చిన్నతనం… 5 సంవత్సరాల వయస్సు.. ఆ వయస్సులో ఉండే పిల్లలు సహజంగానే ఆట పాటలతో సరదాగా గడుపుతారు. తమ ముద్దు మాటలు, అల్లరి చేష్టలతో పెద్దలకు కోపం, విసుగు, ఆశ్చర్యం, ఆనందం తెప్పిస్తారు. సాధారణంగా ఆ వయస్సులో ఉన్న ఏ పిల్లల జీవితమైనా ఇలాగే ఉంటుంది. ఆ వయస్సులో పెద్దలకు ఉండే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు పిల్లలకు ఉండవు. వారికి ఆర్థిక వ్యవహారాలతో సంబంధం ఉండదు, అసలు ఆ అవసరమే రాదు. అలాంటి చిన్న వయస్సులో వారికి ఆ సమస్యలు ఎందుకు చెప్పండి. అందుకే నూటికి 99 శాతం మంది పెద్దలు ఎవరైనా పిల్లలకు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి సమస్యలను కలగనివ్వరు. అందులో తలదూర్చనివ్వరు. ఆ విషయాలను చెప్పరు. కానీ ఆ మహిళ మాత్రం అలా కాదు. 5 సంవత్సరాల వయస్సున్న తన కూతురికి ఇలాంటి సమస్యలను పరిచయం చేస్తోంది. ఇంకా చెప్పాలంటే.. ఆమె తన కూతుర్ని పెంచుతున్నందుకు తన కూతురి నుంచి వారానికి 5 డాలర్లను రెంట్ కింద వసూలు చేస్తోంది. అవును, మీరు విన్నది నిజమే.
ఆమె పేరు ఎస్సెన్స్ ఇవాన్స్. ఉంటున్నది అమెరికాలో. ఈమెకు 5 సంవత్సాల వయస్సు ఉన్న కూతురు ఉంది. అయితే తన కూతుర్ని తాను పెంచుతున్నందుకు ఆమె వద్దే ఎస్సెన్స్ 5 డాలర్ల రెంట్‌ను వారానికి ఒకసారి తీసుకుంటోంది. షాకింగ్‌గా ఉన్నా మేం చెబుతోంది నిజమే. ఎస్సెన్స్ తన కూతుర్ని పెంచుతున్నందుకు గాను ఆమె నుంచి 1 డాలర్ ఇంటి రెంట్‌కు, 1 డాలర్ నీటికి, 1 డాలర్ కరెంట్‌కు, 1 డాలర్ కేబుల్‌కు , 1 డాలర్ ఫుడ్‌కు తీసుకుంటోంది. దీంతో వారానికి మొత్తం 5 డాలర్లను తన 5 ఏళ్ల కూతురి నుంచి రెంట్గా తీసుకుంటోంది.
అయితే ఎస్సెన్స్ ఇలా ఎందుకు చేస్తుందో తెలుసా..? తన కూతురికి చిన్న తనం నుంచే డబ్బు పొదుపుపై అవగాహన కల్పించడం కోసం ఇలా చేస్తుందట. దీంతోపాటు మనం వాస్తవ ప్రపంచంలో పొందే సదుపాయాలకు ఎన్ని బిల్స్ చెల్లిస్తామో, అందుకు ఎంత బర్డన్ ఫీలవుతామో తన కూతురికి చిన్నప్పటి నుంచే చెప్పేందుకు ఆమె ఇలా చేస్తుందట. అయితే ఇది బాగానే ఉంది. కానీ అంత చిన్న పాపకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయని, ఆమె అలా రెంట్ వసూలు చేస్తుంది, అని మీరు అడగవచ్చు. అయితే ఆ పాపకు డబ్బులు వస్తాయి. వారానికి 7 డాలర్లు వస్తాయి. అందులో నుంచే 5 డాలర్లను ఆమె తల్లి ఎస్సెన్స్ తీసుకుంటుంది. ఇక ఆ డబ్బును ఇచ్చేది ఆ పాప తల్లి ఎస్సెన్సే. అవును, ఇది మరీ షాకింగ్ గా లేదూ. ఆమె తన కూతురికి వారానికి 7 డాలర్లు ఇస్తుంది. మళ్లీ అందులో నుంచి 5 డాలర్లను రెంట్ కింద తీసుకుంటుంది. దీంతో ఆ పాపకు వారానికి 2 డాలర్లు సేవ్ అవుతున్నాయి. అయితే ఇలా ఎస్సెన్స్ తాను చేస్తున్న పనిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆమెను కొందరు విమర్శిస్తుంటే మరికొందరు పొగుడుతున్నారు. ఏది ఏమైనా అంత చిన్న వయస్సులో పిల్లలకు ఆర్థిక వ్యవహారాల గురించి పరిచయం చేయాల్సిన పనిలేదనుకోండి. అయినా చేసినా పెద్ద తప్పులేదులే కదా..!