మ‌న‌స్సున్న మారాజు -రాజు రెడ్డి ..!

కోట్లున్నా ఏం లాభం. ఎన్ని ప‌ద‌వులుంటే ఎవ‌రికి ఉప‌యోగం. ప‌ది మందికి ప‌ట్టెడు అన్నం పెట్ట‌లేని వాళ్లు ఈ భూమి మీద బ‌తికి వున్నా లేన‌ట్టే. చ‌చ్చిన‌ట్టే. ఏదో ఒక రోజు వెళ్లి పోవాల్సిందే..మ‌ట్టిలో క‌లిసి పోవాల్సిందే. క‌న్నీళ్లు కార్చేది ఎవ్వ‌రో..నీవాళ్లు ఎవ‌రో ..నావాళ్లు ఎవ‌రో తెలియ‌దు..ఎందుకీ ఆరాటం..అందుకే మ‌నం దీపమైనా కావాలి లేదా దారి చూపే దిక్సూచి అయినా కావాలి. అలాంటి వారి కోవ‌లోకే వ‌స్తాడు మ‌న రాజు రెడ్డి. మ‌న‌లాగే ఆలోచిస్తే ఆయ‌న గురించి చెప్పుకునేందుకు క‌థ అంటూ ఉండ‌దు. స‌మాజం కోసం ఆలోచించే వాళ్లు క‌రువై పోయారు. ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ రాజ్యం ఏలుతున్న ఈ ప్ర‌పంచంలో ..ఈ త‌రుణంలో త‌మ తోటి వారి గురించి..తాను పుట్టిన నేల కోసం ఏదో చేయాల‌న్న త‌ప‌న అత‌డిని ఈ వైపు ఆలోచించేలా చేసింది. నిజామాబాద్ జిల్లాకు ప్ర‌పంచ వ్యాప్తంగా పేరుంది. ఆ జిల్లా పేరు త‌లుచుకుంటే..బాస‌ర గుర్తొస్తుంది..అంత‌కంటే ఎక్కువ‌గా సామ ఫ‌ణీంద్ర రెడ్డి ..రెడ్ బ‌స్ గుర్తుకు వ‌స్తుంది.

raju reddy kakatiya sand box

పుట్టిన ప్రాంతానికి ఏదో చేయాల‌న్న త‌ప‌న వీళ్ల‌ను ప్ర‌త్యేక‌మైన మ‌నుషులుగా తీర్చిదిద్దింది. ఈ జిల్లాలో చాలా మంది విదేశాల‌కు వెళ్లారు. ప్ర‌వాస భార‌తీయులుగా..తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంతో మంది త‌మ ప‌ల్లెలు అభివృద్ధి చెంద‌డానికి ఎంతో కొంత సాయ‌ప‌డుతున్నారు. ఈ జిల్లాలో చెరుకు, ప‌సుపు ఎక్కువ‌గా పండుతుంది. వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి అలియాస్ ఫేమ‌స్ నిర్మాత దిల్ రాజు కూడా ఈ ప్రాంతానికి చెందిన వాడే. కొత్తగా ఆలోచించే వాళ్ల‌ను ప్రోత్స‌హించే మ‌న‌స్త‌త్వం దిల్ రాజుకు ఉంది. ప్రాణ‌మిచ్చిన త‌ల్లిదండ్రులను గౌర‌వించ‌డం.. గుర్తింపును..త‌మ కాళ్ల మీద నిల‌బ‌డేలా చేసిన స‌మాజానికి కొంతైనా ఇవ్వాల‌న్న సంక‌ల్పం గొప్పది. సామ ఫ‌ణీంద్ర రెడ్డితో పాటు రాజు రెడ్డిలు క‌లిసి నిజామాబాద్ జిల్లాతో పాటు ప‌లు ప్రాంతాల‌లోని ప‌ల్లెల్లో వెలుగులు పంచేందుకు న‌డుం బిగించారు. ఇది ఎంతో ఖ‌ర్చుతో కూడుకున్నది. వారు వెనుదిరిగి చూడ‌లేదు. సామాన్యులుగా ఉంటే ఎవరూ గుర్తించ‌రు. ఒక ఉన్న‌త స్థానం అందుకున్నాక అభినంద‌న‌లు వెల్లువ‌లా వ‌స్తాయి. సామ ఓ వైపు..రాజు రెడ్డి ఇంకో వైపు సామాజిక‌, ఆర్థిక, వ్య‌వ‌సాయ, విద్యా ప‌రంగా , టెక్నాల‌జీ ప‌రంగా గ్రామాలు స్వ‌యం స‌మృద్ధిని సాధించేలా చేయాల‌ని నిర్ణ‌యించారు. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. సాంకేతిక నైపుణ్యం అందించ‌డంతో పాటు వ్య‌వ‌సాయ రంగంలో ఎరువులు, ర‌సాయ‌నాలు లేకుండా పంట‌లు పండించేలా చేయ‌డంపై దృష్టి పెట్టారు.

వినూత్నంగా ఆలోచించ‌డం..ప్ర‌యోగాలు చేయ‌డం అంటే రాజు రెడ్డికి ఇష్టం. అందుకే కాక‌తీయ శాండ్ బాక్స్ అనే పేరుతో సంస్థ‌ను స్థాపించాడు. క‌ర్ణాట‌క‌లోని హుబ్లీ కేంద్రంగా సామాజిక సేవ చేస్తున్న అగ‌స్త్య ఫౌండేష‌న్ ను రాజు రెడ్డి సంప్ర‌దించాడు. తాను ఏం చేయాల‌నుకుంటున్నాడో ఓ నోట్ వారికి అంద‌జేశాడు. సంస్థ రాజురెడ్డి ప్ర‌పోజ‌ల్‌ను స్వీక‌రించి..ప్రోత్స‌హించింది. గురురాజ్ దేశ్ పాండే..దీని వ్య‌వ‌స్థాప‌కుడు..ఆయ‌న ఇచ్చిన ప్రేర‌ణ‌తో త‌న నిజామాబాద్ జిల్లాకు వ‌చ్చాడు రెడ్డి. ఫ‌ణీంద్ర‌తో క‌లిసి నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, మెద‌క్ జిల్లాల‌కు సేవ‌ల‌ను విస్త‌రించాడు. విద్యార్థులు ఏయే కోర్సులు చ‌ద‌వాలి…స్థిర‌ప‌డేందుకు ఎలాంటి కోర్సులు ఎంచు కోవాలో తెలుసు కునేందుకు కౌన్సెలింగ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశాడు. ఇందు కోసం విద్యా హెల్ప్ లైన్ల‌ను ఉంచాడు. 65 వేల మంది విద్యార్థుల‌కు రెస్పాండ్ అయ్యారు. విద్యార్థుల‌కు విజ్ఞానం అందాలి..అది ప్ర‌యోగ‌శాల కావాలి. అగ‌స్త్య ఫౌండేష‌న్ తోడ్పాటుతో ప్ర‌యోగ‌శాల ఏర్పాటు చేశారు..రాజు రెడ్డి. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ‌డుల‌కు చెందిన స్టూడెంట్స్ కు ఇక్క‌డ ప్ర‌యోగాలు చేసేలా చూశారు. యువ‌తీయువ‌కుల‌కు నాయ‌క‌త్వ నైపుణ్యం, విజ్ఞానం ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇంట‌ర్న‌షిప్‌, శిక్ష‌ణ త‌ర‌గతులు నిర్వ‌హించేలా చేశారు. మూడు నెల‌ల నుండి ఆరు నెల‌ల దాకా ఉండే ఉపాధి నిచ్చే కోర్సుల‌ను రూపొందించారు. వివిధ కంపెనీల‌తో మాట్లాడి ఉన్న చోట‌నే ఉపాధి దొరికేలా చేస్తున్నారు. కౌటిల్య పేరుతో ఆరు నెల‌ల పాటు క‌ఠిన‌త‌ర‌మైన ట్రైనింగ్ ఇస్తున్నారు. దీని ద్వారా శిక్ష‌ణ పొందితే ..జాబ్ గ్యారెంటీ. ట్రైనింగ్ పూర్త‌యిన వారు ఐటీ కంపెనీల‌లో కొలువులు పొందారు.

చిరు వ్యాపారాల ద్వారా ఆదాయం పొందే మార్గాల‌ను అన్వేషించి..తోడ్పాటు అందిస్తోంది శాండ్ బాక్స్‌. ఎన్ ఆర్ ఐ శ్రీ‌కాంత్ బొల్ల సాయంతో హైద‌రాబాద్‌, హుబ్లీ, నిజామాబాద్‌ల‌లో పేప‌ర్ ప్లేట్ల త‌యారీకి స‌పోర్ట్ చేశారు. త్రీడీ ప్రింటింగ్ ల్యాబ్‌ను మొద‌టి సారిగా నిజామాబాద్‌లో ఏర్పాటు చేశారు రాజు రెడ్డి. 20 వేల మందికి సిద్దిపేట‌లో రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. ఎండిన బోర్ల‌ను రీఛార్జ్ అయ్యేలా చేశారు. రైతుల‌తో క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. అన్న‌దాత‌ల‌కు అండ‌గా..యువ‌తీ యువ‌కుల‌కు తోడుగా..ప‌ల్లెల్లో వెలుగులు పంచుతున్నారు రాజు రెడ్డి. స‌మాజం నాకు ఎంతో ఇచ్చింది. న‌న్ను ఇంత వాడిని చేసింది. నేను ఎదిగేందుకు తోడ్పడిన ప్ర‌తి రూపాయి ఈ స‌మాజం నా కోసం ఖ‌ర్చు చేసిందే. అందుకే నేను కొంత ఇవ్వాలిగా అంటున్నారు రాజు రెడ్డి.

Comments

comments

Share this post

scroll to top