ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ అనే బంధం ఒక్కసారి దృఢంగా ఏర్పడిందంటే చాలు… ఇక అది వారి జీవితాంతం అలాగే కొనసాగుతుంది. ఓ పట్టాన పోదు. ఇద్దరిలో ఎవరికి ఏమైనా, ఎవరు ఎలా ఉన్నా… ప్రేమ బంధం దృఢంగా ఉందంటే చాలు… వారిద్దరినీ ఎవరూ విడదీయలేరు. అది సాధ్యం కూడా కాదు. అదిగో ఆ జంట కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతారు. ఎప్పుడో చాలా చిన్నతనంలో వారికి వివాహం అయినా, పిల్లలు లేకున్నా ఇద్దరూ ఒకరికొకరు ప్రేమగా, ఆప్యాయంగా తోడున్నారు తప్పితే ఎప్పుడూ విడిపోదామని వారు అనుకోలేదు. ఎన్ని ఆపదలు వచ్చినా, కష్టాలు ఎదురైనా వారిద్దరు ఒకరికొకరు తోడు నీడుగా ఉన్నారు. అలాంటి దృఢమైన ప్రేమ బంధం వారిది. కానీ వారిది మాత్రం ప్రేమ పెళ్లి కాదు. పెద్దలు కుదిర్చి చేసిన పెళ్లే..!
ఆమె పేరు సలేహా బేగం. ఆమెకు 13 ఏళ్ల వయస్సు ఉండగానే పెద్దలు పెళ్లి చేశారు. పెళ్లి రోజు వరకు ఆమె తన భర్తను అస్సలు చూడలేదు. పెళ్లయ్యాక రెండు, మూడు రోజుల వరకు ఆమె తన భర్తతో మాట్లాడలేదు కూడా. ఈ క్రమంలో వారిద్దరి వైవాహిక జీవితంలో 5 ఏళ్లు గడిచిపోయాయి. అయితే ఆమెకు పిల్లలు కలగలేదు. దీంతో భర్త తరఫు అక్కలు, చెల్లెల్లు అతన్ని వేరే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. ఇది విన్న సలేహా ఎంతగానో దిగులు చెందింది. ఇక తనకు జీవితం లేదని నిర్ణయించుకుంది. అంతే, వెంటనే తన భర్త నుంచి దూరంగా వెళ్లిపోవాలని అనుకుంది. అయితే ఆమె భర్త మాత్రం ఆమె వెళ్లిపోకుండా అడ్డుకున్నాడు. జీవితాంతం తనకు తోడుగా ఉండాలని, ఎవరు ఏమన్నా తాను పట్టించుకోనని, తనతో ఉండాల్సిందేనని చెప్పాడు. దీంతో ఆమె మొదట ఆశ్చర్యానికి గురైనా తరువాత భర్తతోపాటే ఉంది. అలా వారి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోయింది.
ఇప్పుడు సలేహా బేగం ఆమె భర్త వృద్ధాప్యంలో అడుగు పెట్టారు. వారికి ఉన్న బంధువులు, కుటుంబ సభ్యులు ఒక్కొక్కరే దూరమయ్యారు. దీంతో ఇద్దరూ ఒంటరి పక్షుల్లా మిగిలారు. అయినా వారు దిగులు చెందలేదు. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ కారణంగా ఒకరికొకరు తోడుగా ఉన్నారు. ఏనాడూ ఒంటరి తనాన్ని ఫీల్ అవలేదు. అయితే పేదరికం కారణంగా వారికిప్పుడు తింటానికి తిండి కూడా లేదు. అయినా అంతులేని అనుగారం, ఆప్యాయత వారి సొంతం. పిల్లలు పుట్టలేదని సలేహాను ఆమె భర్త దూరం పెట్టలేదు. అలాగే తింటానికి తిండి తేవడం లేదని, పేదరికంలో ఉంచాడని సలేహా తన భర్తను దూరం చేసుకోలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా ఒకరికొకరు తోడుగానే ఉన్నారు. ఇప్పుడు వారి వైవాహిక జీవితానికి 60 ఏళ్లు పూర్తయ్యాయి. ఎన్నో కష్టాల్లో ఉన్నా ఇద్దరూ ఇప్పటికీ అన్యోన్యంగానే ఉన్నారు. ఇప్పుడు వారు ఏం చెబుతున్నారంటే… తాము చనిపోయేంత వరకు ఇలాగే ఉంటామని, తమకు ఇప్పుడు తిండి దొరకకున్నా, రేపు దొరికినా తమ ప్రేమలో ఎలాంటి తేడా ఉండదని అంటున్నారు. అవును మరి… నిజమైన ప్రేమ అంటే అలాగే ఉంటుంది కదా..!