపకార్థం వైఆర్ గైటొండె సెంటర్ ఫర్ ఎయిడ్స్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ను ఏర్పాటు చేసింది. దాని ద్వారా ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించింది. వారికి మందులు ఇవ్వడం, సలహాలు, సూచనలు తెలియజేయడం, చికిత్సం చేయడం చేసేది. అయితే అందుకు ఆమె ఎలాంటి ఫీజు తీసుకునేది కాదు. తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా ఆమె అలా అందరికీ సహాయం చేసేది. అనంతరం ఆమె ఎయిడ్స్‌పై ఇంకా విస్తృత ప్రచారం నిర్వహించేందుకు గాను అప్పట్లో కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. ఈ క్రమంలోనే ఎయిడ్స్‌పై ప్రచారం నిర్వహించే పలు బోర్డుల్లో ఆమె సభ్యురాలిగా చేరింది. కాగా ఆమె నెలకొల్పిన వైఆర్ గైటొండె సెంటర్ ద్వారా కొన్ని వేల మంది ఎయిడ్స్ రోగులకు సేవలందించింది. దీంతో ఆమెకు పలు అవార్డులు, రివార్డులు కూడా లభించాయి. 2012లో ఆమెకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది. 2015, జూలై 28న ఆమె మృతి చెందారు. అయినా… ఎయిడ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఆమె రూపొందించిన గైడ్‌లైన్స్‌ను ఇప్పటికీ ప్రభుత్వాలు పాటిస్తున్నాయంటే ఆమె ప్రతిభ ఎలాంటిదో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎంతో మంది ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసిన డాక్టర్ సునితి కి నిజంగా మనం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!