నువ్వెన్నయినా చెప్పు ప్రపంచమంతా కవిత్వంతో నిండి పోయింది. చూస్తే తెలుస్తుంది..చదివితే అర్థమవుతుంది. కవిత్వమొక తీరని దాహం. బతుకంతా కవిత్వమే అయినప్పుడు ..ప్రతి అక్షరం ఉప్పెనవుతుంది..ప్రతి పదం ప్రేమను ఆవిష్కరిస్తుంది. కవిత్వమంటే బతుకే కదా..కాలాన్ని బంధించడమే కదా..కళ్లనీ..గుండెల్ని పిండేసి ఒక చోటకు చేర్చితే కవిత్వం అవదా..నేను మనిషిని..నాలాగా నేనుండాలని అనుకుంటా. నా కంటూ కాసిన్ని కన్నీళ్లను దోసిళ్లలోకి తీసు కోవాలని ఆరాట పడతా. నన్ను నేను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటా..నాతో నేను మాట్లాడుకుంటా..నవ్వుకుంటా..పిచ్చితనం అనుకో..ప్రేమలో మునిగి పోయానని అనుకో..ఏమైనా అనుకో..కానీ కవిత్వం రాయకుండా..చదవకుండా ..హృదయంలోకి చేర్చుకోకుండా నేనుండ లేను.
నాలోని ప్రతి కదలికా ఓ కవితై పుడుతుంది. కవిత్వంతో కరచాలనం చేస్తే చావొచ్చినా స్వాగతించే భరోసా కలుగుతుంది. అవును మళ్లీ చెబుతున్నా నేనుండ లేను. నేను ఒంటరితనంతో పోట్లాడుతున్నప్పుడు..లోకానికి దూరంగా నేను నేనుగా మిగిలి పోయినప్పుడు..శూన్యం తప్ప నాకేమీ అగుపించలేదు. ఒక్క సూర్య చంద్రులు మాత్రమే. ప్రతి రోజు పలకరించే ఆ సన్నివేశాలు నాలో నిక్షిప్తమై పోయాయి. కెమెరాలో కాన్వాస్ లాగా. ఇదేగా పోయెట్రీ అంటే. ఆ చందస్సులు..ఆ వ్యాకరణాలతో పనేమిటి..? ఎవ్వరైనా రాయొచ్చు..కవిత్వంతో లీనమై పోతే బతుకంత సంబురమే.
ఆనందమే కదూ.. మనిషి నిండా మునిగి పోయినప్పుడు ..కలలు కల్లలైనప్పుడు..ఆశలు ఆవిరై పోయినప్పుడు..నా వాళ్లు అనుకున్న సమయంలో వదిలేసినప్పుడు..అక్షరాలే తోడవుతాయి. చేతికర్రలై ఊపిరి పోస్తాయి. నేనుండలేను..భావాలన్నీ అలలుగా వస్తూనే ఉంటాయి. ఆలోచనలు రెక్కలు తొడిగిన పక్షుల్లా అల్లుకు పోతాయి. మళ్లీ నేను పుడతాను. ఆవేశం ..ఆనందంలో లీనమవుతుంది. ఐడియాకు ప్రాణం తోడవుతుంది..కాగితం మీద వేళ్లు రాయడం మొదలు పెడతాయి. ప్రేమ ఒక్కటే మిగిలిందని..అది లేకపోతే ఈ బతుక్కి అర్థం లేదని..ఈ ప్రపంచం ఇలా ఉండదని.. కవిత్వాన్ని ఆశ్రయిస్తే జీవితమంత సంతోషం.
అందుకే రేణు దేశాయ్ కవిత్వాన్ని ఆశ్రయించారు. ఏదో అలవాటైన రాత..ఏకంగా కవయిత్రిగా మార్చేసింది. చదవడం..రాయడం అలవాటైన వాళ్లకు ఈ లోకమే వాకిలి కదూ. అవును ఆమె ఇండిపెండెంట్ భావాలు కలిగిన వ్యక్తి. అనుకోకుండా రాసినవన్నీ ఇపుడు పుస్తక రూపంలోకి వచ్చేశాయి. వాల్డన్ సంస్థ ప్రచురిస్తోంది. పలు భాషల్లో ఆమె రాసిన – ఏ లవ్ అన్ కండీషనల్ – పుస్తకం అనువాదమైంది. తెలుగులో రాసే అవకాశాన్ని రచయిత అనంత శ్రీరాం దక్కించుకున్నారు. రేణు దేశాయ్ భావాలకు అనుగుణంగా అనువాదం చేశారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. తన కవిత్వానికి మొదటి శ్రోత పవన్ అంటూ ఆమె ఇటీవల వ్యాఖ్యానించారు.
మూడేళ్ల కిందటి నుండి కవిత్వంతో స్నేహం ప్రారంభమైంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చారు. అభిమానులు పెరిగారు. రాస్తున్న కవితలు బాగున్నాయంటూ ..ఇంకా రాయాలంటూ ఫ్యాన్‌ని కోరారు. కవికి, కళాకారులకు కాసుల కంటే ఆత్మ సంతృప్తి ముఖ్యం. దీనిని పాజిటివ్ గా తీసుకున్న రేణు దేశాయ్ రాసుకుంటూ వెళ్లారు. ఆమె స్నేహితురాళ్లు పుస్తకంగా ప్రచురిస్తే బావుంటుందని సలహా ఇచ్చారు. దీంతో పుస్తకంగా తీసుకు వచ్చారు. అనంత్ శ్రీరామ్ తెలుగులో ఆమె రాసిన పుస్తకాన్ని అనువాదం చేశారు. 32 కవితలు ఎంపిక చేసినవి ఉన్నాయి.
ఈ పుస్తకంలో జీవితం ఉంటుంది..కలలకు ప్రతిరూపాలు ఉంటాయని ఆమె ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పటికే 200 పుస్తకాలు ముందుగానే బుక్ అయ్యాయని వెల్లడించారు. తెలుగులో లోకల్ కు చెందిన జేవీ పబ్లికేషన్స్ ప్రచురించారు. జ్యోతి వలబోజు దీనిని నిర్వహిస్తున్నారు. ఆమె వంటలపై రాసిన పుస్తకాలు నచ్చాయి. 295 రూపాయల ధరతో ఇప్పటికే 500 పుస్తకాలు ప్రింట్ చేశారు. తల్లి రాసిన కవితలను టీచర్లు మెచ్చుకున్నారు. అప్పుడే తాను కవిత్వం రాయగలనన్న నమ్మకం ఏర్పడిందంటారు.
విడుదలైన పుస్తకంలోంచి రాసిన కవితలను కోట్ చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తోంది రేణు దేశాయ్. ప్రస్తుతానికి తెలుగులో సినిమా తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నానని ఇదే తన లక్ష్యమంటోంది ఆమె. లోకం వాకిట పూసిన పూలన్నీ కుప్పగా పోస్తే కవిత్వమవుతుంది..గుండెను గదిగా మార్చేస్తుంది. ప్లీజ్ ..రాయకపోయినా చదవండి..కవిత్వమొక అంతులేని ఆనందాన్ని ఇచ్చే గొప్ప సాధనం ..కాదనలేం..ఎందుకంటే లైఫంతా..కవిత్వమేగా..!