నన్ను చూసే వాళ్లకు నేను ఓ బిచ్చగత్తెలా కనిపిస్తాను. కానీ నేను నిజానికి బిచ్చగత్తెను కాదు. రోజూ నేను లేచి చూసే సరికి నా పక్కన ఎంతో కొంత డబ్బు, నాణేలు పడి ఉంటాయి. అవన్నీ నేను బిచ్చగత్తెను అనుకుని దానం చేసిన వారివి. ఆ డబ్బును నేను తీసుకోను. నాకు కనిపించే బిచ్చగాళ్లకు ఇస్తాను. అది చూసి చుట్టూ ఉన్న పిల్లలు నా పక్కన చేరతారు. ఎంతో కొంత చిల్లర దక్కకపోతుందా అన్న ఆశ వారిది. కానీ వారికి నేను ఆ చిల్లర ఇవ్వను. దాంతో ఐస్ క్రీంలు కొని వారికి ఇస్తాను. అవంటే వారికి ఇష్టం. ఐస్ క్రీం అంటే వారికే కాదు, నా మనవడికి కూడా ఇష్టమే.
నేను అప్పుడప్పుడూ దాచుకున్న డబ్బుతో వాడికి ఐస్‌క్రీములు కొనిస్తుంటాను. ఆ రోజు నేను ఇక్కడికి వచ్చే ముందు వాడు బాగా ఏడ్చాడు. ఎంతలా అంటే నేనిక వాడికి కనిపించనేమోనని బాధపడుతూ తెగ ఏడ్చాడు. కానీ నేను చెప్పా, కచ్చితంగా తిరిగి వస్తానని. అంతా సర్దుకుంటుందని అన్నా. ఆ రోజే నా కొడుకుతో కలిసి నా కంటి ఆపరేషన్‌కు ఇక్కడికి వచ్చా. రిక్షా తెస్తానని చెప్పి నా కొడుకు బయటికి వెళ్లాడు. ఏం జరిగినా ఇక్కడే కూర్చోమన్నాడు. ఎటూ కదలొద్దన్నాడు. పిచ్చి కన్న. నేనంటే ఎంత ప్రేమో వాడికి. ఎటైనా వెళ్తే తప్పిపోతానేమోనని వాడి భయం. అప్పటికే రెండు రోజులు గడిచాయి. రిక్షా తెస్తానని బయటికి వెళ్లిన వాడు ఇంకా రాలేదు.
ఎవరో ఒకతను వచ్చి చెప్పాడు. నీ కొడుకు మొన్ననే నిన్ను ఇక్కడ వదిలి ఆ తరువాత వచ్చిన మరో ట్రైన్లో వెళ్లిపోయాడని, అతను నిన్ను వదిలించుకున్నాడు అని అన్నాడు. నేను నమ్మలేదు. నా కుమారున్ని కాకుండా ఇతరులు చెప్పిన మాటలను నేనెలా నమ్ముతాను. అలాగే వేచి చూస్తున్నా. మరి కొంత సమయం గడిచాక ఓ పిల్లాడు నా దగ్గరికి వచ్చి అన్నాడు. నీ కొడుకు నిన్ను వదిలేసి వెళ్లిపోయాడు. మొన్ననే నన్నూ మా నాన్న వదిలి వెళ్లాడు. అప్పుడు నాకు తెలియదు, నన్ను విడిచి పెట్టి, వదిలించుకుని అతను వెళ్తున్నాడని. ఆ తరువాతే నాకా విషయం తెలిసింది, అన్నాడు ఆ పిల్లాడు. అప్పుడే నాకనిపించింది, ప్రపంచం మొత్తం నా గుండెలను కెలికిన అనుభూతి. ఓ వైపు బయటికి వస్తున్న రక్తధార, దాన్ని ఆపేవారు లేరా..? నా బాధ తీర్చేవారు లేరా..?
— కన్న కొడుకు రైల్వే ప్లాట్‌ఫాంపై వదిలి వెళ్లడంతో ఓ తల్లి పడ్డ బాధ ఎలాంటిదో తెలియజెప్పిన యదార్థ గాథ ఇది..!