1500 మంది శిశువులను మరణం నుంచి రక్షించిన రాజస్థాన్‌లోని మదర్స్ మిల్క్ బ్యాంక్‌లు… ఈ బ్యాంక్‌లు ఇంకా పెరిగితే అనేక మంది శిశువులను రక్షించవచ్చు…

మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన పౌష్టికాహారం కూడా కావల్సిందేనని అందరికీ తెలుసు. విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకుంటేనే శరీరం సక్రమంగా పనిచేస్తుంది. అయితే ఈ పౌష్టికాహారం కేవలం పెద్దలకే కాదు, పిల్లలకు అవసరమే. అందులోనూ అప్పుడే పుట్టిన నవజాత శిశువులకైతే ఇంకా అవసరం. మరి వారు మనం తిన్నట్టే అప్పుడే ఆహారం తీసుకోరుగా? మరి వారికి పౌష్టికాహారం అందాలంటే ఏం చేయాలి? తల్లిపాలు ఇవ్వాలి. అవును, శిశువులకు సంపూర్ణ ఆహారమంటే అవి తల్లిపాలే. కానీ నేడు అనేక కారణాల వల్ల తల్లులు తమ పిల్లలకు పాలివ్వడం మరిచిపోతున్నారు. దీని కారణంగా చిన్నారులు దీర్ఘకాలిక వ్యాధులకు గురవడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో అయితే ఏకంగా మృత్యువాత పడుతున్నారు.

ఇలా తల్లిపాలు ఇవ్వకపోవడం వల్ల మన దేశంలో ప్రతి వేయి మంది శిశువులకు 40 మంది చనిపోతున్నారు. కాగా రాజస్థాన్ రాష్ట్రంలో ఈ రేటు మరింత ఎక్కువగా ఉండడం గమనార్హం. అక్కడ ఏటా జన్మిస్తున్న నవజాత శిశువుల్లో దాదాపు 47 శాతం మంది సరైన పౌష్టికాహారం అందించకపోవడం వల్లే మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో శిశువుల మరణాలను తగ్గించేందుకు దేవేంద్ర అగర్వాల్ అనే సామాజిక వేత్త శిశువులకు పాలిచ్చేందుకు గాను దివ్య మదర్స్ పేరిట ఓ మిల్క్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశాడు. పాలను దానం చేసేందుకు ముందుకు వచ్చే తల్లుల నుంచి పాలను సేకరించి ఈ బ్యాంక్ ద్వారా అవసరం ఉన్న చిన్నారులకు పాలను అందివ్వడం మొదలు పెట్టాడు. 2013లో ఉదయ్‌పూర్‌లో రాజస్థాన్ ప్రభుత్వ సహకారంతో రూ.10 లక్షల వ్యయంతో అలా దేవేంద్ర అగర్వాల్ ప్రారంభించిన ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 1500 మంది చిన్నారులను రక్షించగలిగారు. అనేక మందికి సంపూర్ణ ఆహారాన్ని ఇవ్వగలిగారు.

mothers-milk-bank

దేశంలో మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను 1989లో ముంబైలో అర్మిదా ఫెర్నాండెజ్ ప్రారంభించారు. దీని పేరు స్నేహ మదర్స్ మిల్క్ బ్యాంక్. వీరు తల్లుల నుంచి పాలను సేకరించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పౌష్టికాహారంతో బాధపడుతున్న 5 సంవత్సరాల లోపు చిన్నారులకు ఆ పాలను ఇచ్చేవారు. అలా అలా ఈ మిల్క్‌బ్యాంక్ సేవలందిస్తూ వస్తోంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జైపూర్‌లో మహాత్మా గాంధీ హాస్పిటల్‌లో ఓ నూతన మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఇప్పటి వరకు దాదాపు 25 లక్షల మిల్లీలీటర్ల పాలను దాదాపు 74 మంది దాతల నుంచి సేకరించారు. కేవలం 2 నెలల వ్యవధిలోనే దాదాపు 196 యూనిట్ల పాలను ఈ మిల్క్‌బ్యాంక్ ద్వారా శిశువులకు అందించారు.

పౌష్టికాహార లోపం కారణంగా 5 సంవత్సరాల లోపు వయస్సున్న శిశువుల మరణాలు ప్రతి ఏటా ఎక్కువగా సంభవిస్తున్నాయని, అందుకు ప్రధాన కారణం తల్లిపాలు ఇవ్వకపోవడమేనని యునిసెఫ్ కూడా గుర్తించింది. ఈ క్రమంలో తల్లిపాల ఆవశ్యకతను గుర్తించేందుకు గాను ప్రతి ఏటా ఆగస్టు మొదటి వారంలో వరల్డ్ బ్రెస్ట్‌ఫీడింగ్ వీక్‌ను నిర్వహిస్తోంది. శిశువు పుట్టిన గంట నుంచే తల్లిపాలను ఇవ్వడం ప్రారంభించాలని, లేదంటే వారికి భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలిగేందుకు అవకాశం ఉంటుందని యునిసెఫ్ ప్రతినిధులు చెబుతున్నారు.

మదర్స్ మిల్క్ బ్యాంక్ సెంటర్లు ఎక్కువగా కలిగిన దేశాల్లో బ్రెజిల్ అగ్రస్థానంలో ఉంది. అక్కడ దాదాపు 210 మిల్క్ బ్యాంక్‌లు ఉన్నాయి. అనంతరం యూరోప్‌లో 203 మిల్క్ బ్యాంక్‌లు ఉండగా, భారత్‌లో ఈ సంఖ్య కేవలం 20గానే ఉంది. ముంబైలో 4 సెంటర్లు, పూణె, హైదరాబాద్, వడోదర, ఉదయ్‌పూర్, జైపూర్, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ నగరాల్లో ఇతర మిల్క్ బ్యాంక్ సెంటర్లు ఉన్నాయి. ఈ క్రమంలో నవజాత శిశువుల మరణాలను అరికట్టాలంటే మన దేశంలో మదర్స్ మిల్క్ బ్యాంక్ సెంటర్లను ఇంకా ఎక్కువగా నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Comments

comments

Share this post

scroll to top