రాజ‌స్థాన్‌లో టెంట్ డీల‌ర్ల వినూత్న ఆలోచ‌న‌… వ‌ధూవ‌రుల బ‌ర్త్ స‌ర్టిఫికెట్ చూప‌నిదే టెంట్ సామ‌గ్రి ఇవ్వ‌రు…

మంచి ప‌ని ఎవ‌రు చేసినా మ‌నం అభినందించాల్సిందే. ప్ర‌ధానంగా స‌మాజ హితం కోసం ఉపయోగ‌పడే ప‌నుల‌ను ఎవ‌రైనా చేస్తే వారిని ప్ర‌తి ఒక్క‌రూ ఆద‌ర్శంగా తీసుకుని మ‌రిన్ని మంచి పనులు చేయాలి. రాజ‌స్థాన్‌కు చెందిన టెంట్ డీల‌ర్లు కూడా ఇప్పుడు స‌రిగ్గా ఇలాగే చేస్తున్నారు. త‌మ వినూత్న ఆలోచ‌న ద్వారా ఇత‌రుల‌ను ఆలోచింప‌జేయ‌డ‌మే కాదు, అలాంటి స‌మాజ హిత కార్య‌క్ర‌మాల‌ను మ‌రిన్ని చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స‌గటు పౌరుడి బాధ్య‌త‌ను వారు గుర్తు చేస్తున్నారు. ఇంత‌కీ వారు చేస్తున్న ఆ పని ఏంటి?

మ‌న దేశంలో అనాదిగా వ‌స్తున్న సాంఘిక దురాచారాల్లో బాల్య వివాహం కూడా ఒక‌టి. చిన్న వ‌య‌స్సులోనే పెళ్లి జ‌ర‌గ‌డం వ‌ల్ల బాలిక‌లు త‌మ జీవితంలో ఎన్ని క‌ష్టాల‌ను, స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొనాల్సి వ‌స్తుందో అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈ దురాచారం ఇప్ప‌టికీ కొన్ని ప్రాంతాల్లో అమ‌లులో ఉంది. మ‌న దేశంలో ప్ర‌ధానంగా బీహార్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్ వంటి రాష్ట్రాల్లో బాల్య వివాహాలు ఇప్ప‌టికీ జ‌రుగుతూనే ఉన్నాయి. ఓ సంస్థ చేప‌ట్టిన స‌ర్వే ప్ర‌కారం 2011లో 10 నుంచి 19 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సున్న దాదాపు 1.70 కోట్ల మంది ఆడ‌పిల్ల‌ల‌కు బాల్య వివాహాలు జ‌రిగాయ‌ట‌. ఈ వివాహాలు ఎక్కువగా రాజ‌స్థాన్ రాష్ట్రంలోని ఆడ‌పిల్ల‌ల‌కే జ‌రిగాయ‌ట‌. దీన్ని దృష్టిలో ఉంచుకునే అక్క‌డి టెంట్ డీల‌ర్లు ఓ వినూత్న ఆలోచ‌న‌కు శ్రీకారం చుట్టారు.

child-marriage

రాజ‌స్థాన్‌లో ఉన్న దాదాపు 47వేల మంది మ్యారేజ్ టెంట్ డీల‌ర్లు ఒకే తాటిపై నిలిచి ఓ సాహ‌సోపేత‌మైన నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే పెళ్లి కోసం త‌మ వ‌ద్ద‌కు టెంట్ సామ‌గ్రి కావాలంటూ వ‌చ్చే వారు వ‌ధూవ‌రులిద్ద‌రి పుట్టిన తేదీ, వ‌య‌స్సు వివ‌రాల‌ను ఇవ్వాల్సి ఉంటుంది. వారి బ‌ర్త్ స‌ర్టిఫికెట్ల‌ను ప‌రిశీలించిన అనంత‌ర‌మే టెంట్ డీల‌ర్లు సామ‌గ్రిని ఇవ్వాలి. ఒక‌వేళ వ‌ధువు వ‌య‌స్సు 18 సంవ‌త్స‌రాల క‌న్నా త‌క్కువ ఉంటే డీల‌ర్లు ఆ వివాహానికి టెంట్ సామ‌గ్రి స‌ప్లై చేయ‌కూడ‌దు. దీనికి తోడు ఆ వివాహం గురించి పోలీసుల‌కు కూడా రిపోర్టు చేయాలి. ఇదే నిర్ణ‌యాన్ని తీసుకున్న రాజస్థాన్ టెంట్ డీల‌ర్స్ కిరాయ వైశ్య స‌మితి ఆ నిర్ణ‌యాన్ని ఇప్పుడు ప‌క్కాగా అమ‌లు చేస్తోంది.

దీంతో ఎక్క‌డా బాల్య వివాహం జ‌రిగేందుకు అవ‌కాశం కూడా ఉండ‌డం లేద‌ట‌. రాజ‌స్థాన్ టెంట్ డీల‌ర్లు తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని మ‌హిళా సంఘాలు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు ప్ర‌శంసిస్తున్నాయి. ప్ర‌తి చోటా ఇలాగే ఏదో ఒక విధంగా వినూత్న‌మైన ఆలోచ‌న చేస్తే మ‌న స‌మాజంలో నెల‌కొన్న సాంఘిక దురాచారాల‌ను పూర్తిగా రూపుమాపేందుకు అవ‌కాశం క‌లుగుతుంద‌ని ఆ సంఘాల ప్ర‌తినిధులు పేర్కొంటున్నారు.

Comments

comments

Share this post

scroll to top