మన దేశంలో సర్కారు దవాఖానాలు అంటేనే యమపురికి దారులుగా మారుతున్నాయి. అక్కడ రోగులకు కావల్సిన కనీస సౌకర్యాలు ఉండవు. డాక్టర్లు సరిగ్గా విధులకు హాజరు కారు. సిబ్బంది నిర్లక్ష్యం. వెరసి ఓ పేదవాడు ప్రభుత్వ హాస్పిటల్‌కు వెళ్లాలంటేనే జంకాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది ఇప్పుడే కాదు, దేశానికి స్వాతంత్ర్య వచ్చినప్పటి నుంచి ఇలాగే ఉంది. నాయకులు మారారు, ప్రభుత్వాలు మారాయి. అయినా పేదలకు అందాల్సిన వైద్య సదుపాయాల్లో మాత్రం మార్పు రావడం లేదు. పేరుకేమో వేల కోట్ల రూపాయలను పేదల కోసం ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి, మరి హాస్పిటల్స్‌లో సౌకర్యాలు చూస్తేనేమో అసలు వాటికి వెళ్లకుంటేనే ఆరోగ్యం బాగుంటుందేమో అనిపిస్తోంది. ఒక వేళ ఖర్మ కాలి వెళ్లామే అనుకోండి, సిబ్బంది పట్టించుకోరు. డాక్టర్లు ఉండరు. ఇక చేసేదేం లేక బిక్కు బిక్కుమంటూ కాలం గడపాల్సిందే. మరీ ఈ మధ్య కాలంలోనైతే దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా పేదలకు అందుతున్న వైద్య సౌకర్యాల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. అంబులెన్సులు లేక తమ తమ కుటుంబ సభ్యులను భుజాలపై మోసుకెళ్తున్న ఘటనలను ఇప్పటికే మనం చాలా చూశాం. వాటికి తీసికట్టుగా తాజాగా మరో సంఘటన రాంచీలో చోటు చేసుకుంది.
పాల్మతీ దేవి అనే ఓ మహిళ తన కుడి చేయి విరగడంతో జార్ఖండ్‌లోని రాంచీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స కోసం వచ్చింది. దీంతో ఆమెను అక్కడి సిబ్బంది హాస్పిటల్లో చేర్చుకున్నారు. అయితే విరిగిన ఆమె చేయికి కట్టయితే కట్టారు గానీ, బెడ్ లేదు. దీంతో ఆమె నేలపైనే పడుకుంది. ఈ క్రమంలో భోజనం వడ్డించాల్సిన సిబ్బంది చేసిన నిర్వాకం ఏంటంటే… రోగులకు హాస్పిటల్లో తగినన్ని ప్లేట్లు లేవట. అందుకని ఎవరూ చేయకూడని, జుగుప్సాకరమైన పనిని వారు చేశారు. ప్లేట్లు లేవని చెప్పి సదరు పాల్మతీ దేవికి వారు నేలపైనే భోజనం వడ్డించారు. చేయి విరిగి హాస్పిటల్లో దీనావస్థలో ఉందన్న కనికరం కూడా లేకుండా ఆమె పట్ల ఆ హాస్పిటల్ సిబ్బంది అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు.
అయితే రాంచీలో జరిగిన ఈ సంఘటనను ఓ జాతీయ పత్రిక ప్రచురించడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఆ మహిళ పట్ల అలా ప్రవర్తించిన హాస్పిటల్ సిబ్బందిని వారి ఉన్నతాధికారులు సస్పెండ్ కూడా చేశారు. అయినా వారు చేసిన పని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించ రానిది. వారికి కూడా అలాగే నేలపై భోజనం వడ్డిస్తే తింటారా..? అసలు ప్రభుత్వ ఆస్పత్రులు ఎందుకు ఇలా తయారయ్యాయి. ఏమో… వాటికి వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఇక పేదవాడి ఆరోగ్యం గాలికి పోయినట్టే… ఎప్పుడు మారుతుందో ఈ పరిస్థితి…