దుర్యోధనుడి భార్యను బలవంతంగా ఎత్తుకొచ్చారు తెలుసా.? ఓ సారి భార్యను కర్ణుడితో చూసి ఏం చేసాడంటే.?

మ‌హాభారతంలో ఉండే దుర్యోధ‌నుడి పాత్ర గురించి చాలా మందికి తెలుసు. ఇత‌ను దుష్ట చ‌తుష్ట‌యంలో ఒకడు. ఎప్పుడూ పాండ‌వులను చంపాల‌ని, రాజ్యం మొత్తం కౌర‌వులే పాలించాలనే దురాశ ఇత‌నిది. అయితే మ‌హాభార‌తంలో దుర్యోధ‌నుడి గురించి చాలా మందికి తెలుసు కానీ.. అత‌ని భార్య భానుమ‌తి గురించి చాలా మందికి తెలియ‌దు. ఆమె గురించిన ప‌లు విష‌యాల‌నే ఇప్పుడు తెలుసుకుందాం.

మహాభారతంలో దుర్యోధనుని భార్య భానుమతి . ఈమె కాంభోజ రాజ్యానికి చెందిన కాశీ రాజు చిత్రాంగదుని కుమార్తె. ఈమె తండ్రి ద్రోణాచార్యుని మిత్రుడు. కాగా ద్రౌపది స్వయంవరానికి వెళ్లిన దుర్యోధనుడు అక్కడ ఓడిపోతాడు. ద్రౌపది దుర్యోధనుడిని చూసి నవ్వుతుంది. అర్జునుడు స్వయంవరంలో నెగ్గుతాడు. దీంతో పాండువులు ద్రౌపదిని గెలుచుకుంటారు. త‌రువాత‌ పాండవులు ఆమెను పెళ్లి చేసుకుంటారు. ద్రౌపది స్వయంవరంలో ఓడిపోయిన దుర్యోధనుడు చాలా రోజులు నిద్రలేకుండా అసూయతో రగిలిపోతాడు. అప్పుడు కాశీరాజు చిత్రాంగదుడు తన కూతురు భానుమతికి స్వయం వరం ఏర్పాటు చేస్తున్నాడని దుర్యోధ‌నుడి మామ శ‌కుని అత‌నికి చెబుతాడు. దీంతో దుర్యోధ‌నునికి కొత్త ఉత్సాహం వ‌స్తుంది. ఈ క్ర‌మంలో తన స్నేహితుడైన‌ కర్ణునితో కలిసి దుర్యోధ‌నుడు ఆ స్వయంవరానికి చేరుకుంటాడు. ఆ స్వయంవరంలో పాల్గొనేందుకు శశిపాలుడు, జరాసంధుడు, రుక్మి వంటి మహామహులెందరో వచ్చి ఉంటారు.

త‌రువాత కొంత సేప‌టికి భానుమ‌తి స్వయంవరం ప్రారంభమవుతుంది. దీంతో ఆమె తన చెలికత్తెలతో కలిసి సభలోకి ప్రవేశిస్తుంది. ఆమె పక్కనున్న చెలికత్తెలు ఒకొక్క రాజకుమారుడి గురించీ వర్ణిస్తూ ఉండగా, వారిని భానుమ‌తి చూస్తూ ముందుకు సాగుతుంటుంది. అయితే అప్ప‌టికే ఆమె క‌ళ్లు దూరంగా ఉన్న క‌ర్ణుడి మీద ప‌డ‌తాయి. ఎలాగైనా అత‌న్నే వ‌రించాల‌ని ఆమె అనుకుంటుంది. కానీ ఈలోగా మ‌ధ్య‌లో దుర్యోధనుడి వంతు వచ్చేసరికి అతణ్ని కూడా చూసీ చూడనట్లుగా ముందుకు సాగిపోతుంది. ఆ చర్యతో దుర్యోధనుడి అహంకారం దెబ్బతింటుంది. ఆ తిరస్కారాన్ని భరించలేకపోతాడు. వెంటనే భానుమతిని అమాంతంగా ఎత్తుకుని హస్తిన వైపు బయల్దేరతాడు.

కాగా దుర్యోధనుడు అలా భానుమ‌తిని తీసుకెళ్తుండ‌గా అత‌డిని అడ్డుకునేందుకు వచ్చిన రాజకుమారులని ఓడించే బాధ్యత కర్ణుడు తీసుకుంటాడు. ఈ క్ర‌మంలో భానుమతిని వారు బలవంతంగా హస్తినకు తీసుకువ‌స్తారు. త‌రువాత దుర్యోధ‌నుడు అక్కడ ఆమెను వివాహం చేసుకుంటాడు. ఇదేమిటంటూ ప్రశ్నించినవారిని ఒకప్పుడు తాత భీష్ముడు కూడా కాశీ రాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను ఇలాగే ఎత్తుకువచ్చాడు కదా అని నోరుమూయిస్తాడు. ఆ క‌థ అక్క‌డితో ముగుస్తుంది.

అయితే ఒక సారి క‌ర్ణుడు, దుర్యోధ‌నుడి భార్య భానుమ‌తి ఆమె మందిరంలో పాచిక‌లు ఆడుతూ ఉంటారు. చాలా సేప‌టి నుంచి ఆట సాగుతూ ఉంటుంది. అయితే ఇక ఆట ముగింపు ద‌శ‌కు వ‌స్తుంది. భానుమ‌తి క‌చ్చితంగా ఓడిపోయే స్థితికి వ‌స్తుంది. అదే స‌మ‌యంలో ఆ మందిరంలోకి భానుమ‌తి భ‌ర్త దుర్యోధ‌నుడు వ‌స్తాడు. అత‌ని రాక‌ను ఆమె గ‌మ‌నిస్తుంది. ఎందుకంటే ఆమె ద్వారానికి ఎదురుగా ఉంటుంది. క‌ర్ణుడి వీపు ద్వారం వైపుకు ఉంటుంది. అయితే భ‌ర్త వ‌చ్చాడ‌ని భానుమ‌తి మ‌ర్యాద‌గా పైకి లేవ‌డానికి య‌త్నిస్తుంది. దీంతో అది గ‌మనించిన క‌ర్ణుడు ఆమె ఓడిపోతుంది క‌నుక పారిపోయేందు య‌త్నిస్తుంద‌ని అర్థం చేసుకుంటాడు. వెంట‌నే ఆమె ముఖంపై ఉన్న వ‌స్త్రాన్ని ప‌ట్టుకుని ఆపేస్తాడు. దీంతో ఆ వస్త్రానికి అలంకార‌మై ఉన్న ముత్యాలు తాడులోంచి తెగి కింద ప‌డుతాయి. ఈ హ‌ఠాత్ ప‌రిణామానికి భానుమ‌తి షాక్ అవుతుంది. ఆమె ముఖాన్ని గ‌మ‌నించిన క‌ర్ణుడు వెన‌క్కి తిరిగి చూడ‌గా దుర్యోధ‌నుడు క‌నిపిస్తాడు. దీంతో వారిద్ద‌రికీ ఏం చేయాలో తెలియ‌క ముఖాలు కింద‌కు దించుకుంటారు. అయితే దుర్యోధ‌నుడు మాత్రం తాపీగా వ‌చ్చి ముత్యాలు ఏరాలా..? లేదంటే ఏరి దండ గుచ్చాలా..? అని అడుగుతాడు. దీన్ని బ‌ట్టి మ‌న‌కు తెలుస్తుంది ఏమిటంటే… దుర్యోధ‌నుడికి క‌ర్ణుడిపై అంత న‌మ్మ‌కం ఉంటుంద‌న్న‌మాట‌. అందుక‌నే క‌ర్ణునితో స్నేహానికి దుర్యోధ‌నుడు అంత‌టి ప్రాధాన్య‌త‌ను ఇచ్చాడు..!

Comments

comments

Share this post

scroll to top