మన దేశంలో రైళ్లలో ప్రయాణికులకు ఎలాంటి సదుపాయాలు అందుతాయో అందరికీ తెలిసిందే. వాటిపై అనేక మంది జోకులు కూడా పేలుస్తుంటారు. టైమకు ట్రెయిన్స్ రావని, వచ్చినా సీట్లు దొరకవని, వాటిల్లో సదుపాయాలు సరిగ్గా ఉండవని అనేక మంది ఫిర్యాదులు చేస్తుంటారు. కొందరు అవేమీ పట్టించుకోరు. అయితే ఆ పెద్దాయన మాత్రం అలా కాదు. ఏసీ కోచ్‌లో టిక్కెట్ రిజర్వేషన్ చేసుకుని అందులో ఎక్కాక ఏసీ పనిచేయలేదు. దీంతో ఆయన ఊరుకోలేదు. విషయాన్ని వినియోగదారుల కోర్టుకు తీసుకెళ్లాడు. దీంతో రైల్వే వారు ఆ వృద్ధుడికి రూ.12వేల జరిమానా చెల్లించనున్నారు.
అతని పేరు డాక్టర్ శేఖర్. వయస్సు 58 సంవత్సరాలు. మార్చి 9, 2015వ తేదీన బెంగుళూరు నుంచి మైసూర్ కు వెళ్లేందుకు గాను టిపు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ కోచ్ సీ1లో టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. ట్రెయిన్ సరైన టైముకే వచ్చింది. ఎక్కాడు. అయితే రైలు అలా కొంత దూరం వెళ్లిందో లేదో ఆ కోచ్‌లో ఉండే ఏసీ పనిచేయలేదు. దీంతో శేఖర్ ట్రెయిన్లో ఉండే సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. వారు వచ్చి ఏసీని చూశారు. అయినా రిపేర్ చేయడం వారి వల్ల కాలేదు. దీంతో శేఖర్‌తోపాటు ఆ కోచ్‌లో ఉన్న ప్రయాణికులు దాదాపు 3 గంటల ప్రయాణంలో నరకం అనుభవించారు. ఏసీ కోచ్‌లు కావడం, బయటి నుంచి గాలి రాకపోవడంతో వారు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఈ క్రమంలో శేఖర్ వృద్ధుడు కావడంతో ఆయనకు సమస్య ఇంకా ఎక్కువైంది. దీంతో ట్రెయిన్ దిగిన వెంటనే ఆయన కర్ణాటక స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రస్సల్ కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు. దీంతో దాదాపుగా 2 ఏళ్లకు పైబడి విచారణ సాగింది. ఈ క్రమంలోనే తాజాగా కమిషన్ ఈ కేసులో తీర్పునిచ్చింది. బాధితునికి రూ.10వేలు ప్లస్ రూ.2వేల ఖర్చులు మొత్తం కలిపి రూ.12వేలను చెల్లించాలని కమిషన్ తీర్పునిచ్చింది. త్వరలో సౌత్ వెస్ట్రన్ రైల్వే వారు ఆ మొత్తాన్ని బాధితునికి చెల్లించనున్నారు. అసలు ఎవరైనా తమకు రైళ్లలో సమస్య ఎదురైతే ఇలా చేయాల్సిందే. అప్పుడు గానీ ప్రయాణికుల సౌకర్యాలపై రైల్వే వారికి కనువిప్పు కలగదేమో..!