తెలంగాణ దీప‌స్తంభం రాజా బ‌హ‌ద్దూర్.!!

రాజాబ‌హ‌ద్దూర్ వెంక‌ట్రామా రెడ్డి కోత్వాల్‌గా సుప‌రిచితులు. నిజాం న‌వాబుల ప‌రిపాల‌న కాలంలో పోలీసు అధికారిగా ప‌నిచేశారు. విశ్వాస పాత్రుడిగా ఉంటూనే ప్ర‌జ‌ల‌కు స‌హాయ సహ‌కారాలు అందించారు. వారి శ్రేయ‌స్సు కోసం అహ‌ర్నిశ‌లు పాటుప‌డ్డారు. ప్ర‌జాబంధువుగా పేరు తెచ్చుకున్నారు. ఏడు త‌రాల న‌వాబుల పాల‌న‌లో న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ ప‌ద‌వికి ఎంపికైన మొద‌టి హిందూ వ్య‌క్తి ఆయ‌న‌. ఆగ‌స్టు 22న 1869లో పాల‌మూరు జిల్లా కొత్త‌కోట మండ‌ల ప‌రిధిలోని రాయ‌ణిపేట గ్రామంలో జ‌న్మించారు. వీరి ఇంటి పేరు పాశం. త‌ల్లిదండ్రులు కేశ‌వ‌రావు, జార‌మ్మ‌. ఆయ‌న పుట్టిన‌ప్పుడే త‌ల్లి మ‌ర‌ణించింది. బాల్యంలో అమ్మ‌మ్మ కిష్ట‌మ్మ వ‌ద్ద పెరిగారు. నాలుగేళ్లు వ‌న‌ప‌ర్తి పాఠ‌శాల‌లో ఉర్దూ, ఫార్సీ భాష‌ను చ‌దివారు.

raja bahudur reddy

ఆ త‌ర్వాత విలియం వాహ‌బ్ వ‌ద్ద క‌న్న‌డ‌, మ‌రాఠీ భాష‌లు నేర్చుకున్నారు. న‌జ‌ర్ మ‌హ‌మ్మ‌ద్ స‌హాయంతో 1886లో ముదిగ్లు ఠాణాకు అమీన్ గా నియ‌మించ‌బ‌డ్డారు. అనంత‌రం నిజాం స్వంత ఎస్టేట్ వ్య‌వ‌హారాల‌లో ప్రత్యేక అధికారిగా కొంత కాలం వ్య‌వ‌హ‌రించారు. నిజాయితీ, స‌మ‌ర్థ‌త‌, విధుల నిర్వ‌హ‌ణ‌లో నిబ‌ద్ధ‌త కారణంగా అన‌తి కాలంలోనే ప‌దోన్న‌తి ల‌భించింది. పాల‌మూరు, నిజామాబాద్, క‌రీంన‌గ‌ర్, గుల్బ‌ర్గా, రంగారెడ్డి జిల్లాల‌లో పోలీసు అధికారిగా విధులు నిర్వ‌హించారు. రాజ‌ధాని న‌గ‌రంగా ఉన్న హైద‌రాబాద్‌కు నాయ‌బ్ కోత్వాల్ గా నియ‌మింప బ‌డ్డారు. ప‌నితీరుకు మెచ్చి కొత్వాల్ గా ప‌దోన్న‌తి సాధించారు. వేల్స్ యువ‌రాజు న‌గ‌రాన్ని సంద‌ర్శించిన‌ప్పుడు చ‌క్క‌ని భ‌ద్ర‌తా ఏర్పాటు చేశారు. ఆయ‌న రాజాబ‌హ‌ద్దూర్ ను ఎంత‌గానో ప్ర‌శంసించారు. 1933లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు.

వెంక‌ట‌రామారెడ్డి ఎన్నో సంస్థ‌ల‌ను పోషించారు. శ్రీ‌కృష్ణ దేవ‌రాయాంధ్ర నిల‌యం, వేమ‌న ఆంధ్ర భాషా నిల‌యం, బాల స‌ర‌స్వ‌తి గ్రంథాల‌యం పురోభివృద్ధికి స‌హాయం చేశారు. 1946 జ‌న‌వ‌రి 26న ఏపీ గ్రంథాల‌య మ‌హాస‌భ‌కు ఆయ‌న అధ్య‌క్ష‌త వ‌హించారు. హైద‌రాబాద్‌లో పేద‌లు చ‌దువు కునేందుకు గాను రెడ్డి హాస్ట‌ల్‌ను నెల‌కొల్పారు. ఇది వేలాది మందికి విద్యాదానం చేసింది. ఎంద‌రో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.విద్యా వ్యాప్తిలోను.రాజ‌కీయ చైత‌న్యం పెంపొందించ‌డం లోను ఈ వ‌స‌తి గృహం కీల‌క పాత్ర పోషించింది. హాస్ట‌ల్‌ను ప్రారంభించేందుకు గ‌ద్వాల మ‌హారాణి, వ‌న‌ప‌ర్తి రాజా, పింగ‌లి వెంక‌ట్రామారెడ్డి, పింగ‌ళి కోదండ‌రాం రెడ్డి, గోపాల్ పేట‌, దోమ‌కొండ రాజా , త‌దిత‌రుల నుండి ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు చందాలు పోగు చేశారు. వ‌చ్చిన డ‌బ్బుల‌తో తొలుత ఓ అద్దె ఇంట్లో రెడ్డి హాస్ట‌ల్‌ను ప్రారంభించారు. 1918లో ఆబిడ్స్ లో ఉన్న రెడ్డి హాస్ట‌ల్ స్వంత భ‌వ‌నంలోకి మారింది.

నారాయ‌ణ‌గూడ‌లోని ఆంధ్ర బాలికోన్న‌త పాఠ‌శాల‌కు చాలా కాలం పాటు ఆయ‌న అధ్య‌క్షులుగా ప‌నిచేశారు. ఆంద్ర విద్యాల‌యానికి ప్రెసిడెంట్ గా ఉన్నారు. 1926లో గోల‌కొండ ప‌త్రిక వ్య‌వ‌స్థాప‌కుల్లో ఒక‌రుగా ఉన్నారు. ఆయ‌న ప్ర‌తి తెలుగు సంస్థ‌కు చేతినిండా సాయం చేశారు. హ‌రిజ‌నోద్ద‌ర‌ణ‌కు ఏర్ప‌డిన సంఘాల‌తో పాటు అనాధ బాల‌ల ఆశ్ర‌మాలు, కుష్టు నివార‌ణ సంఘాల‌కు ఎన‌లేని తోడ్పాటు అందించారు. 1933లో రెడ్డి బాలిక‌ల హాస్ట‌ల్ ను నారాయ‌ణ‌గూడ‌లో , రెడ్డి మ‌హిళా కాలేజీని ప్రారంభించారు. ఆయ‌న స్మార‌కార్థం రాయ‌ణిపేట ప‌క్క‌నే ఉన్న విలియంకొండ వ‌ద్ద 32 ఎక‌రాల స్థ‌లంలో ఆర్బీవీఆర్ పేరుతో స్కూల్‌ను ఏర్పాటు చేశారు. త‌క్కువ ఫీజుతో అన్ని వ‌ర్గాల వారు చ‌దువుకునేలా చేస్తోంది ఈ పాఠ‌శాల‌.

నిజాం రాజు 1921లో రాజా బ‌హ‌ద్దూర్ అనే పేరుతో బిరుదు ప్ర‌సాదించారు. బ్రిటిష్ స‌ర్కార్ 1931లో ఆర్డ‌ర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ గా స‌త్క‌రించింది. నారాయ‌ణ‌గూడ చౌర‌స్తాలో రెడ్డి పేరుతో కాంశ్య విగ్ర‌హం ఏర్పాటు చేశారు. మ‌హిళా కాలేజీ ని స్థాపించారు. రెడ్డి పేరుతో ట్ర‌స్టు ఏర్పాటైంది. హైద‌రాబాద్, సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలో ప్ర‌తిభ క‌న‌బ‌రిచే పోలీసుల‌కు ప్ర‌తి ఏటా ఆయ‌న పేరుతో అవార్డుల‌ను బ‌హూక‌రిస్తున్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో ఇత‌ర ప్రాంతాల్లో రెడ్డి కాంస్య విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించారు.

ప‌ద్నాలుగు ఏళ్ల పాటు సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేసి.గ్రామీణ పిల్ల‌ల చ‌దువుల కోసం రెడ్డి హాస్ట‌ల్‌ను స్తాపించి.ఎంద‌రో వెలుగులోకి వ‌చ్చేందుకు కార‌కుడైన‌.కారణ‌జ‌న్ముడైన ఆ మ‌హానుభావుడు కోత్వాల్ వెంక‌ట‌రామారెడ్డి 1953 జ‌న‌వ‌రి 25న ఈ లోకం నుండి సెల‌వు తీసుకున్నారు. ఆయ‌న స‌మాధి రామ‌కృష్ణ మ‌ఠం ప‌క్క‌నే ఉంది. వీలైతే సంద‌ర్శించండి.

Comments

comments

Share this post

scroll to top