ఎంతో మంది జీవితాల‌ను తీర్చిదిద్దిన టీచ‌ర్ ను బెగ్గ‌ర్ గా మార్చిన ఫ్యామిలీ మెంబ‌ర్స్.!

ఆ వృద్ధురాలి దుస్తులు బాగా మాసిపోయాయి.. జుట్టు అస్త‌వ్య‌స్తంగా మారింది.. పాపం తిని ఎన్ని రోజులు అవుతుందో ఆ తల్లికి బాగా ఆక‌లి వేసింది. దీంతో రోడ్డు ప‌క్క‌న ప‌డేసిన విస్త‌రిలోని ఆహారాన్ని ముద్ద ముద్ద‌గా చేసుకుని తింటోంది. అప్పుడే అటు నుంచి ఓ మ‌హిళ వ‌చ్చింది. అత్యంత దీన స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని చూసింది. జాలితో ఆమె హృద‌యం త‌పించిపోయింది. వెంటనే పక్కనే ఉన్న ఓ టిఫిన్ సెంట‌ర్‌లో ఇడ్లీ, వ‌డ కొని ఆ వృద్ధురాలికి పెట్టి ఆక‌లి తీర్చింది. చెప్ప‌డానికే చాలా హృద‌య విదార‌కంగా ఉన్న ఈ ఘ‌ట‌న సినిమాలో సీన్ కాదు, నిజంగా జ‌రిగిందే. ఆ వృద్ధురాలు నిజానికి యాచ‌కురాలు కాదు, సొంత కుటుంబ స‌భ్యులే ఆమెను వ‌దిలించుకున్నారు. దీంతో ఆమెకు బిచ్చ‌మెత్తుకోవడం త‌ప్ప‌లేదు.

ఆమె పేరు వ‌ల్స‌. కేర‌ళ‌లో మ‌ళ‌ప్పురం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఉపాధ్యాయురాలిగా ప‌నిచేసి రిటైర్ అయింది. ఆమెకు కొడుకు కూడా ఉన్నాడు. అయితే వ‌ల్స ఎప్పుడైతే ఉపాధ్యాయ ఉద్యోగం నుంచి రిటైర్ అయిందో అప్పుడే ఆమెకు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. కుటుంబ స‌భ్యులు ఆమెను త‌మ‌కు భారంగా భావించారు. సొంత కొడుకు కూడా క‌న్న త‌ల్లి అని ఆలోచించ‌లేదు. దీంతో వారు ఆమెను వ‌దిలించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె రోడ్ల‌పై అత్యంత దీన స్థితిలో జీవిస్తోంది.

అయితే ఆమెను ఆ స్థితిలో విద్య అనే మహిళ ఈ నెల 5వ తేదీన థంపనూర్ రైల్వే స్టేష‌న్ వ‌ద్ద చూసింది. దీంతో విద్య వ‌ల్స‌కు టిఫిన్ పెట్టించింది. అంత‌టితో విద్య ఆగలేదు. ఆమె ఎవ‌రో ఆమెనే అడిగి తెలుసుకుంది. దీంతో ఆమె గురించిన వివరాల‌ను విద్య ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయ‌గా, ఆ స్కూల్‌లో ఒక‌ప్పుడు చ‌దువుకున్న విద్యార్థులు త‌మ వ‌ల్స మ్యాథ్స్‌ టీచ‌ర్‌ను గుర్తుప‌ట్టి ముందుకు వ‌చ్చారు. వారు ఆమెకు స‌హాయం చేస్తామ‌న్నారు. అయితే ఆమె ఆ స‌హాయాన్ని తిరస్క‌రించింది. ఎందుకంటే తన‌కు త‌న వాళ్ల ద‌గ్గ‌రే ఉండాల‌ని ఉంద‌ట‌. అయినా.. పిచ్చి త‌ల్లీ.. నువ్వే వ‌ద్ద‌నుకుని నిన్ను నీ కుటుంబ స‌భ్యులు వ‌దిలిపెడితే మ‌ళ్లీ వారి వ‌ద్ద‌కు వెళ్తానంటావేంటి..? చ‌క్కగా నీ విద్యార్థుల స‌హాయం పొందు. లేదంటే.. మ‌ళ్లీ నీకు ఇదే స్థితి వ‌స్తుంది. అస‌లే మాన‌వ‌త్వం మంట‌గ‌లుస్తున్న రోజులివి. సొంత కుటుంబ స‌భ్యుల‌నే క‌సాయిల్లా చంపుకుంటున్నారు. క‌నుక అలాంటి మూర్ఖుల మ‌ధ్య‌కు మ‌ళ్లీ వెళ్ల‌కు..!

 

Comments

comments

Share this post

scroll to top