రెండు వాటర్ బాటిల్స్‌కు అతను రూ.312 చెల్లించాడు… అన్యాయంగా ఎక్కువ ధర వేసినందుకు రెస్టారెంట్ నుంచి రూ.12వేల జరిమానా రాబట్టాడు…

సాధారణంగా ఎవరైనా ఒక వాటర్ బాటిల్ కొంటే ఎంత డబ్బు చెల్లిస్తారు? అసలు వాటర్ బాటిల్ మాత్రమే కాదు, ఏ వస్తువు కొన్నా ఎంత ధర చెల్లిస్తారు? ఆ వస్తువు మీద ఉండే రిటైయిల్ ధర ప్రకారమే ఎవరైనా డబ్బు చెల్లిస్తారు. అయితే ఆ రిటెయిల్ ధర కన్నా కొంచెం తక్కువగానే ఒక్కోసారి వ్యాపారులు మనకు వస్తువులను అమ్ముతారు. అయితే ఇది మనం ఆడే బేరాన్ని బట్టి, ఆ వస్తువును బట్టి ఉంటుంది. కానీ రిటైయిల్ ధర కన్నా ఎక్కువగా డబ్బులు చెల్లిస్తే? అప్పుడు మనం మోసపోయినట్టే లెక్క. అయితే ఇలా ఎక్కువ ధర చెల్లించినందుకు మాత్రం ఓ వ్యక్తి బాధపడలేదు. కేవలం 2 వాటర్ బాటిల్స్‌కే ఓ రెస్టారెంట్‌కు రూ.312 చెల్లించాడు. కానీ అందుకు ఆ రెస్టారెంట్ మూల్యం చెల్లించుకునేలా చేశాడు. తన దగ్గర అసలైన ధర కన్నా ఎక్కువ వసూలు చేసినందుకు గాను రెస్టారెంట్ యజమానులపై కేస్ వేసి వారి నుంచి జరిమానా రాబట్టాడు.
restaurant-fine
పంజాబ్ రాష్ట్రం లూథియానాకు చెందిన జగ్‌వీర్ సింగ్ కాంగ్ డిన్నర్ నిమిత్తం తన భార్య, స్నేహితులతో కలిసి గత ఏడాది జూన్‌లో స్థానికంగా చండీగఢ్‌లో ఉన్న బ్రూక్లిన్ సెంట్రల్ అనే ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అయితే అక్కడ డిన్నర్ ముగించుకుని బిల్ అంతా కట్టేశాక, జగ్‌వీర్ సింగ్ రెండు వాటర్ బాటిల్స్ తీసుకున్నాడు. ఒక్కో వాటర్ బాటిల్ ధర రూ.60. రెండు బాటిల్స్‌కు కలిపి రూ.120 అవుతుంది. కానీ సదరు రెస్టారెంట్ వారు ఒక్కో బాటిల్‌కి రూ.156గా పేర్కొంటూ అతనికి రూ.312 బిల్ వేశారు. దీంతో ఆశ్చర్యపోయిన జగ్‌వీర్ సింగ్ బిల్ అంతగా ఎందుకు అయిందని రెస్టారెంట్ నిర్వాహకులను ప్రశ్నించాడు. కాగా వారు వ్యాట్, సర్వీస్ చార్జ్, సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి అతని వద్ద నుంచి బిల్ వసూలు చేశారు.
అయితే జగ్‌వీర్ సింగ్ దీన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. కేవలం 2 వాటర్ బాటిల్స్ కొన్నందుకు రూ.120 మాత్రమే అవుతుంది కానీ, అతను ఎక్కువ ధర చెల్లించాల్సి రావడంతో ఎలాగైనా రెస్టారెంట్ ద్వారా జరిమానా రాబట్టాలనుకున్నాడు. ఈ క్రమంలో అతను స్థానికంగా ఉన్న వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. కాగా విచారణలో భాగంగా సదరు రెస్టారెంట్ యజమానులను ఫోరం ప్రశ్నించగా, వినియోగదారుడు తమ రెస్టారెంట్‌లో కొన్న వాటర్ బాటిల్ నీటిని అక్కడే తాగాడని, అందుకోసం అతనిపై ఛార్జిలు వేయాల్సి వచ్చిందని వారు తెలిపారు. అయితే జగ్‌వీర్ సింగ్ మాత్రం తాము ఆ నీటిని అక్కడ తాగలేదని, ఇంటి వద్ద తాగేందుకు కొన్నామని ఫోరంకు వివరించాడు. కాగా జగ్‌వీర్‌సింగ్ రెస్టారెంట్ వద్దే నీరు తాగాడని చెప్పిన రెస్టారెంట్ యజమానులను అందుకు తగిన సాక్ష్యాలను ప్రవేశపెట్టాలని ఫోరం ఆదేశించింది. ఈ క్రమంలో రెస్టారెంట్ వారు ఎలాంటి సాక్ష్యాలు ఫోరంకు ఇవ్వలేదు. దీంతో తీర్పు జగ్‌వీర్‌సింగ్‌కు అనుకూలంగా వచ్చింది.
జగ్‌వీర్ సింగ్‌కు అన్యాయంగా అంతటి బిల్ వేసినందుకు గాను అతనికి ఫోరం కోసం అవసరమైన రూ.5వేల ఖర్చును కలుపుకుని మొత్తం రూ.12వేలను బాధితునికి జరిమానాగా చెల్లించాలని ఫోరం ఆదేశించింది. దీనికి తోడు మరో రూ.15వేలను వినియోగదారుల ఫోరంకు జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. అయితే ఇది జగ్‌వీర్‌సింగ్ సాధించిన విజయమే కాదు, అతనిలా పోరాడే వారిందరిదీ. ఎందుకంటే బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిహా హాల్స్ వంటి ప్రదేశాల్లో మనం తరచూ వాటర్ బాటిల్స్, తినుబండారాలు వంటివి కొంటూనే ఉంటాం. అక్కడ పైన చెప్పినట్టుగానే అధిక ధరలకు ఆయా వస్తువులను విక్రయిస్తుంటారు. కానీ మనం ఎవరం పట్టించుకోం. వారు అడిగినంత ధర చెల్లించి వస్తువులను కొనుగోలు చేస్తాం. అయితే ఇక ముందైనా అలా చేయకుండా వస్తువుపై ఎంత ధర ఉందో అంత వరకు మాత్రమే చెల్లించేందుకు మనమందరం ప్రయత్నించాలి. లేదంటే జగ్‌వీర్‌సింగ్ లా వినియోగదారుల ఫోరంకు వెళ్లి అయినా వ్యాపారుల మోసాలకు చెక్ పెట్టేలా ముందుకు సాగాలి. అంతేకానీ ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును అలా అన్యాయంగా మాత్రం చెల్లించకూడదు.

Comments

comments

Share this post

scroll to top