తాను చ‌నిపోయే లోపు త‌న కూతుర్ని చూడాల‌నుకుంటున్న‌..మ‌బియా రియ‌ల్ స్టోరి.!

”నాకు 15 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు పెళ్ల‌యింది. నా భ‌ర్త నిర్మాణ కూలీగా ప‌నిచేసేవాడు. ప‌నికి స‌రిగ్గా వెళ్లేవాడు కాదు. మ‌ద్యం తాగేవాడు. ఊరంతా బ‌లాదూర్‌గా తిరిగేవాడు. నా తండ్రి సంపాదించే డ‌బ్బును లాక్కుని జ‌ల్సాలు చేసేవాడు. కుటుంబం గ‌డ‌వ‌డం కోసం నేను ప‌నిమనిషిగా మారాల్సి వ‌చ్చింది. ఇంత‌లోనే నాకు అనీషా పుట్టింది. అప్పుడే నాక‌ర్థ‌మైంది. అనీషాయే నాకు అన్నీ అని తెలుసుకున్నా. ఆమెకు మంచి విద్య‌ను అందించాల‌నుకున్నా. నా కూతురు పుట్టాక ఆమెను చూసైనా నా భ‌ర్త మార‌తాడ‌ని అనుకున్నా. అలా జ‌ర‌గ‌లేదు.

అసలు త‌న‌కు కూతురు ఉంద‌నే విష‌యం కూడా తెలియ‌న‌ట్టు ప్ర‌వ‌ర్తించేవాడు. అంత చిన్న వ‌య‌స్సులో త‌ల్లి అయినందుకు నాకు కొంత క‌ష్ట‌మే అనిపించింది. దానికి తోడు అనీషా బాగోగులు చూడాల్సి రావ‌డం, కుటుంబాన్ని పోషించే వారు లేక‌పోవ‌డంతో నేనే ప‌నిలోకి వెళ్లాల్సి వ‌చ్చింది. ఒక రోజు అత‌ను చేసిన ఓ ప‌ని నాకు పెద్ద స‌మ‌స్య‌ను తెచ్చి పెట్టింది. క‌న్న కూతురు అని కూడా చూడ‌కుండా అనీషాను నా భ‌ర్త కిడ్నాప్ చేశాడు. నా తండ్రిని డ‌బ్బులు డిమాండ్ చేశాడు. లేదంటే అనీషాను చంపేస్తాన‌ని బెదిరించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో వారు నా భ‌ర్త‌ను ప‌ట్టుకున్నారు. అనీషాను నాకు అప్ప‌గించారు. అప్పుడే నా భ‌ర్త నుంచి దూర‌మై పుట్టింటికి వెళ్లిపోయా. అలా 2 ఏళ్లు గ‌డిచాయి.

ఆ త‌రువాత మ‌ళ్లీ నేను నా భ‌ర్త ఉండే ప్రాంతంలోనే వేరే ఇంట్లోకి దిగి అందులో నివ‌సించ‌డం మొద‌లు పెట్టా. న‌న్ను చూసిన నా భ‌ర్త స్నేహితులు అత‌నికి స‌మాచారం ఇచ్చారు. నేను మ‌ళ్లీ వ‌చ్చిన సంగ‌తి అత‌నికి చెప్పారు. దీంతో అదును చూసుకుని నా భ‌ర్త ఒక రోజు ఇంటికి వచ్చి లోప‌ల గ‌దిలో ఉన్న నా ముఖంపై యాసిడ్ పోశాడు. విప‌రీత‌మైన మంట‌, నొప్పి క‌లిగాయి. అప్పుడే అనుకున్నా చ‌నిపోదామ‌ని, కానీ నా కూతుర్ని చూసి ఆగిపోయా. ఎవ‌రో న‌న్ను హాస్పిట‌ల్‌లో చేర్పించారు. నా తండ్రి వ‌చ్చాడు. ట్రీట్ మెంట్ చేయించాడు. అలా 2 ఏళ్లు గ‌డిచాయి. ఇప్ప‌టికీ నేను కంటి చూపుకు నోచుకోలేదు. వ‌స్తుందో రాదో తెలియ‌దు. పెదాలు పూడుకుపోయాయి, మాట్లాడ‌లేను. నా కూతుర్ని చూడ‌లేక‌పోతున్నందుకు బాధ క‌లిగింది. ఇప్ప‌టికి 24 స‌ర్జ‌రీలు చేశారు డాక్ట‌ర్లు. న‌న్ను మ‌రలా పూర్వ స్థితికి తెచ్చేందుకు వారు ప్ర‌య‌త్నిస్తున్నారు. అందుకు నా తండ్రి నా ఇంట్లో ఉన్న సామాన్లంటినీ అమ్మేశాడు. అయినా చికిత్స‌కు డ‌బ్బులు చాల‌ట్లేదు. చూద్దాం, ఆ దేవుడు ఏ దాత‌నో పంపించ‌క‌పోతాడా. కానీ… నేను ఒక్క‌టే నిర్ణ‌యించుకున్నా, బ‌తికే ఉండాల‌ని. బ‌తుకుతూ పోరాడాల‌ని..!”

— భ‌ర్త యాసిడ్ దాడిలో క‌ళ్లు, మాటలు కోల్పోయి చికిత్స కోసం డ‌బ్బుల్లేక దీనావ‌స్థ‌లో ఉన్న మ‌బియా అనే మ‌హిళ క‌థ ఇది. రియ‌ల్ స్టోరీ..!

Comments

comments

Share this post

scroll to top