అత‌డే ఆయుధం – స‌మ‌స్య‌ల‌పై రాకేష్ రెడ్డి అస్త్రం.!!

మేధావులు..విద్యాధికులు..వ్యాపార‌స్తులు..డ‌బ్బున్న మారాజులు ఎంద‌రో తెలంగాణ‌లో ఉన్నారు. వీరంతా భ‌ద్ర‌మైన జీవితం కోరుకున్న వారే. ఎవ్వ‌రికీ సామాజిక బాధ్య‌త లేదు. వీరంద‌రి కంటే వెరీ వెరీ స్పెష‌ల్ ఈ కుర్రాడు. చైత‌న్యానికి కేరాఫ్‌గా ఉన్న వ‌రంగ‌ల్‌కు చెందిన రాకేష్ రెడ్డి మాత్రం కొంచెం డిఫ‌రెంట్. సామాజిక కార్య‌క‌ర్త‌గా ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తున్నాడు. స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా ఎన్నో స‌మ‌స్య‌ల‌ను వెలికి తీశాడు. చ‌దువులో ఫ‌స్ట్‌. మోస్ట్ టాలెంటెడ్‌. 2001లో నిర్వహించిన ఎంసెట్ ఎగ్జామ్‌లో రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంకు సాధించాడు. నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో ఇంజ‌నీరింగ్ పూర్తి చేశాడు. అయిదు సంవ‌త్స‌రాల పాటు ఒరాకిల్ ఐటీ కంపెనీలో ఇంజ‌నీర్‌గా ప‌నిచేశాడు. ఆ త‌ర్వాత ఆర్టీఐ యాక్టివిస్ట్ గా ప‌ని చేయ‌డం స్టార్ట్ చేశాడు.

Rakesh Reddy Dubbuku

స‌మాచార హ‌క్కు చ‌ట్టం జిల్లాలో స‌క్ర‌మంగా అమ‌లు కావ‌డం లేదంటూ రాకేష్ గుర్తించాడు. ఎవ‌రైనా మంచి ఉద్యోగాన్ని చూసుకుంటారు. ల‌క్ష‌ల వేత‌నాన్ని కాద‌నుకుని స‌మాజం కోసం అంకితం కావ‌డం ఇత‌డికే చెల్లింది. ప్ర‌తి ప్ర‌భుత్వ కార్యాల‌యాన్ని తిరిగాడు. ఎక్క‌డ కూడా ఆర్టీఐ యాక్టు అమ‌లు కావ‌డం లేద‌న్న స‌త్యం గుర్తించాడు. ఏ ఒక్క అధికారి రాకేష్ రెడ్డికి స్పందించిన పాపాన పోలేదు. జీవితాన్ని ఆర్టీఐ కోసం అంకితం చేశాడు. ప్రాథ‌మికంగా ప్ర‌జ‌ల‌కు ఈ యాక్టుకున్న ప‌వ‌ర్ ఏమిటో తెలియ‌ద‌ని గుర్తించి..ఆ దిశ‌గా ముందు జ‌న‌చైత‌న్యం కోసం న‌డుం బిగించాడు. స‌మాచారం హ‌క్కు చ‌ట్టం -2005 అంటే ఏమిటి. ఈ చ‌ట్టం వ‌ల్ల లాభాలు ఏమిటి.. ఈ చ‌ట్టం ఎవ‌రి కోసం రూపొందించ‌బ‌డింది. దీని ద్వారా ఏయే స‌మాచారాన్ని పొంద‌వ‌చ్చు. ఎన్ని రోజుల్లో తీసుకోవ‌చ్చు. విధి విధానాలు..అధికారుల బాధ్య‌త‌లు అన్నీ కూలంకుశంగా రాకేష్ తెలుసుకున్నాడు.

తానే ఆయుధ‌మై జనాన్ని ఆర్టీఐ యాక్టుపై అవ‌గాహ‌న క‌ల్పించారు. ఒక్క‌డు చెబితే ఈ జ‌నం వింటారా..అందుకు ఆలోచించిన రాకేష్ రెడ్డి..భూమి పేరుతో స్వ‌చ్ఛంద సంస్థ‌ను ఏర్పాటు చేశాడు. త‌న స్నేహితుల‌తో క‌లిసి అవ‌గాహ‌న శిబిరాలు, శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. పిల్ల‌లు చ‌దువుకునేందుకు ర‌సూల్‌పూర‌లో భ‌వ‌న నిర్మాణాలు చేప‌ట్టారు. ద్రోణాచార్య‌, ఏక‌ల‌వ్య పేరుతో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌పై శిక్ష‌ణ ఇచ్చారు. ఉస్మానియా ఆస్ప‌త్రి లో టాయిలెట్స్‌ను , బిల్డింగ్‌ను శుభ్రం చేయ‌డం, ర‌క్తాన్ని ప‌రీక్షించ‌డం లాంటి ప‌నులు చేప‌ట్టారు. ఎన్నో సంస్థ‌లు చేప‌ట్టే కార్య‌క్ర‌మాల్లో భాగం పంచుకున్నాడు రాకేష్ రెడ్డి. సామాజిక సేవా కార్య‌క‌ర్త‌గా ఎంతో అనుభ‌వం గ‌డించిన రెడ్డి ఆర్టీఐ యాక్టు మీద దృష్టి పెట్టాడు. 2010లో ఒరాకిల్ జాబ్‌ను వ‌ద‌లేశాడు. అభ్యాస్ ఎడ్యూకార్ప్ సంస్థ‌కు కోఫౌండ‌ర్‌గా ఉన్నాడు. జీవితం కంటే జ‌నాన్ని క‌దిలించ‌డం..చైత‌న్య ప‌ర్చ‌డం..ఆర్టీఐ యాక్టివిస్టుల‌ను త‌యారు చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. ఏకంగా 10000 వేల మందిని ఆర్టీఐ యాక్టివిస్టులుగా తీర్చిదిద్దాడు. 2005 అక్టోబ‌ర్ లో 500 ఆర్టీఐ ద‌ర‌ఖాస్తులు ఇచ్చాడు.

ఎన్నో డిపార్ట్ మెంట్‌లు..ఎవ‌రూ ఎవ‌రికీ బాధ్య‌త వ‌హించ‌రు. అడిగితే స‌మాచారం ఇవ్వ‌కుండా దాట వేస్తారు. బాధ్య‌తా రాహిత్యం ఎక్కువ‌. కామ‌న్ మ్యాన్ కు ఉన్న ఈ యాక్టు ద్వారా ఎంద‌రినో నిలదీశాడు. ఆయా శాఖ‌ల‌కు వ‌స్తున్న నిధులు, ఎన్నెన్ని దేనికి ఎంత కేటాయించారో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులంతా ఆర్టీఐ ప‌రిధిలోకి రావాలంటూ భారీ ఎత్తున ఆందోళ‌న‌లు చేప‌ట్టారు రాకేష్‌. వారంద‌రి కుటుంబ ఆస్తులు, ఆదాయాలు కూడా చెప్పి తీరాల్సిందేనంటూ ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు. డేటా తీసుకోవ‌డంలో ఎదుర‌య్యే ఇబ్బందుల‌ను గుర్తించాడు. ఏ అధికారి ద‌గ్గ‌రికి వెళ్లినా అర‌కొర స‌మాచార‌మే ఇచ్చారు. దీనిని తీవ్రంగా వ్య‌తిరేకించాడు రాకేష్ రెడ్డి. ఆర్టీఐ సిస్టంలోనే ఏదో లోపం ఉంద‌ని గుర్తించి..ఆ విష‌యాన్ని కేంద్ర స‌మాచార క‌మిష‌న్ దృష్టికి తీసుకు వెళ్లాడు. ఈ విష‌య‌మై ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార‌, మీడియా, సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం చేశాడు. ఎన్నో వ్యాసాలు ప‌బ్లిష్ అయ్యేలా ప్ర‌య‌త్నించాడు. తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన న్యూస్ పేప‌ర్ల‌లో విశ్లేష‌ణాత్మ‌క ఆర్టీఐ మీద వ్యాసాలు రాశాడు. జాతీయ స్థాయిలో ద హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా లో ప‌బ్లిష్ అయ్యాయి.

టీచింగ్ అన్నా..ట్రైనింగ్ ఇవ్వ‌డం అన్నా రాకేష్ రెడ్డికి ఇష్టం. నేష‌న‌ల్ క్యాంపెయిన్ ఫ‌ర్ పీపుల్స్ రైట్ టు ఇన్ఫ‌ర్మేష‌న్ , ద ల‌క్ష్యా ఫౌండేష‌న్ కు ట్ర‌స్టీగా, యునైటెడ్ ఫోరం ఫ‌ర్ ఆర్టీఐ క్యాంపెయిన్ కోక‌న్వీనర్‌గా ..అభ్యాస్ ఎడ్యూకార్ప్ కు కో ఫౌండ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సీఎన్ ఎన్ ఐబీఎన్ సిటిజ‌న్ జ‌ర్న‌లిస్ట్ అవార్డు ను రాకేష్ అందుకున్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో రైతుల ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ‌కు కృషి చేశారు. బెస్ట్ సోష‌ల్ యాక్టివిస్ట్‌గా ఎస్ ఎం బాషా మెమోరియ‌ల్ అవార్డు పొందారు. రాజ‌కీయ నాయ‌కుల వ‌ల్ల‌నే ఈ స‌మాజం చెడిపోతోంది.అనుకుంటే పొర‌ప‌డిన‌ట్టే..అంద‌రం బాధ్య‌త వ‌హించాల్సిందే. ఆక్టోప‌స్ లా అల్లుకు పోయిన అవినీతిని రూపు మాపాలంటే ఆర్టీఐ చ‌ట్టం మించిన ఆయుధం సామాన్యుల‌కు లేదంటారు రాకేష్ రెడ్డి. మార్పు మ‌న‌లోంచి రావాలి. స‌మాజం దానంత‌ట అదే మారుతుంది. కావాల్సింద‌ల్లా ప‌ట్టుద‌ల అంటారు రెడ్డి. కాసులు అందించే కొలువును కాద‌నుకుని ప్ర‌జ‌ల కోసం జీవితాన్ని అంకితం చేసిన ఇలాంటి వ్య‌క్తులు ఉండ‌డం తెలంగాణ‌కు..తెలుగు వారికి గ‌ర్వ‌కార‌ణం క‌దూ.

Comments

comments

Share this post

scroll to top