రోడ్డు ప్రమాదంలో మరణించిన “అనన్య” కేసులో షాకింగ్ నిజాలు..! ప్రమాదానికి కారణాలివే.!

నేటి త‌రుణంలో రోడ్డు ప్ర‌మాదాలు అనేవి ఎక్కువైపోయాయి. మ‌న‌కు రోజూ ఎక్క‌డో ఒక చోట దారుణ రోడ్డు ప్ర‌మాదానికి సంబంధించిన వార్త తెలుస్తూనే ఉంది. ఇక హైదరాబాద్ న‌గ‌రంలో అయితే ఇవి స‌ర్వ సాధార‌ణం అయిపోయాయి. అయితే రోడ్డు ప్ర‌మాదాల్లో అధిక శాతం మ‌ద్యం మ‌త్తులో జ‌రిగిన‌వే అవుతుండ‌డం గ‌మ‌నార్హం. పీకల దాకా మ‌ద్యం సేవించి అర్థ‌రాత్రి వాహ‌నాల‌ను నిర్ల‌క్ష్యంగా న‌డ‌ప‌డం వ‌ల్లే ఎక్కువ‌గా ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. తాజాగా గోల్కొండ జంక్ష‌న్ వ‌ద్ద ఓఆర్ఆర్‌పై జ‌రిగిన ప్ర‌మాదం కూడా ఇదే కోవకు చెందుతుంది.

గ‌చ్చిబౌలిలోని హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో అన‌న్య (21) అనే విద్యార్థిని పీజీ చ‌దువుతుండ‌గా ఆమెకు నేపాల్‌కు చెందిన నిఖిత స్నేహితురాలు. అయితే నిఖిత‌కు జ‌తిన్ అనే మ‌రో ఫ్రెండ్ ఉండేవాడు. అత‌ను జోధ్‌పూర్ వాసి. గ‌చ్చిబౌలిలోని ఓ కంపెనీలో ట్యాక్స్ క‌న్స‌ల్టెంట్‌గా ప‌నిచేస్తున్నాడు. అయితే ఈ నెల 9వ తేదీన మంగ‌ళ‌వారం జ‌తిన్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ముగ్గురూ పార్టీ చేసుకుందామ‌నుకున్నారు. దీంతో వారు అర్ధ‌రాత్రి వ‌ర‌కు ఆగి కారులోనే కేక్‌ను క‌ట్ చేశారు. అప్ప‌టికే జ‌తిన్ బాగా మ‌ద్యం సేవించాడు. అనంత‌రం 2 గంట‌ల స‌మ‌యంలో వారు భోజ‌నం చేద్దామ‌ని నిర్ణ‌యించుకుని హైదరాబాద్‌, బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న డాబా వద్దకు వెళ్లాలనుకున్నారు. అందులో భాగంగానే వారు కారులో న‌గ‌రంలో చాలా సేపు తిరిగారు. ఎట్ట‌కేల‌కు ఓఆర్ఆర్ ఎక్కారు.

అలా కారులో ప్ర‌యాణిస్తున్న జ‌తిన్‌, అన‌న్య‌, నిఖిత‌లు ఔటర్‌ రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్‌ దిశగా వెళ్లారు. కానీ చీకట్లో అయోమయానికి గుర‌య్యారు. దీంతో వారు గోల్కొండ జంక్షన్‌ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కిందకు దిగారు. తర్వాత పీ1 రహదారిపై వస్తుండగా 3.20 గంటల ప్రాంతంలో బూర్జుగడ్డ తండా మలుపు వద్ద కారు అదుపుతప్పింది. దీంతో కారుతో వారు డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ క్ర‌మంలో కారు బోల్తా ప‌డి ముగ్గురికీ తీవ్ర గాయాల‌య్యాయి.

కాగా తెల్ల‌వారు జామున 4.30 గంట‌ల ప్రాంతంలో జ‌తిన్‌, అన‌న్య‌, నిఖిత‌ల‌ను పోలీసులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే అన‌న్య మృతి చెందింది. ఆమె సీట్ బెల్ట్ ధ‌రించ‌క‌పోవ‌డం వ‌ల్లే తీవ్ర‌గాయాల‌కు గురై చ‌నిపోయిన‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు. ఇక మిగిలిన ఇద్ద‌రూ ప్ర‌స్తుతం హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ప్ర‌మాదం జ‌రిగిన త‌రువాత గంట సేప‌టి వ‌ర‌కు వారిని ఎవ‌రూ గుర్తించ‌లేదు. అలా చాలా సేపు వారు ర‌క్తపు మ‌డుగులోనే ఉన్నారు. స‌కాలంలో స్పందించి ఉంటే అన‌న్య కూడా బ‌తికేద‌ని పోలీసులు అంటున్నారు. ఇక ప్ర‌మాదం సమయంలో కారు వేగం దాదాపు 120 కిలో మీటర్లకు పైగా ఉండవచ్చునని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కారులో పగిలిన మద్యం సీసాలు ఉన్నాయి. దీంతో జతిన్ మద్యం తాగి కారు నడిపి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అతని రక్తనమూనాలను సేకరించారు. మద్యం మత్తు, అతివేగం కారణంగా ర‌హ‌దారిని స‌రిగ్గా గుర్తించకపోవడం వల్లే ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంద‌ని పోలీసులు అంచ‌నా వేస్తున్నారు. ఏది ఏమైనా.. ఇలా ఎవ‌రూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ప్రాణాల‌ను తీసుకోకండి..!

Comments

comments

Share this post

scroll to top