గుడిలో “రజినీకాంత్” ని బిచ్చగాడు అనుకొని ఓ మహిళ 10 రూపాయలు దానం చేసింది..! తర్వాత ఏమైందో తెలుసా..?

సినిమా వాళ్లకు సంబంధించిన ప్రతి విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది..కానీ అందులో మన సూపర్ స్టార్ రజినీ కాంత్ గురించిన విషయాలైతే మరీ ఆసక్తికరంగా ఉంటాయి..బస్ కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్ గా ఎదగడం.. అయినప్పటికీ కించిత్ గర్వం లేకుండా సాధారణ మనిషిగా బతకడం..ఒకప్పటి తనతో పాటు డ్రైవర్ గా చేసిన వ్యక్తి ఇంటికి ఇప్పటికీ ఏడాదికి ఒకసారి వెళ్లడం..సాధారణ జీవితం,ఎవరేమన్నా కూడా బాదపడకుండా వారు అలా ఎందుకు అనాల్సొచ్చింది అని ఆలోచించే విధానం.. ఈ విధంగా రజినీ చేసే ప్రతి పని కూడా స్పూర్తి దాయకంగా ఉంటుంది..అదే విధంగా రజినీ గురించి ఒక ఇంట్రస్టింగ్ టాపిక్ ఈనాడులో ప్రచురితమైంది..అదే యధాతధంగా…

చాలా రోజుల కిందటి సంఘటన! బెంగళూరులో అదో పేరుమోసిన ఆలయం. ఆ రోజు విశేష పర్వదినం కావడంతో రద్దీ ఎక్కువగా ఉంది. అందరిలాగే ఆ వ్యక్తి కూడా ఆలయానికి వెళ్ళాడు. దర్శనం ముగించుకొని, ధ్వజ స్తంభం పక్క ఓ అరుగు మీద కూర్చోన్నాడు. బాగా మాసిన గడ్డం… పక్షిగూడులా గజిబిజిగా ఉన్న జుట్టు… అత్యంత సాధారణమైన దుస్తులు- వీటిని చూసి ఎవరూ ఆయనను పట్టించుకోలేదు. ఆలయానికి జనం వచ్చి వెళ్తున్నారు. అంతలో ఓ ధనవంతురాలైన మహిళ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టింది. తన పర్సు లోంచి చేతికి అందిన డబ్బును బిచ్చగాళ్ళకు దానం చేస్తోంది. అలా చేస్తూ ధ్వజ స్తంభం పక్క అరుగు మీద కూర్చొన్న మాసిన గడ్డం వ్యక్తిని చూసింది. పాపం అనుకొంది. పర్సు లోంచి పది రూపాయలు తీసి దానం చేసింది. ఆ నోటును అందుకున్న వ్యక్తి నిశ్చలంగా ఉన్నాడు. ఆయన నుంచి ఎలాంటి ప్రతిస్పందనా రాకపోవడం చూసి ఆమె గుడిలోకి వెళ్లి, దైవ దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చింది.

అలా వచ్చిన తర్వాత తన కంటపడ్డ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కారణం ఇందాక తాను బిచ్చగాడని భావించి పదిరూపాయలు దానం చేసిన వ్యక్తి ఖరీదైన కారు ఎక్కుతూ కనిపించాడు. వెంటనే ఆమె పరుగున కారు వద్దకు వెళ్లింది. ఆయనను క్షమించమని కోరింది. వెంటనే ఆయన ‘‘మీరేమీ తప్పు చేయలేదు తల్లీ. మీ ద్వారా భగవంతుడు నాకో సత్యాన్ని బోధించాడు. సూపర్‌ స్టార్‌ననే అహాన్ని నాలోంచి తొలగించి, నేను సైతం ఒక బిచ్చగాడితో సమానమే సుమా! అనే కఠోర సత్యాన్ని మీ ద్వారా నాకు తెలియజెప్పాడు’’ అంటూ ఆ ధనికురాలికి ధన్యవాదాలు చెప్పి ఆయన తన కారులో వెళ్ళిపోయాడు. పది రూపాయల భిక్షను అందుకొన్న ఆ వ్యక్తి ఎవరో కాదు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌.

Comments

comments

Share this post

scroll to top