మ‌ట్టిలో మాణిక్యం – రాజార‌త్నం

చ‌దువు ఒక్క‌టే మ‌న‌ల్ని మ‌నుషులుగా చేస్తుంది. విద్య లేక‌పోతే ఎన్ని కాసులున్నా వ్య‌ర్థం. భార‌త రాజ్యాంగం మ‌హోన్న‌త‌మైన‌ది. బాబా సాహెబ్ అంబేద్క‌ర్ ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల‌నే పేద‌ల‌కు చ‌దువుకునే వీలు క‌లిగింది. క‌ష్టాలు..క‌న్నీళ్ల‌ను దాటుకుని విశ్వ విద్యాల‌యానికి ఉప కుల‌ప‌తిగా ప‌ని చేయ‌డం పూర్వ జ‌న్మ సుకృతం. ఇదంతా న‌న్ను క‌న్న‌వారు ప్ర‌సాదించిన వ‌రం ..ప్రాణం పోసినందుకు ..న‌న్ను ఇంత‌టి వాడిని చేసినందుకు ఆజ‌న్మాంతం రుణ‌ప‌డి వుంటాన‌ని..విన‌మ్రంగా స్ప‌ష్టం చేస్తున్నారు ..పాల‌మూరు విశ్వ విద్యాల‌యం వైస్ ఛాన్స్‌ల‌ర్ రాజార‌త్నం. ఈ స్థాయికి రావ‌డానికి ఎన్నో నిద్ర‌లేని రాత్రులు గ‌డిపారు. సాధించాల‌న్న క‌సి..ప‌ట్టుద‌ల‌..అకుంఠిత‌మైన శ్ర‌మ‌..ఇవ‌న్నీ ప్ర‌తి ఒక్కరికి ఉండాల‌ని అభిల‌షిస్తారు. రాజ‌కీయాల‌కు, బాధ్య‌తా రాహిత్యానికి ..నిర్ల‌క్ష్యానికి కేరాఫ్‌గా మారిన ఈ యూనివ‌ర్శిటీని రాజారత్నం గాడిలో పెట్టారు. ఎలాంటి వ‌త్తిళ్ల‌కు లొంగ‌లేదు. ఎవ్వ‌రినీ ద‌రిచేర‌నీయ‌లేదు.

పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీట వేశారు. కింది స్థాయి నుండి పై స్థాయి దాకా ప్ర‌తి ఒక్క‌రు జ‌వాబుదారీగా ఉండాల్సిందేన‌ని ..ఖ‌చ్చిత‌మైన ఆదేశాలు జారీ చేశారు. అందుకు తానే ముందుండి ఆచ‌రించారు. ఎలా ఉండాలో ..ఏ ప‌ని ఎప్పుడు చేయాలో ..ద‌గ్గ‌రుండి చేసి చూపించారు. ఏ శాఖ కానివ్వండి..ముందుగా బాధ్యులు ఎవ‌రైతే నిర్వ‌హిస్తారో వారు స‌మ‌య పాల‌న పాటిస్తే మిగ‌తా వారు త‌ప్ప‌కుండా అనుస‌రిస్తారంటారు. ఆయ‌న‌పై ఎన్నో ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు..అన్నింటిని భ‌రించారు. గిరి పుత్రుడిగా ..లంబాడా జాతికి చెందిన రాజారత్నం నిజంగా తెలంగాణ ప్రాంతానికి ద‌క్కిన ఆభ‌ర‌ణం. ప్ర‌తి స‌బ్జెక్టుపై ఆయ‌న‌కు అపార‌మైన అనుభ‌వం ఉంది. అంత‌కంటే అవ‌గాహ‌న కూడా. నిన్న‌టి స‌మాచారాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటూనే ..ఇవ్వాళ ఏం జ‌రుగుతుందో నిశితంగా విడ‌మ‌ర్చి చెప్ప‌గ‌లిగే స‌త్తా ఉండ‌డంతో ..ప్ర‌భుత్వం ప‌నిగ‌ట్టుకుని రాజార‌త్నంకు ఉప కుల‌ప‌తిగా బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు.

rajarathnam palamuru university

పాల‌మూరు యూనివ‌ర్శిటీని దేశంలోనే ఆద‌ర్శ ప్రాయ‌మైన విశ్వ విద్యాల‌యంగా మార్చేందుకు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను త‌యారు చేశారు. కొద్దిపాటి సిబ్బంది, క‌న్స‌ల్టెంట్స్‌, ఇత‌రుల‌తోనే ప‌నులు చేయిస్తూ ముందుండి న‌డిపిస్తున్నారు. యుజీసీ స‌భ్యుల బృందం ఇటీవ‌ల యూనివ‌ర్శిటీని సంద‌ర్శించింది. వీసీ చేస్తున్న కృషిని ప్ర‌త్యేకంగా అభినందించింది. ప్ర‌జాప్ర‌తినిధుల‌కు విలువ ఇస్తూనే పాల‌క మండ‌లితో స‌మావేశాల‌ను ఏర్పాటు చేయ‌డం, యూనివ‌ర్శిటీ అభివృద్ధికి కావాల్సిన నిధుల‌ను ఎలా రాబట్టు కోవాలో ప్ర‌ణాళిక‌ల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న రూపొందించ‌డం..వాటిని అమ‌లు అయ్యేలా తిరిగి పాల‌కుల దృష్టికి తీసుకెళ్ల‌డం చేస్తున్నారు. అంతేకాకుండా ఎప్ప‌టిక‌ప్పుడు యూనివ‌ర్శిటీలకు ఛైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న గౌర‌వ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ నుండి ప్ర‌త్యేకంగా మ‌న్న‌న‌లు అందుకున్న ఘ‌న‌త మ‌న రాజార‌త్నందే. విద్యా ప‌రంగా అపార‌మైన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని స్వంతం చేసుకున్న ఆయ‌న‌కు తెలంగాణ ప్రాంతం ప‌ట్ల‌, చ‌రిత్ర, సంస్కృతి ప‌ట్ల గౌర‌వం ఉన్న‌ది.

ఇప్ప‌టి దాకా స్వ‌యం ప్ర‌తిప‌త్తి కోసం క‌ష్ట‌ప‌డ్డం. ఇక మ‌న‌ముందు భార‌మైన ల‌క్ష్యం ఉన్న‌ది. అది ప్ర‌తి ఒక్క‌రు అక్ష‌రాస్యులు కావాలి. ప్ర‌తి ఒక్క‌రు చ‌దువు కోవాలి. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న అన్ని కోర్సుల‌ను అభ్య‌సించేలా పిల్ల‌లు క‌ష్ట‌ప‌డాలి. ఉమ్మ‌డి జిల్లా వ్యాప్తంగా పీజీ సెంట‌ర్లు, కాలేజీల‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డంలో నిమ‌గ్నం అయ్యాం. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ఇంకా కోర్సులు రావాల్సి ఉంది. విద్యార్థుల్లో సృజ‌నాత్మ‌క‌ను పెంపొందించే కార్య‌క్ర‌మాల‌కు పెద్ద‌పీట వేస్తున్నాం. అమ్మ భాష‌ను ప్రోత్స‌హిస్తూనే..ఆంగ్ల భాష ప్రాధాన్య‌త గురించి యూనివ‌ర్శిటీ గుర్తు చేస్తోంది. ఆ దిశ‌గా శిక్ష‌ణ‌లు, సెమినార్లు, వివిధ రంగాల‌లో అనుభ‌జ్ఞుల‌ను యూనివ‌ర్శిటీకి ర‌ప్పిస్తోంది. విద్యార్థుల్లో మాన‌సికంగా , విద్యా ప‌రంగా మ‌రింత బ‌లోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామ‌ని చెబుతున్నారు.

ఖ‌మ్మం జిల్లా గార్ల మండ‌లం పుల్లూరు గ్రామానికి చెందిన గిరిజ‌న బిడ్డ రాజారత్నం ఏది మాట్లాడినా విన‌సొంపుగా ఉంటుంది. బ‌హుషా నిరుపేద కుటుంబం నుంచి అత్యున్న‌త స్థానం అందుకునేంత దాకా ఆయ‌న ప‌డిన క‌ష్టాలే ఇత‌రుల‌తో ఎలా మెల‌గాలో నేర్పించాయి. ఎవ్వ‌రినీ నొప్పించ‌క ప్ర‌తి ఒక్క‌రికి విద్య‌తో పాటు ఉపాధి క‌ల్పించాల‌న్న స‌దుద్ధేశంతో రాజార‌త్నం రేయింబ‌వ‌ళ్లు కష్ట‌ప‌డుతున్నారు. అక‌డెమిక్‌గా ఎన్నో అవార్డులు, మ‌రెన్నో పుర‌స్కారాలు అందుకున్నారు. ఎంకాంతో పాటు పీహెచ్‌డీ ప‌ట్టా ఉన్న ఆయ‌న క‌ల అంతా ఒక్క‌టే ..ప్ర‌తి బిడ్డ చ‌దువు కోవాలి. స‌మ‌స్త స‌మ‌స్య‌ల‌కు మూలం అక్ష‌ర జ్ఞానం లేక పోవ‌డం. చ‌దువుకుంటే వ‌చ్చే విలువ వేరు. స‌మాజం అభివృద్ధి చెందాలంటే విద్యావంతుల శాతం పెర‌గాలి. ఈ దేశ భ‌విష్యత్, రాష్ట్ర భ‌విష్య‌త్ నేటి యువ‌త‌రంపైనే ఆధార ప‌డి ఉంది. త‌రాలు మారినా..టెక్నాల‌జీలో మార్పులు వ‌చ్చినా మాన‌వ‌త్వం మ‌రిచి పోకూడ‌దంటారు రాజార‌త్నం.

అధ్యాప‌కుడిగా ..ఆచార్యుడిగా 30 ఏళ్ల‌కు పైగా అనుభ‌వం ఉన్న‌ది. ఇంత‌టి స్థాయి ద‌క్కుతుంద‌ని ఏనాడూ అనుకోలేదంటారు విన‌మ్రంగా. ఎన్నో మ‌లుపులు..మ‌రెన్నో క‌న్నీళ్లు..పిల్ల‌లు విలువైన కాలాన్ని విస్మ‌రిస్తున్నారు. జీవితం విలువైన‌ది..అంత‌కంటే కాలం మ‌రింత ముఖ్య‌మైన‌ది. దీనిని గుర్తించాలి. క‌ష్ట‌ప‌డాలి..ఏదో ఒక‌రోజు ..త‌ప్ప‌కుండా ఉన్న‌త‌మైన స్థానాన్ని అందుకుంటారంటారు రాజార‌త్నం. ఎన్ని వ‌త్తిళ్లున్నా..ఎంత‌గా ప‌ని భారం పెరిగినా ..ఆయ‌న పెద‌వుల‌పై చిరున‌వ్వు అలాగే ఉంటుంది. ఉద‌యం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి రాత్రి ఇంటికి వెళ్లే దాకా ..ప‌నిలోనే వుంటారు. ప‌నినే దైవంగా భావిస్తారు. స‌మ‌స్య‌లను ఎదుర్కోవ‌డం ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. స‌మ‌స్య‌లు లేక‌పోతే జీవితానికి ఏం అర్థం ఉంటుంద‌ని ప్ర‌శ్నిస్తారు. పాలమూరు విశ్వ విద్యాల‌యం అంటేనే ఆందోళ‌న‌ల‌కు కేరాఫ్‌గా ఉండేది. ఇపుడు అలాంటి జాడ‌లు లేవు. అంతా ప్ర‌శాంతం. ప్ర‌పంచానికి విద్యా వెలుగులు పంచుతూ ..చ‌దువుల కిర‌ణాల‌ను అందించిన ఉస్మానియా యూనివ‌ర్శిటీని త‌ల‌పిస్తోంది..ఈ యూనివ‌ర్శిటీ.

పాల‌క‌మండ‌లితో పాటు పాల‌కుల ప్రోత్సాహం, సిబ్బంది, ఉద్యోగులు అంద‌రూ స‌హ‌క‌రిస్తున్నారు. అందుకే యూనివ‌ర్శిటీ ప్ర‌శాంతంగా ఉంది. ఇంకా చేయాల్సింది ఉంది. పూర్తి స్తాయి సిబ్బంది లేరు. చాలా మందిని నియ‌మించాల్సి ఉంది. పీజీ సెంట‌ర్ల‌కు శాశ్వ‌త భ‌వ‌నాల నిర్మాణం కొన‌సాగుతోంది. అక్క‌డ కూడా ఉద్యోగులు అవ‌స‌రం. ఉత్తీర్ణ‌తా శాతం పెంపొందించ‌డం , యూనివ‌ర్శిటీని ఆద‌ర్శ‌వంత‌మైన విద్యాల‌యంగా మార్చ‌డం కోసమే శ్ర‌మిస్తున్నా. క‌న్న‌వారి ఆశీర్వాదం ఉండ‌డం వ‌ల్ల‌నే నేను ఈ స్థాయికి రాగ‌లిగా. ఉన్న‌త‌మైన ఆశ‌యం నా ముందున్న ల‌క్ష్యం. దానిని చేరుకుంటాన‌న్న న‌మ్మ‌కం నాకున్న‌ది. ఇక్క‌డ చ‌దువుకుంటున్న విద్యార్థులంతా నా పిల్ల‌లే. ఇదంతా మా కుటుంబ‌మే. ఆ భావ‌న‌తోనే యూనివ‌ర్శిటీని న‌డిపిస్తున్నా. అంద‌రి స‌హ‌కారం ఇలాగే ఉంటుంద‌ని ఆశిస్తున్నా. త్వ‌ర‌లోనే అన్నీ స‌ర్దుకుంటాయి. ఈ యూనివ్శిటీలో చ‌దువు కోవ‌డ‌మే మ‌హ‌ద్భాగ్యమ‌నే స్థాయికి తీసుకు రావాల‌న్న క‌సితో ప‌ని చేస్తున్నాన‌ని స్ప‌ష్టం చేస్తున్నారు వీసీ రాజారత్నం. ఆయ‌న స‌మున్న‌త స‌దాశ‌యం ఫ‌ల‌ప్ర‌దం కావాల‌ని ఆశిద్దాం.

 

Comments

comments

Share this post

scroll to top